Abn logo
Nov 22 2020 @ 21:02PM

పంచాయత్‌

అద్భుతమైన సన్నివేశాలు, మలుపులు ఉన్న గొప్ప కథేం కాదు ఇది. కానీ చూస్తున్నంతసేపూ చిరునవ్వు మీ మొహాల మీదనుంచి మాయమవదు. అంతా మనకి ముందే తెలిసిపోయే కథలాగే అనిపిస్తూనే ఏదో ఒక విధంగా మనల్ని ఆశ్చర్యానికి గురిచేయడం ఈ సీరీస్‌ ప్రత్యేకత. మామూలుగా ఇలాంటి కథలో ఒక హీరోయిన్‌ ఉంటుంది. హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఊర్లో తెలియకుండా కాసేపు కథ నడుస్తుంది. కానీ ఇలాంటి కథనం వైపు వెళ్ళకుండా ఆశ్చర్యానికి గురిచేస్తారు ఈ సీరీస్‌ కథా రచయితలు.


కథలు ఎలా రాస్తారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఇవాళ మనం ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు. గూగుల్‌లో వెతకొచ్చు. లేదంటే ఇదివరకే కథలు రాసిన రచయితలను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ కొత్తరకం కథలు ఎలా రాస్తారు? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం మాత్రం కొంచెం కష్టమైన విషయమే!


ఉదాహరణకు ఒక ప్రేమ కథ రాయాలనుకుందాం. ఏముంటుంది కొత్తగా రాయడానికి. ఒకబ్బాయి. ఒకమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. అది కులమో, మతమో, ఆస్తులో, అంతస్థులో- ఇలా  ఏదో ఒకటి. ఆ అడ్డంకి కొత్తదైనప్పుడు కథ కూడా మారుతుంది. కథ కొత్తదవుతుంది. ఇంకా ఎక్కువరోజులు బతకమని ముందే తెలుసుకున్న ఒక అమ్మాయి ఒకబ్బాయి ప్రేమలో పడితే ‘గీతాంజలి’ అయింది, కొత్త కథ అయింది. ప్రేమించిన అమ్మాయితో  సినిమా చివరిదాకా అబ్బాయి ప్రేమిస్తున్న విషయం తెలియకపోవడం ‘తొలిప్రేమ’ అయింది, కొత్త ప్రేమ కథ అయింది. తెలిసిన కథనే కొత్తగా చెప్పినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. ఈ విషయాన్ని బాగా తెలుసుకున్న ప్రొడక్షన్‌ కంపెనీ ఏదైనా ఉందంటే అది ఖీగఊ అని చెప్పొచ్చు.


ఖీగఊ  నిర్మాణంలో వచ్చిన ఏ వెబ్‌ సీరీస్‌ చూసినా ఈ విషయం మనకి ఇట్టే అర్థం అవుతుంది. మనకి తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నమే ఖీగఊ  దేశంలోనే అత్యుత్తమ కంటెంట్‌ క్రియేషన్‌ కంపెనీగా ఎదగడానికి కారణం. ఈ సంస్థ నిర్మించిన ఎన్నో మంచి వెబ్‌ సీరీస్‌లలో ఒకటి ‘పంచాయత్‌’. 


హీరో ఎక్కడో పట్టణంలో పెరిగి ఉంటాడు. పల్లెటూరి గురించి ఏమీ తెలియదు. కానీ అనుకోని పరిస్థితుల్లో పల్లెటూరులో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. మొదట్లో హీరో ఆ పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడలేక ఇబ్బందులు పడతాడు. తర్వాత ఒక్కొక్కటిగా ఆ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపిస్తూ ఆ ఊరివాళ్ల అప్యాయతను సంపాదిస్తాడు. చివరికి ఆ ఊరిలో ఒకడిగా నిలబడతాడు. 


ఈ కథతో మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి. హిందీలో ‘స్వదేశ్‌’, తెలుగులో ‘శ్రీమంతుడు’ లాంటివి కొన్ని ఉదాహరణలు. ఇలాంటి ఒక కథనే తీసుకుని దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నమే ‘పంచాయత్‌’.

అభిషేక్‌ పట్టణంలో చదువుకున్నాడు, తన క్లాస్‌మేట్స్‌ అందరూ ప్రైవేట్‌ కంపెనీలలో మంచి ఉద్యోగాలలో చేరారు. కానీ అభిషేక్‌కి ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా గ్రామ పంచాయితీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ ఊరి సర్పంచ్‌ మంజుదేవి అనే మహిళ. కానీ పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ చూసేది మొత్తం ఆమె భర్త భూషణే. అసలే ఇష్టం లేని ఉద్యోగం. అందులోనూ ఆ పల్లెటూర్లో ఊరి బయట ఉండే పంచాయతీ ఆఫీస్‌లోనే ఉండాల్సిరావడం ఒక సమస్య. అయితే అభిషేక్‌ ఆ ఊరికి వచ్చిన రోజే పంచాయితీ ఆఫీస్‌ తాళం చెవి పోవడం, దాన్ని వెతుకుతూ ఊరంతా తిరగాల్సి వచ్చింది. తన బైక్‌ తీసుకుని తాళం తెరిచేవాడిని తీసుకొస్తానని వెళ్లిన పంచాయితీ ఆఫీస్‌లో పనిచేసే కుర్రాడు ఎంతకీ రాడు. దాంతో అతనికి ఆ ఊరి మీద, తన ఉద్యోగం మీద చిర్రెత్తుకొస్తుంది. కానీ తప్పదు. ఈ ఉద్యోగం అతనికి చాలా ముఖ్యం. ఎలాగో తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి కొంచెం రిలాక్స్‌ అవుదామనుకున్నాడో లేదో కరెంట్‌ పోయింది. ‘దేవుడా’ అనుకుంటూ కూలబడిపోయాడు అభిషేక్‌.


వచ్చిన మొదటి రోజే ఎన్ని కష్టాలో పాపం అతనికి. ఇన్ని కష్టాల మధ్య అభిషేక్‌ ఆ ఊర్లో ఉండగలిగాడా? పారిపోయాడా? తెలుసుకోవాలంటే ‘పంచాయత్‌’ వెబ్‌ సీరీస్‌ చూడాల్సిందే!


అద్భుతమైన సన్నివేశాలు, మలుపులు ఉన్న గొప్ప కథేం కాదు ఇది. కానీ చూస్తున్నంతసేపూ చిరునవ్వు మీ మొహాల మీదనుంచి మాయమవదు. అంతా మనకి ముందే తెలిసిపోయే కథలాగే అనిపిస్తూనే ఏదో ఒక విధంగా మనల్ని ఆశ్చర్యానికి గురిచేయడం ఈ సీరీస్‌ ప్రత్యేకత. మామూలుగా ఇలాంటి కథలో ఒక హీరోయిన్‌ ఉంటుంది. హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఊర్లో తెలియకుండా కాసేపు కథ నడుస్తుంది. కానీ ఇలాంటి కథనం వైౖపు వెళ్ళకుండా ఆశ్చర్యానికి గురిచేస్తారు ఈ సీరీస్‌ కథా రచయితలు.


అలాగే మంజుదేవిని సర్పంచ్‌గా ఊరి వాళ్లు ఎన్నుకున్నప్పటికీ ఆమె స్థానంలో అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న ఆమె భర్త భూషణ్‌ పాత్రను కొంత విలనిజంతో సృష్టించడం సాధారణ రచయితలు చేసే పని. కానీ అలాంటి కార్డ్‌ బోర్డ్‌ పాత్ర చిత్రణ కాకుండా రక్తమాంసాలున్న నిజమైన పాత్రను సృష్టించి ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా పాత్రలను ప్రెజెంట్‌ చేశారు.


ఈ సంస్థ నిర్మాణంలో వచ్చిన వెబ్‌సీరీస్‌లను ఒకసారి గమనించినట్టయితే అందులోని పాత్రలు చాలా వరకు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఆ పాత్రలన్నింటికీ ఏవో కొన్ని కోరికలుంటాయి. ఆ కోరికలు జీవితంలో సృష్టించే పరిస్థితుల ఆధారంగానే కథ నడుస్తుండడం వల్ల ప్రేక్షకులను ఆ కథలు సులభంగా ఆకట్టుకుంటాయి. కథల్లోని పాత్రలు చిన్నవైనా సీరీస్‌ మొత్తాన్ని నడిపించే పెద్దవైనా కూడా ఈ సూత్రాన్ని పాటిస్తాయి


ఉదాహరణకు, ‘పంచాయత్‌’ సీరీస్‌లో ఒకే సీన్‌లో వచ్చే ఎలక్ట్రీషియన్‌ పాత్రే తీసుకుందాం. అతను ఆ ఊర్లో జరిగే పెళ్లికి డెకరేషన్‌ లైట్లు పెట్టడానికి వస్తాడు. తన పని తాను చేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ అక్కడ పెట్టాల్సిన సీరియల్‌ లైట్లు ఎలాంటివి ఉండాలని హీరో అభిషేక్‌తో చర్చించి అతని కోపానికి కారణమవుతాడు.


ఇలా కథలోని అన్ని పాత్రలకు ఒక వ్యక్తిగతమైన సంతకాన్ని ఇవ్వడం, కథలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు వారు ఎంచుకున్న నిర్ణయాలు, లేదా వారి నిర్ణయాలు కల్పించిన పరిస్థితులు, వీటి ద్వారా పాత్రల మధ్య ఏర్పడ్డ సంఘర్షణ - ఇదంతా మన జీవితంలో జరిగినట్టో, లేదా మనం అక్కడే దగ్గరుండి ఈ డ్రామానంతా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా నటీనటులతో మాట్లాడి, వారి స్వరాలు, మాట్లాడే విధానాన్ని బట్టి వారి కోసం ప్రత్యేకమైన శైలిలో డైలాగ్స్‌ రాయడం కూడా ఖీగఊ ప్రత్యేకత. అన్నింటికీ మించి మనం మర్చిపోయిన నటీనటులను తిరిగి తెరమీదికి తీసుకురావడం, కొత్త కొత్త నటీనటులంత అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో కూడా వీరి విజయం దాగుందని చెప్పొచ్చు. ఈ క్వాలిటీస్‌ అన్నీ ఉన్నాయి కాబట్టే ప్రేక్షకుల మన్ననలు పొందిన వెబ్‌ సీరీస్‌గా నిలిచింది ‘పంచాయత్‌’.

               

వెబ్‌ సీరీస్‌: 


పంచాయత్‌ (హిందీ)

దర్శకులు : దీపక్‌ మిశ్రా

నటీనటులు : జితేంద్ర కుమార్‌, రఘువీర్‌ యాదవ్‌, నీనా గుప్తా

ప్లాట్‌ ఫామ్‌ : అమెజాన్‌ ప్రైమ్‌

సీజన్‌ : 1

ఎపిసోడ్స్‌ : 8

రేటింగ్‌: 8.7


- వెంకట్‌ శిద్దారెడ్డి, [email protected]

Advertisement
Advertisement
Advertisement