రాజమహేంద్రవరంలో అదృశ్యం..

ABN , First Publish Date - 2020-08-11T11:00:09+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది.

రాజమహేంద్రవరంలో అదృశ్యం..

గోకవరంలో ప్రత్యక్షం

కొవిడ్‌ బాధితుడు ఆస్పత్రికి తరలింపు


గోకవరం, ఆగస్టు 10: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. కొవిడ్‌ బాధితుడు ఆస్పత్రి నుంచి మాయమై గోకవరం చేరుకునే వరకు ఆ బాధితుడు ఆస్పత్రిలో ఉన్నాడో లేడో కనుగొనలేకపోవడం గమనార్హం.  దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో కొంతకాలంగా ఉంటున్న 50 ఏళ్ళ వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆ వృద్ధుడిని ఈనెల 7న రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


అక్కడ చికిత్స పొందుతున్న ఆ వృద్ధుడు భయంతో సోమవారం ఆస్పత్రి నుంచి తప్పించుకొని ఆర్టీసీ బస్‌లో గోకవరం బయలుదేరాడు. ఈ విషయం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి నిర్వాహకుల ద్వారా గోకవరం ప్రభుత్వ వైద్య సిబ్బందికి చేరింది. దీంతో హుటాహుటిన  వైద్య సిబ్బంది ఆ వ్యక్తిని ఆర్టీసీ డిపోలో పట్టుకున్నారు. ఆ సమయంలో కొంతసేపు డిపోలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బాధితుడితో కలిసి బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులతో పాటు, డిపోలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు.  బాధితుడిని 108 వాహనంపై వైద్య సిబ్బంది రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-08-11T11:00:09+05:30 IST