ఆశాభంగం

ABN , First Publish Date - 2020-10-21T08:57:00+05:30 IST

మంగళవారం నాడు ప్రధాని సందేశం కోసం ప్రజలు చూసిన ఎదురుచూపు, పడిన ఉత్కంఠ చివరకు ఆభాసగా పరిణమించాయి...

ఆశాభంగం

మంగళవారం నాడు ప్రధాని సందేశం కోసం ప్రజలు చూసిన ఎదురుచూపు, పడిన ఉత్కంఠ చివరకు ఆభాసగా పరిణమించాయి. ముందే సమయం ప్రకటించి, ఊహాగానాలు రగిలించి, చేసిన ఆ ప్రసంగంలో ఏ విలువైన కానుక దాగున్నదో, లేదా ఏ సంచలన నిర్ణయం కాచుకుని ఉన్నదో అని తహతహలాడినవారికి, ‘తిలకాష్ఠ మహిషబంధం’ మాదిరిగా కొన్ని పడికట్టు సూక్తులు, కొన్ని కరోనా జాగ్రత్తలు మాత్రం వినిపించి ఆశ్చర్యకరంగా నిరాశను మిగల్చింది. చతురోక్తులతో రంజిపజేయగలిగిన వక్త అయిన నరేంద్రమోదీ, గత ఏడు నెలల కాలంలో ఇంతటి నీరసమైన ప్రసంగం చేసినట్టు గుర్తు లేదు.


పండగల కాలం కదా, కరోనా ఇంకా ఉన్నదని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెలగండి– అని ప్రధాని చెప్పిన మాటలలో తప్పేమీ లేదు. కొవిడ్‌–19 అప్పుడప్పుడే ప్రవేశించిన కాలంలో, ప్రధానమంత్రి ప్రజల ముందుకు వచ్చి, హెచ్చరికలూ జాగ్రత్తలూ చెప్పడంతో పాటు, గంటలు కొట్టమనో దీపాలు వెలిగించమనో ఏదో హోమ్‌వర్క్‌ కూడా ఇచ్చేవారు. నేరుగా తమనే సంబోధించి, ఏదో ఒక పని అప్పగించే నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ఎగువ దిగువ మధ్యతరగతులు ఎగిరిగంతేసి శ్రద్ధగా పాటించాయి. ఒకరోజు ఇంట్లో ఉండి వైరస్‌ గొలుసుకట్టు చట్రాన్ని తెంపేసామని, విజయధ్వానాల చప్పుడుకు వైరస్‌ పారిపోయిందని అమాయకంగా నమ్మినవారు కూడా ఉన్నారు. తన మనసులో మాటను నెలనెలా రేడియో ద్వారా చెబుతున్నప్పటికీ, టెలివిజన్‌ ద్వారా ఇచ్చే సందేశానికి ప్రజలు ఎక్కువ విలువ ఇస్తూ వచ్చారు. నోట్ల రద్దు వంటి ఆఘాత సందేశాన్ని కూడా ప్రధాని ద్వారానే ఈ దేశం విన్నది. లాక్‌డౌన్‌ సందేశాన్ని కూడా అట్లాగే విన్నది. అవునో కాదో వాస్తవమో ఊహో తెలియని 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటన కూడా ప్రధాని ద్వారానే వ్యక్తమయింది. కాబట్టి, సాయంత్రం నా కోసం సమయమివ్వండి అని ముందే కోరి మరీ సందేశమిస్తున్నప్పుడు, ఏ తీపి కబురు, ఏ కలవరపెట్టే కబురు రానున్నదో అని ఊహలు చేయడం సహజం. 


కరోనా కారణంగా ఉత్పన్నమయిన పరిస్థితులలో ముఖ్యమైనది ఆర్థికరంగ సంక్షోభం. అనేక ఉత్పాదక, సేవా రంగాలు దెబ్బతిన్నాయి. కోట్లాది మందికి ఉపాధి నష్టం జరిగింది. ప్రభావితమైన వాటిలో సంఘటిత, అసంఘటిత పరిశ్రమలు, పెద్ద, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. 


