ముంచిన నకిలీ విత్తనం

ABN , First Publish Date - 2022-06-23T05:27:01+05:30 IST

సోయా రైతులను నకిలీ విత్తనం నిండా ముంచింది. జిల్లాలో సోయా పంటను సాగు చేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. విత్తనం విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను నకిలీ బెడద వెంటాడుతునే ఉంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే సోయా విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.

ముంచిన నకిలీ విత్తనం
జైనథ్‌ మండలంలో మొలకెత్తని సోయా విత్తనాలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖాధికారులు

పక్షం రోజులైన మొలకెత్తని విక్రాంత్‌, ఈగల్‌ సోయా విత్తనాలు

విత్తనం మొలకెత్తక పోవడంతో రైతు ఆత్మహత్య

జైనథ్‌, బేల, తలమడుగు మండలాల్లో వేలాది ఎకరాలలో నష్టం

సాగుపై కరువైన వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ

నకిలీ సీడ్స్‌ వ్యాపారులపై పీడీ యాక్టును  నమోదు చేయాలని డిమాండ్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సోయా రైతులను నకిలీ విత్తనం నిండా ముంచింది. జిల్లాలో సోయా పంటను సాగు చేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. విత్తనం విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను నకిలీ బెడద వెంటాడుతునే ఉంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే సోయా విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. అధికారుల నిండు నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసి వస్తోంది. వానాకాల సీజన్‌ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలను కట్టడి చేయకపోవడంతో రైతులను నట్టేట ముంచుతున్నారు.గతంలో కింగ్‌ నకిలీపత్తి విత్తనాలతో జిల్లావ్యాప్తంగా 8,886 ఎకరాల్లో పంట దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో 3,250 మంది రైతులకు రూ.13కోట్ల నష్టంవాటిలినట్లు అధికారులు అంచనా వే శారు. ఈ యేడు కూడా అవే పరిస్థితులు ఎదురుకావడంతో సుమారుగా వెయ్యి ఎకరాలలో రైతులు విక్రాంత్‌, ఈగల్‌ సోయా విత్తనాలను వేసి నష్టపోయారు. ఇప్పటి వరకు సుమారుగా రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అసలు నిబంధనల ప్రకారం విత్తనాలు వేసేముం దు మండలస్థాయి అధికారులు వివిధ రకాల కంపెనీలకు సంబంధించి న విత్తనాలను ఎంచుకుని నాణ్యత పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. కాని అధికారులు అలా చేయకపోవడంతోనే రైతులు ప్రతీసారి నష్ట పో వాల్సి వస్తుంది. ఈ యేడు సీజన్‌లో జిల్లాలో 5లక్షల 71వేల 381ఎకరాల లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 82వేల ఎకరాలలో సోయా పంట సాగైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. యేటా నకిలీ విత్తనాలతో జిల్లా రైతులు నష్టపోతున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు కావడంతోనే నకిలీ విత్తనాలకు అడ్డూఅదుపు లేకుండానే పోతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నా యి. బుధవారం నకిలీ సోయా విత్తనాలను విక్రయించిన విత్తన వ్యాపారులపై పీడియాక్టును నమోదు చేయాలని జైనథ్‌ మండలానికి చెందిన పలువురు రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. 

తేలికగా తీసుకోవడమే..

జిల్లాలో యేటా నకిలీ విత్తనాల భాగోతం వెలుగు చూస్తునే ఉంది. అయిన అధికారులు తేలికగా తీసుకోవడంతో నకిలీ విత్తనాల దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రారంభంలోనే నకిలీ విత్తనాలను అరికట్టి ఉం టే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావన్న వాదనలు వినిపిస్తున్నా యి. నకిలీ విత్తనాలను విక్రయించిన వ్యాపారులపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేయకుండానే వదిలేయడంతో యేటా నకిలీ విత్తనాల తో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. నకిలీ విత్తనాల వ్యవహరాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీసులు తేలికగానే తీసుకోవడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిలో బఢావ్యాపారు లు ఉండడంతోనే చర్యలు తీసుకునేందుకు అధి కారులు వెనుకాడుతున్నారన్న ఆరోపణలు వ స్తున్నాయి. రైతులు ఇచ్చిన సమాచారం మేర కు జైనథ్‌ మండలంలోని కూర, కరంజి, మా రుగూడ గ్రామాలలో వ్యవసాయ శాఖాధికారులు పర్యటించి పరిశీలించారు. విత్తన నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని అన్నదాతలు పేర్కొనడంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీకి పరీక్ష ల నిమిత్తం విక్రాంత్‌ సోయా విత్తనాలను పంపించారు. అలాగే తలమడుగు మండలంలో వందలాది ఎకరాల్లో ఈగ ల్‌ కంపెనీకి చెందిన త్రిషికా జెఎస్‌- 9305 రకం గల సోయా విత్తనాలు మొలకెత్తలేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. సం బంధిత సీడ్‌ వ్యాపారి స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారుల ఒత్తిళ్లతో నకిలీ సోయా విత్తనాలను తారు మారు చేసే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఒకవేళ విత్తన నాణ్యత లేదని తేలితేనే రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది.  

