చెప్పినట్టు పెళ్లిచేసుకుంటే ఇంట్లో డిన్నర్ ఇస్తా... కొత్త జంటలకు ఎస్పీ ఆఫర్!

ABN , First Publish Date - 2021-04-26T23:48:42+05:30 IST

కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ వివాహం చేసుకునే కొత్త జంటలకు ఓ జిల్లా ఎస్పీ వినూత్న ఆఫర్ ప్రకటించారు....

చెప్పినట్టు పెళ్లిచేసుకుంటే ఇంట్లో డిన్నర్ ఇస్తా... కొత్త జంటలకు ఎస్పీ ఆఫర్!

భోపాల్: కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ వివాహం చేసుకునే కొత్త జంటలకు ఓ జిల్లా ఎస్పీ వినూత్న ఆఫర్ ప్రకటించారు. 10 మంది అంతకంటే తక్కువ మంది అతిథులతో వివాహం చేసుకునే వధూ వరులకు తన ఇంట్లో పసందైన డిన్నర్ ఇస్తానని మధ్య ప్రదేశ్‌లోని బింధ్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వివాహ వేడుకల్లో కేవలం 50 మంది మాత్రమే పాల్గొనాలి. జిల్లాలోని కుర్తారా గ్రామంలో జరిగిన ఓ పెండ్లి విందులో పెద్ద సంఖ్యలో అతిథులు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా మ్యూజిక్‌కు డాన్స్‌లు చేస్తున్న ఓ వీడియో వైరల్ అయిన నేపథ్యంలోనే ఎస్సీ మనోజ్ కుమార్ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చూసేందుకు తనవంతు బాధ్యతగా ఈ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.


‘‘పది లేదా అంతకంటే తక్కువ మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకునే వధూవరులకు నా ఇంట్లో పసందైన డిన్నర్ ఇస్తాను. అలాంటి జంటకు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించినందుకు మెమెంటోలు కూడా ఇస్తాం. వారిని ఇంటి నుంచి తీసుకొచ్చేందుకు, విందు తర్వాత ఇంటికి పంపేందకు ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేస్తాం..’’ అని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ప్రకటన చేసి రెండు రోజులు అవుతున్నా ఇంత వరకు ఒక్క జంట కూడా ఈ ఆఫర్‌ను వినియోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 30న పది మంది సమక్షంలోనే తాము వివాహం చేసుకుంటామని రెండు జంటలను నన్ను సంప్రదించాయి. వాళ్లు గనుక అలా చేస్తే.. నా కుటుంబ సభ్యులతో కలిసి వారి కోసం రెండు డిన్నర్‌లు ఏర్పాటు చేస్తాను..’’ అని  ఎస్పీ మనోజ్ తెలిపారు. కాగా ఆదివారం భింద్ జిల్లాలో మరో 44 మంది కరోనా బారిన పడగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  ప్రస్తుతం జిల్లాలో 221 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-04-26T23:48:42+05:30 IST