చిన్న, స్వతంత్ర వ్యాపారాలు, సరుకుల గొలుసుకట్టులోని చివరి లంకెలు ఉన్నాయి. పరోక్షంగా నష్టపోయినవారున్నారు. కేవలం వ్యవస్థలోకి కొంచెం ద్రవ్యశీలతను చొప్పించినంత మాత్రాన, స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవు. ప్రజలలో కొనుగోలుశక్తి పెరగకపోతే, వ్యవస్థ రథం చిన్నచిన్న అడుగులు కూడా వేయలేదు. దాని కోసం, బాధిత శ్రేణుల చేతికి నేరుగా ఆర్థికసాయం అందించడమే పరిష్కారమని నిపుణులనేకులు సూచించారు. ప్రభుత్వం దానికి సుముఖత చూపకపోగా, కొంత డబ్బును మార్కెట్‌లోకి పరోక్షమార్గాల ద్వారా విడుదల చేసింది. 20 లక్షల ప్యాకేజి సారాంశంలో కొద్దిపాటి ద్రవ్యశీలతను పెంచేది మాత్రమే. అది వ్యక్తిగత బాధితులను మాత్రమే కాదు, ఆయా లక్షిత రంగాలను కూడా నిరుత్సాహపరిచింది. మారటోరియం కాలంలో అప్పుల మీద చక్రవడ్డీలు వసూలు చేయకూడదనే సూత్రం పైన కూడా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయలేని స్థితిలో ఉన్నది. ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక లాగ, తను చేసిన పొరపాటును గుర్తించి, ప్రభుత్వం నిర్దిష్టమైన, ప్రయోజనకరమైన ఉద్దీపనలను ఇవ్వక తప్పదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. వివిధరంగాలకు ప్రయోజనకరమైన ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడం, ద్రవ్యోల్బణం ముమ్మరం కావడానికి దోహదం చేసి, అట్టడుగువర్గాల పరిస్థితిని మరింత దుర్భరం చేయగలదని, కీలకమయిన అసెంబ్లీల ఎన్నికలు ముందున్న దృష్ట్యా, అటువంటి చర్యకు ప్రభుత్వం విముఖంగా ఉన్నదని వింటున్నాము. వివిధ ప్రజావర్గాలకు నేరుగా అందించే లబ్ధిని కూడా ఉద్దీపనలో భాగం చేస్తే, కొంత ప్రయోజనం ఉండవచ్చును. అట్టడుగు వర్గాల స్థితిగతులను ఉన్నదున్నట్టు కొనసాగించడానికే, ప్రభుత్వం ఇంత పంటిబిగువున, ఎగువతరగతుల ఆకాంక్షలకు కళ్లెం వేయడం బాగానే ఉన్నది కానీ, ఒకసారి రాజకీయ అవసరం గడచిన వెంటనే, కళ్లేలు తెంచుకున్న విధానాలు ద్రవ్యోల్బణాన్ని పరుగులు తీయించే ప్రమాదం ఉన్నది. 


సందేశంలో లేనివాటిని పక్కనబెట్టి, ఉన్న అంశాన్ని తరచి చూస్తే, కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్‌ సాధించినదానిపై ప్రధాని సంతోషంగా ఉన్నారు. అమెరికా కంటె మనమే బాగా కట్టడి చేయగలిగామని మోదీ గట్టిగా చెప్పుకున్నారు. కరోనాపై పోరాటంలో సంపన్న దేశాల కంటె మనం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు ఏమిటో మోదీ చెప్పి ఉంటే బాగుండేది. దేశంలో ఇప్పటికీ రోజుకు వేయిమందికి పైగా చనిపోతున్నా, జాగ్రత్తల పాటింపులో ఒకరకమైన అలక్ష్యం, బాధ్యతారాహిత్యం వ్యాప్తి చెందడానికి కేంద్రప్రభుత్వం ఉదారంగా చేస్తున్న అన్‌లాక్‌ సడలింపులు ప్రధానకారణం. జనసమీకరణలు కూడదన్న స్పృహ రాజకీయపక్షాలకే లేకపోతే, సాధారణుల నుంచి ఏమి ఆశించగలం? ఇప్పుడు దేశవ్యాప్తంగా పాటిస్తున్న జాగ్రత్తల నాణ్యత ఇట్లాగే ఉంటే, మరోవిడత వ్యాధి విజృంభించినా ఆశ్చర్యం లేదు. 


నోట్ల రద్దు వలె ఏదో భీకర ప్రకటనను ఊహించి భయపడినవారు మోదీ సందేశంతో ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితిని మంచికి, చెడుకు మార్చే పరిణామం ఏదీ లేదు కాబట్టి, ప్రధాని చెప్పినట్టు, ముసుగులు కట్టుకుని, దూరాలు పాటిస్తూ, జాగ్రత్తగా పండుగలు చేసుకుందాం మరి!

Updated Date - 2020-10-21T08:57:00+05:30 IST