ప్రాణాలు పోతున్నా.. పట్టింపేదీ?

యేటా నకిలీ విత్తనాలతో నిండా మునుగుతున్న రైతులు మనోవేదన కు గురై పెట్టిన పెట్టుబడులు చేతికి రావన్న బెంగతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అయిన వ్యవసాయ శాఖాధికారులకు పట్టింపే లేకుండా పోతోంది. అధికారుల నిండు నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతుం ది. సీజన్‌ ప్రారంభంలోనే కఠినంగా వ్యవహరించి ఉంటే నకిలీ విత్తనాలకు అవకాశమే లేకుండా పోయేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విత్తన వ్యాపారుల తో  సంబంధిత అధికారులు కుమ్మకు కావడంతోనే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తోందన్న విమర్శలు సర్వత్రా వస్తున్నా యి. ప్రతియేటా వ్యవసాయ శాఖాధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నా.. వారి పని తీరు మాత్రం మారడం లేదు. ప్రతియేటా జైనథ్‌, బేల మండలాల్లోనే పత్తి, సోయా రైతులు నకిలీ విత్తనాలతో నష్ట పోతున్నారు. నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తక పోవడంతో జైనథ్‌ మండలం మారుగూడ గ్రామానికి చెందిన పడాల నాగన్న(52) అనే రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో అతిపెద్ద మండలంగా గుర్తింపు పొందిన జైనథ్‌లోనే ఎక్కువగా సోయా పంటను సాగు చేస్తారు. అయితే యేటా నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నా.. వ్యవసాయ శాఖ అధి కారులు కట్టడి చర్యలు చేపట్టడం లేదు. సీజన్‌ ప్రారంభంలో ఏదో హడావుడి చేయడం, ఆ తర్వాత అందినకాడికి దండుకుంటూ నకిలీ విత్తన వ్యాపారులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యేడు సీజన్‌లో సోయా నకిలీ విత్తనాల విక్రయాలు వెలుగు చూసిన నామమాత్రంగానే చర్యలు తీసుకుని వదిలేశారన్న ఆరోపణలున్నాయి.

డీలర్లపై పీడీ యాక్టు నమోదు చేయాలి

: ఏనుగు రాకేష్‌రెడ్డి, సోయా రైతు, జైనథ్‌ మండలం

నకిలీ విత్తనాలను విక్రయించిన వ్యాపారులపై పీడీ యాక్టును నమోదు చేయాలి. జిల్లా కేంద్రంలోని నిఖిల్‌ ఫర్టిలేజర్‌ షాప్‌, జైనథ్‌ మండలంలోని కూర గ్రామంలో గల పొన్ను స్వామి రైతు ఆగ్రో సేవా కేంద్రం డీలర్లపై నకిలీ సోయా విక్రాంత్‌ రకం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వ్యవసాయ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రతియేటా నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తుంది.

విత్తన నాణ్యతను పరిశీలనకు పంపించాం

: వివేక్‌, ఏవో, జైనథ్‌ మండలం

జైనథ్‌లో విక్రాంత్‌ సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు సమాచారం ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాం. విత్తన నాణ్యత పరిశీలనకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీకి పంపించాం. యూనివర్సిటీ నుంచి నివేదిక రాగానే విక్రాంత్‌ సోయా విత్తన కంపెనీ, విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. రైతులు వేసిన విత్తనా లు నకిలీవని తేలితేనే నష్టపరిహారం వస్తుంది. ఇతర కారణాల చేత మొలకెత్తకపోతే రైతులే భరించాల్సి ఉంటుంది. గత పక్షం రోజులుగా సరైన వర్షాలు లేకపోవడం కూడా ఇబ్బంది కరంగా మారింది. ఏది ఏమైనా శాస్త్రవేత్తల నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటాం.  

Updated Date - 2022-06-23T05:27:01+05:30 IST