మహమ్మారికి ముకుతాడు

ABN , First Publish Date - 2021-06-18T05:14:57+05:30 IST

కరోనా కంట్రోల్‌లోకి వస్తోంది. ఉధృతి కాస్త తగ్గటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వారం పది రోజులుగా ప్రభుత్వం టెస్టులను భారీగా పెంచినప్పటికీ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా వాక్సినేషన్‌తో పాటు గ్రామాల్లో ఫీవర్‌ సర్వే, కఠినంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కరోనా విస్తృతికి క్రమేణా బ్రేక్‌ పడుతున్నట్టు తెలుస్తోంది.

మహమ్మారికి ముకుతాడు

తగ్గుతున్న కరోనా ఉధృతి

సత్ఫలిస్తున్న పకడ్బందీ చర్యలు

ప్రయోజనకరంగా లాక్‌డౌన్‌, ఫీవర్‌ సర్వే 

ప్రస్తుతం వందలోపే కేసులు 

సెకండ్‌ వేవ్‌లో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 27 వేల మందికి పాజిటివ్‌ 

100 మందికి పైగా మృత్యువాత

దూసుకొస్తున్న కరోనా థర్డ్‌ వేవ్‌

అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కరోనా కంట్రోల్‌లోకి వస్తోంది. ఉధృతి కాస్త తగ్గటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వారం పది రోజులుగా ప్రభుత్వం టెస్టులను భారీగా పెంచినప్పటికీ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా వాక్సినేషన్‌తో పాటు గ్రామాల్లో ఫీవర్‌ సర్వే,  కఠినంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కరోనా విస్తృతికి క్రమేణా బ్రేక్‌ పడుతున్నట్టు తెలుస్తోంది. 

మొదటి కంటే రెండో దశ కరోనా చాలా ప్రమాదకరంగా మారింది.  2020లో కంటే 2021లో ఈ వైరస్‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంది. ప్రధానంగా ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో బీభత్సం సృష్టించింది. ఏజెన్సీ జిల్లా ములుగుతోపాటు భూపాలపల్లిలో వేలాది మంది దీని బా రిన పడి అవస్థలు పడ్డారు. ప్రతి పీహెచ్‌సీల్లోనూ రోజుకు 50 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సరిపడా టెస్టులు అందుబాటులో లేకపోవటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే.. జూన్‌ మొ దటి వారం నుంచి కరోనా ఉధృతి కొంత తగ్గుముఖం పడుతోంది. ప్రభు త్వం భారీగా టెస్టులు పెంచినప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవు తున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ఊపిరి పీ ల్చుకుంటున్నారు. రెండుమూడు రోజులుగా వంద లోపే పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. గురువారం భూపాలపల్లి పీహెచ్‌సీలో 280 టెస్టులు చేస్తే కేవలం ఆరు పాజిటివ్‌ కేసులు మా త్రమే నమోదయ్యాయి. గణపురం పీహెచ్‌సీలో 132 టెస్టులు నిర్వహిస్తే రెండు, మొగుళ్లపల్లిలో 130 టెస్టులకు ఆరు, మహదేవపూర్‌ మండలం అంబటిపల్లిలో 100 టెస్టులు నిర్వహిస్తే ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం పీహెచ్‌సీలో 67 టెస్టులు ఒకరికి కూడా పాజిటివ్‌ రాలేదు. అలాగే వెంకటాపూర్‌ పీహెచ్‌సీలో 188 టెస్టులు నిర్వహిస్తే తొమ్మిది, మంగపేట మండలం బ్రహ్మణపల్లిలో 55 టెస్టులు చేస్తే రెండు, ఏటూరునాగారం మండలం  రాయినిగూడెంలో 152 టెస్టులు నిర్వహిస్తే మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

ఫలిస్తున్న వ్యూహం

కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అన్ని గ్రామాలతోపాటు పట్టణాల్లోని కాలనీల్లో నిర్వహించిన ఇంటింటి ఫీవర్‌ సర్వేతో చాలా వరకు కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో కరోనా లక్షణాలపై అవగాహన లేకపోవటం, ఏ మం దులు వాడాలో తెలియకపోవటంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పాజిటివ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ ఇతర వ్యక్తులతో కలిసిపోవటం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరిగింది.  ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు పంచాయతీ సిబ్బందితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం నిర్వహించిన ఫీవర్‌ సర్వేతో చాలా వరకు కరోనా కట్టడికి దోహదపడిందని అధికారులు అంటున్నారు. పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారికి వెంటనే మందుల కిట్‌ అందించటంతో పాటు బయట తిరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇక వ్యాక్సినేషన్‌ కూడా బాగా ప్రభావం చూపిందనే టాక్‌ ఉంది. 45 ఏళ్ల నిండిన వారితో పాటు సూపర్‌ స్ర్పైడర్లను గుర్తించి టీకాలు వేయటం కూడా కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేయడం కూడా భూపాలపల్లి, ములుగు జిల్లాలో కరోనా వ్యాప్తికి బ్రేకులు పడినట్లుగా భావిస్తున్నారు.  

27వేల కేసులు.. 100 మందికి పైగా మృతి

 ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 1.91లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 13,300 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 12,300 మంది కరోనాను జయించగా, ఇంకా సుమారు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో  62 మందికి పైగా కరోనాతో మృతి చెందినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.  అలాగే భూపాలపల్లి జిల్లాలో 1.45లక్షల టెస్టులు నిర్వహించగా 13,600కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12వేల మందికి కరోనా నుంచి బయట పడ్డారు. మరో 1,612 మంది ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో కరోనాతో సెకండ్‌ వేవ్‌లో 42 మంది మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొత్తం 27 మందికి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 104 మంది కరోనాతో మృతి చెందినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కరోనాతో మృతి చెందినవారి సంఖ్య రెండు జిల్లాలో 200లకు పైగా ఉండే అవకాశం ఉంది. చాలా మంది కరోనా టెస్టులు చేయించుకోకుండా ఇంటి వద్ద ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటూ మృతి చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2021-06-18T05:14:57+05:30 IST