ఇన్‌చార్జిలే దిక్కు..

ABN , First Publish Date - 2022-06-23T06:41:11+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు గాను ఉండాల్సిన రెగ్యులర్‌ మండల విద్యాధికారి పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

ఇన్‌చార్జిలే దిక్కు..

- రెగ్యులర్‌ ఎంఈవోలు లేక పర్యవేక్షణ గాలికి..

- ఆరుగురు హెచ్‌ఎంలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు

- అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ పాఠశాలలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు గాను ఉండాల్సిన రెగ్యులర్‌ మండల విద్యాధికారి పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి మండల విద్యా శాఖాధికారి పోస్టులను ఖాళీగా ఉంచడంతో సీనియర్‌ హెడ్‌ మాస్టర్లతోనే నెట్టుకు రావాల్సి వస్తున్నది. జిల్లాలో 14 మండలాలు ఉండగా వీటిలో ఏ ఒక్కరు రెగ్యులర్‌ మండల విద్యాశాఖాధికారి లేకపోవడం గమనార్హం. ఆరుగురు సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. మంథని, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు మంథని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ఇన్‌చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లి మండలాలకు పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి హెచ్‌ఎం సురేందర్‌కుమార్‌ ఎంఈవోగా పని చేస్తున్నారు. కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం మండలాలకు కమాన్‌పూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సంపత్‌ కుమార్‌ ఎంఈవోగా పని చేస్తున్నారు. జూలపల్లి, ఎలిగేడు మండలాలకు ధూళికట్ట ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కవిత ఎంఈవోగా పని చేస్తున్నారు. ధర్మారం మండలానికి ధర్మారం జడ్పీ పాఠశాల హెచ్‌ఎం ఛాయాదేవి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాలకు కొలనూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఆరెపల్లి రాజయ్య ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఎంఈవోలు వారికి కేటాయించిన మండలాల్లోని పాఠశాలలను పర్యవేక్షించడంతో పాటు వారు పనిచేసే పాఠశాలల పర్యవేక్షణ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. పనిభారం వల్ల సదరు అధికారులు అన్ని పాఠశాలలను పర్యవేక్షించలేక పోతున్నారు. ఒక్కో మండలానికి ఒక సీనియర్‌ హెచ్‌ఎంకు బాధ్యతలు అప్పగించకుండా నిబంధనలు ఉండడం వల్ల ఉన్న వారినే సర్దుబాటు చేస్తున్నారు. 

- అలవెన్సులూ కరువు..

మంథని హెచ్‌ఎంకు మంథని, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాల బాధ్యతలు ఉండడంతో వీటిలో ప్రభుత్వ పాఠశాలలు అధికంగా ఉంటాయి. వీటికి తోడు ప్రైవేట్‌ పాఠశాలలు కూడా ఇక్కడనే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి హాజరవుతున్నారా, లేదా, విద్యార్థులకు విద్యా బోధన ఎలా జరుగుతున్నది, పాఠ్య పుస్తకాల సరఫరా, యూనిఫామ్‌ల పంపిణీ, తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు ఎంఈవోలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కనీసం రోజుకు ఒక్క పాఠశాలనైనా ఎంఈవోలు సందర్శించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలే గాకుండా ప్రైవేట్‌ పాఠశాలలను కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. సదరు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా, లేదా చూడాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ, మన ఊరు మన బడి, బడి బాట లాంటి కార్యక్రమాలను కూడా మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు పరిశీలన వంటివి చేయాల్సి ఉంటుంది. కానీ 14 మండలాలకు కేవలం ఆరుగురు హెచ్‌ఎంలకు మాత్రమే బాధ్యతలు అప్పగించడంతో పాఠశాలల పర్యవేక్షణ గాలికి వదిలి నట్లయ్యింది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అలవెన్సులు కూడా ఇవ్వకపోవడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం మండల, జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలకు, నివేదికలు పంపడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 

- కోర్టు కేసులతో..

చివరిసారిగా రెగ్యులర్‌ ఎంఈవోలను ప్రభుత్వం 2005 సంవత్సరంలో నియమించింది. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విభాగం, స్థానికసంస్థల విభాగాల్లో వేర్వేరుగా పాఠశాలలను నిర్వహిస్తుండడంతో ఎంఈవోలుగా పదోన్నతులు కల్పించే విషయమై తమకంటే తమకే ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొందరు హెచ్‌ఎంలు కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది హెచ్‌ఎంలు ఎంఈవోలు అయ్యే అవకాశాలను కోల్పోయారు. అప్పటి నుంచి సీనియర్‌ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈవో బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ ఎంఈవోలను నియమించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు. 



Updated Date - 2022-06-23T06:41:11+05:30 IST