ముంచిన గాలీవాన

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

చేతికొచ్చిన పంటను గాలీవాన మింగేసింది. మట్టి మనిషి శ్రమను నీటిలో కలిపేసింది.

ముంచిన గాలీవాన
శ్రీరంగాపురంలో దెబ్బతిన్న వరి పంటను చూపిస్తున్న రైతులు

  1. తడిసిన మొక్కజొన్న ధాన్యం
  2. నేలకొరిగిన వరి, మొక్కజొన్న పైర్లు
  3. పాలకంకి దశలో దెబ్బకొట్టిన ప్రకృతి
  4. రూ.4 కోట్ల వరకు పెట్టుబడి నష్టం


రుద్రవరం, అక్టోబరు 21: చేతికొచ్చిన పంటను గాలీవాన మింగేసింది. మట్టి మనిషి శ్రమను నీటిలో కలిపేసింది. రుద్రవరం మండలంలో బుధవారం రాత్రి భీకర గాలులతో కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. వరుసగా మూడో ఏడాదీ నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. డి.కొట్టాల, టి.కొట్టాల, శ్రీరంగాపురం, ఎల్లావత్తుల, పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, కొండమా యపల్లె గ్రామాలలో 700 ఎకరాల్లో వరి పైరు, 150 ఎకరాల్లో మొక్కజొన్న నేలపాలైంది. రుద్రవరం, అప్పనపల్లె, గోనంపల్లె, నరసాపురం, వెలగలపల్లె, ముత్తలూరు, ఆర్‌.నాగులవరం తదితర గ్రామాల్లో 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. 700 ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. వరి రైతులు ఎకరానికి రూ.30 వేల ప్రకారం రూ.2.10 కోట్ల పెట్టుబడి నష్టపోయారు. 150 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలడంతో రూ.48 లక్షలు, 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసి పోవడంతో రూ.80 లక్షలు రైతులు నష్టపోయారు. 


20 ఎకరాల్లో వరి ధ్వంసం.. 


20 ఎకరాల పొలాన్ని కౌలు తీసుకుని వరి సాగు చేశాను. కంకి దశలో ఉన్న వరిపైరు నేలపాలైంది. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. ఒక పడి గింజలు కూడా చేతికందవు. ఖరీఫ్‌ సీజన్‌ రైతులను నష్టాల్లో ముంచింది.


- ముడియం నరసింహారెడ్డి, రైతు, డి.కొట్టాల 


పడి గింజలూ మిగల్లేదు..


16 ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు నేలకొరిగింది. పడి గింజలు కూడా చేతికందవు. కంకిదశలో గింజలు పాలెక్కుతున్న సమయంలో గాలీవాన నాశనం చేసింది. పెట్టుబడి మట్టిలోపోసినట్లైంది. 


- సంతోష్‌రెడ్డి, రైతు, డి.కొట్టాల 


ప్రభుత్వం ఆదుకోవాలి..


గాలి, వాన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయాం. 21 ఎకరాల్లో వరి పైరు సాగు చేశాను. 10 ఎకరాల్లో పంట నేలపాలైంది. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. పైసా కూడా చేతికందే పరిస్థితి లేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.


- నవకాంత్‌ రెడ్డి, రైతు, డి.కొట్టాల 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST