ఊరిస్తూ.. నిరాశపరుస్తూ..

ABN , First Publish Date - 2022-07-28T05:56:38+05:30 IST

సహకార రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ప్రభుత్వ తీరుతో తన ప్రభావాన్ని కోల్పోతోంది.

ఊరిస్తూ.. నిరాశపరుస్తూ..
సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాలయం

- ‘సెస్‌’ నామినేటెడ్‌ పాలకవర్గంపై హైకోర్టు స్టే

- స్టే రద్దు కోసం కొనసాగుతున్న ప్రయత్నాలు 

- ఆగస్టు 1వ తేదీకి కేసు వాయిదా 

- ఎన్నికలను కోరుకుంటున్న సభ్యులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సహకార రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ప్రభుత్వ తీరుతో తన ప్రభావాన్ని కోల్పోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వెలుగులు నింపిన సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నికల నిర్వహణ ఎప్పుడూ చర్చనీయాంశంగానే మారుతోంది. ప్రభుత్వాలు నామినేటెడ్‌ పాలకవర్గాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుండగా సెస్‌ సభ్యులు మాత్రం ఎన్నికలనే కోరుకుంటున్నారు. పాలకవర్గాలు లేకపోవడం... వచ్చిన పాలకవర్గాలు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు సైతం తెప్పించుకోలేక సెస్‌కు భారాన్నే మిగిల్చారు. ప్రభుత్వం నుంచి దాదాపు  250 కోట్ల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో పాలకవర్గాలు లేకపోవడంతో నిఘా కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలకవర్గం గడువు ముగిసి ఏడాది తరువాత ప్రభుత్వం 14 మంది డైరెక్టర్లతో పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ను నియమిస్తూ జీవో ఆర్‌టీ నంబర్‌ 151ని విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌ 18న వచ్చిన పాలకవర్గం నియామకం చర్చనీయాంశంగా మారింది. బాధ్యతలు స్వీకరించిన నామినేటేడ్‌ పాలకవర్గంపై మాజీ సెస్‌ డైరెక్టర్‌ భర్త ఏనుగు కనకయ్య హైకోర్టును ఆశ్రయించారు. నామినేటేడ్‌ కమిటీపై కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం కోర్టులో కేసు కొనసాగుతుండగా బుధవారం హైకోర్టులో కేసు విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సిరిసిల్లలో మరోసారి సెస్‌ ఎన్నికల నామినేటేడ్‌ కమిటీ కొనసాగుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. సెస్‌ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించకుండా నామినేట్‌ చేసిన ప్రతిసారి వివాదాలకు దారి తీస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2011లో నాగుల సత్యనారాయణ పర్సన్‌ ఇన్‌చార్జిగా త్రీమేన్‌ కమిటీని నియమించింది. కోర్టు అదేశాల మేరకు కమిటీ రద్దయింది. 2016లో ఎన్నికలు జరుగగా 2021 ఫిబ్రవరి 27న పాలకవర్గం గడువు ముగిసింది. ఉన్న పాలకవర్గాన్ని పొడగిస్తూ 1404/2021 ఫిబ్రవరి 19న సెస్‌ చైర్మన్‌గా ఉన్న లక్ష్మారెడ్డిని పర్సన్‌ ఇన్‌చార్జిగా, వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన లగిశెట్టి శ్రీనివాస్‌తో పాటు 10 మంది డైరెక్టర్లను కమిటీ సభ్యులుగా నియమించింది. ఫిబ్రవరి 28న బాధ్యతలు తీసుకునే సమయంలోనే ప్రభుత్వం జీవోను రద్దు చేసింది. కోర్టు నుంచి చిక్కులు వచ్చే అవకాశం ఉండడంతోనే రద్దు చేసిందని భావించారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులను నిరాశ పరుస్తూ ఏప్రిల్‌లో సెస్‌పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ సభ్యులుగా నంది శంకర్‌, పూసవెల్లి సరస్వతి, గొడిసెల అయిలయ్యయాదవ్‌, గౌరినేని నారాయణరావు, కొమ్ము  బాలయ్య, కుంభాల మల్లారెడ్డి, మాడుగుల మల్లేశం, డప్పుల అశోక్‌, అకుల గంగరాజం, దేవరకొండ తిరుపతి, పోలాస నరేందర్‌, రేగుపాటి చరణ్‌రావు, అకుల దేవరాజం, మేడుదుల మల్లేశంలను నియమిస్తూ కమిటినీ వేసింది. కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ ఎన్నికల అంశం ముందుకు వచ్చింది. కోర్టు ఈసారి ఎన్నికలు నిర్వహించమని ఆదేశిస్తుందని ఆశావహుల్లో అశలు మొదలయ్యాయి. 

- సెస్‌ పరిధిలో 2.51 లక్షల మంది ఓటర్లు... 

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం 1970లో 4,720 మంది సభ్యులతో మొదలైన సంస్థ ఇప్పుడు రెండు లక్షల 67 వేల మందికి చేరుకుంది. ఎన్నికల నిర్వహణకు ప్రతీ ఓటరుకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేసే ప్రక్రియ మొదలవుతున్న క్రమంలోనే నామినేటేడ్‌ ప్రక్రియ ముందుకు వచ్చింది. ప్రస్తుతం సెస్‌ పరిధిలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2016 ఓటరు జాబితా ప్రకారం 2.59 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన కొత్త మండలాలు వీర్నపల్లి, రుద్రంగి, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్‌ డైరెక్టర్‌ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. సెస్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1970-1973 వరకు చైర్మన్‌గా వి వెంకట్‌రెడ్డి, 1981-1984 వరకు చైర్మన్‌గా జె నర్సింగారావు, వైస్‌చైర్మన్‌గా కొండ శంకరయ్య, 1985- 1988 వరకు చైర్మన్‌గా జె నర్సింగరావు, వైస్‌ చైర్మన్‌గా సీహెచ్‌ అనందరావు, 1988-1991 వరకు చైర్మన్‌గా సీహెచ్‌ విష్ణుప్రసాద్‌రావు, వైస్‌ చైర్మన్‌గా పల్లం నర్సయ్య, 2007-2010 వరకు చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌ చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌, 2010-2012 వరకు చైర్మన్‌గా అల్లాడి రమేష్‌, వైస్‌చైర్మన్‌గా కొండూరు గాంధీ, 2016-2021 వరకు చైర్మన్‌గా దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. సెస్‌ మొదట్లో సహకార సంఘాలకే ఆదర్శంగా నిలిచింది. క్రమేణా అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. పలు విచారణలు జరిగినా ఇప్పటి వరకు అవినీతి గుట్టు మాత్రం బయటపెట్టలేదు. గతంలో ఉద్యోగుల తప్పిదం పేరుతో ఒక ఏడీ, ఇద్దరు ఏఈలను సస్పెండ్‌ చేసిన సంఘటనలు ఉన్నాయి. సస్పెండ్‌కు గురైన ఏఈ ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ-ప్రొకూర్‌మెంట్‌ పనుల్లో అవకతవకలు జరిగాయని పలు పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ విచారణ కూడా జరిపారు. సెస్‌ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టే క్రమంలో ఎన్నికలు నిర్వహించాలని సెస్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-07-28T05:56:38+05:30 IST