Abn logo
Sep 24 2021 @ 19:48PM

ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో వృద్ధి

న్యూఢిల్లీ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో వృద్ధి నమోదైంది. 2021 సెప్టెంబరు 22నాటికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.5,70,568 కోట్లు వసూలైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో రూ.3,27,174 కోట్లు వసూలైంది. అంటే 74.4 శాతం వృద్ధి కనిపించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చినపుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2021 సెప్టెంబరు 22నాటికి నికర వసూళ్ళలో 27 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. 


2021 సెప్టెంబరు 22నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు రూ.5,70,568 కోట్లు. దీనిలో కార్పొరేట్ పన్నులు రూ.3,02,975 కోట్లు (నెట్ ఆఫ్ రిఫండ్), వ్యక్తిగత ఆదాయపు పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 


2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తీవ్రమైన సవాళ్ళు ఎదురైనప్పటికీ రెండో త్రైమాసికంలో (1 జూలై-22 సెప్టెంబరు) అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ పెరిగినట్లు తెలిపింది. ఈ కాలంలో రూ.1,72,071 కోట్లు వసూలైందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2020-21లో) ఇదే సమయంలో వసూలైనది రూ.1,13,571 కోట్లు అని తెలిపింది. అంటే అంతకుముందు కన్నా ప్రస్తుతం వసూళ్ళలో వృద్ధి 51.50 శాతమని వివరించింది.