మట్టిరోడ్డు.. మధ్యలో వాగు

ABN , First Publish Date - 2021-12-07T05:00:26+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం

మట్టిరోడ్డు.. మధ్యలో వాగు
రేగడి ఘనాపూర్‌ నుంచి వడ్డెర బస్తీకి వెళ్లే మార్గంలో ఉన్న వాగు

  • రాకపోకలకు ఇబ్బంది పడుతున్న వడ్డెరబస్తీ వాసులు
  • సరైన రోడ్డు సౌకర్యం కల్పించి వాగుపై బిడ్ర్జి నిర్మించాలని వేడుకోలు 
  • పట్టించుకోని పాలకులు


చేవెళ్ల : అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం కారణంగా ప్రజలు, రైతులు నిత్యం ఇబ్బందులు పడుతు న్నారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకోవడానికి నేతలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారు. సమస్యలను గాలికొదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తు న్నారు. చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్‌ గ్రామానికి అనుబంధ గ్రామం వడ్డెరబస్తీ ఉంది. ఈ బస్తీలో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఘనాపూర్‌ నుంచి వడ్డెర బస్తీకి వెళ్లాలంటే కిలోమీటరు దూరం మట్టిరోడ్డు ఉంది. ఈ దారి మధ్యలో వాగు ఉంది. వర్షం పడి వాగు పారితే ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి పోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన వాగులో ఇప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో వాహనాల రాకపోక లకు ఇబ్బంది ఎదురవుతుంది. విద్యార్థులు ఘనాపూర్‌ పాఠశాలకు వెళ్లాలంటే రోజూ ఈ వాగు దాటాల్సిందే. అలాగే ఇరు గ్రామాలకు చెందిన రైతుల పొలాలు వాగు అవతలి వైపు ఉన్నాయి. పంటను మార్కెట్‌కు తరలిం చాలంటే వాగు వరకు మోసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇరు గ్రామాలకు చెందిన రైతులు అవస్థలు పడుతున్నారు. వడ్డెర బస్తీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారు లను గ్రామస్థులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చే నాయకులు తాము గెలిస్తే రోడ్డు, బిడ్ర్జి ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుం టున్నారు. గెలిచిన తర్వాత నాయకులెవరూ అటువైపు చూడటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నా తమ గ్రామంపై ఎందుకు అంత చిన్నచూపని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను గుర్తించి రోడ్డు వేయాలని వడ్డెర బస్తీ వాసులు కోరుతున్నారు.


వెంటనే బ్రిడ్జి నిర్మించాలి

కొన్నేళ్లుగా వడ్డెరబస్తీ ప్రజలు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడిన ప్పుడు వాగు పారి రాకపోకలు స్తంభించి విద్యార్థులు, రైతులు అవస్థలు పడు తున్నారు. ప్రభుత్వం స్పందించి తగినన్ని నిధులు మంజూరు చేసి నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి. 

- ఎస్‌. వసంతం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు , చేవెళ్ల నియోజకవర్గం



Updated Date - 2021-12-07T05:00:26+05:30 IST