సీనియర్ దర్శకుడు తేజ ఎంతో మంది కొత్త నటీనటులను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. 'చిత్రం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తేజ.. తొలి చిత్రంతోనే హీరో ఉదయ్ కిరణ్ సహా చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఇరవై యేళ్ల తర్వాత చిత్రం సినిమాకు సీక్వెల్‌గా 'చిత్రం 1.1'ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాతో తన కొడుకు అమితవ్ తేజను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే సినీ రంగ ప్రవేశం కోసం అమితవ్ విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడట. త్వరలోనే తేజ.. 'చిత్రం 1.1' సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇవ్వబోతున్నారట.