వేతన జీవులకు నిరాశ

ABN , First Publish Date - 2022-02-02T05:29:33+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై భిన్నాభిప్రాయం వ్యక్తమైంది.

వేతన జీవులకు నిరాశ

- చిరు, మధ్యతరగతి వ్యాపారులకు చేయూత కరువు

- ఎరువులపై తగ్గిన సబ్సిడీ

- కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయం 

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ఆదాయపు పన్ను చెల్లింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయులు, వేతన జీవులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశారనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎరువులపై సబ్సిడీని 35 వేల కోట్లకు తగ్గించడంతో ధరలు పెరిగి రైతులపై భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. డిజిటలైజేషన్‌, పోస్టల్‌శాఖ సేవలను విస్తృత పరుచడం, డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, ఐదేళ్ళలో ఉద్యోగాలకల్పన చేస్తామని ప్రకటించడం వంటి అంశాలపై హర్షం వ్యక్తమవుతున్నది. ఈ బడ్జెట్‌ దేశనవశకానికి నాందిపలికే విధంగా ఉందంటూ అధికార బీజేపీ చెబుతుంటే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు సామాన్య, పేద ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు నిరాశకు గురిచేసిందని, ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాపారవర్గాలు, పారిశ్రామిక వర్గాలు కూడా నిరాశను వ్యక్తం చేయగా, రాష్ట్రానికి, జిల్లాకు నిధుల కేటాయింపులు సవతిప్రేమ చూపించారని చెబుతున్నారు. మొత్తంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. 

ఫ దేశ నవశకానికి నాందిపలికే బడ్జెట్‌...

- పి సుగుణాకర్‌రావు, బీజేపీ సీనియర్‌ నాయకుడు 

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశాన్ని ప్రగతిపథం వైపు తీసుకెళ్లే విధంగా ఉంది. ఇది నవశకానికి నాంది పలికే బడ్జెట్‌. 68 శాతం రక్షణ రంగంలో, దేశ ఉత్పత్తుల తయారీ ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రాధాన్యమిచ్చారు. సాంకేతిక ఆధునికతకు ప్రాధాన్యం ఇవ్వడంతో రాబోయే తరాల యువతకు చక్కటి భవిష్యత్‌ ఉంటుంది. ఉద్యోగ మౌలిక కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఈ-విద్య ఒక అద్భుత కల్పన. డిజిటల్‌ కరెన్సీ వినూత్న ప్రక్రియను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, రైతులు, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అధిక కేటాయింపులు చేశారు. జాతీయ రహదారులు, ఆవాస్‌ యోజన, రాష్ర్టాల ప్రత్యేక నిధి ఏర్పాటు, వడ్డీ రహిత నిధులు, పీఎం గతిశక్తికి ప్రాధాన్యత, ల్యాండ్‌ రికార్డ్స్‌ డిజిటలైజేషన్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యమిచ్చారు. 

ఫ సామాన్యులను నిరాశ, నిస్పృహలకు గురి చేసింది

- బండ శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, రైతాంగం, పేదలు, వృత్తిదారులు, సామాన్యులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. దశ, దిశ నిర్దేశం లేని విధంగా నిష్ప్రయోజనకరంగా బడ్జెట్‌ ఉంది. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోంది. 

ఫ పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌

-  కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌  నగర అధ్యక్షుడు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, వేతన జీవులకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ ఇవ్వలేదు.. కొత్తపల్లి-మనోహరబాద్‌ రైల్వే లైన్‌ ఊసే లేదు.. చేనేతలకు రాయితీ లేదు. పెద్దపల్లి-కరీంనగర్‌ రైల్వే లైన్‌ విద్యుద్దీకరణకు పైసా ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల ఆశలు సాధించడంలో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైంది. 

ఫ సామాన్యునికి ఊరటనివ్వని బడ్జెట్‌...

- అంబటి జోజిరెడ్డి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ సామాన్యుడికి ఎలాంటి ఊరటనివ్వలేదు. భారీ షాక్‌ ఇచ్చే విఽధంగా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌, వ్యవసాయంపై సుంకం విధించారు. దీంతో నిత్యావసర వస్తువులు పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తాయి. డిజిటల్‌ పెట్రోల్‌తో నడుస్తున్న వాహనాలను మూలనపడేసి ఎలక్ర్టిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలనేవిధంగా బడ్జెట్‌ ఉంది. నిత్యావసర ధరలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వైద్యరంగంపై వివక్ష చూపింది.

ఫ నిరాశపరిచింది...

- దామెర సత్యం, నాగుల బాలాగౌడ్‌, టీడీపీ నాయకులు

కేంద్ర ప్రభుత్వం సామాన్య పేద ప్రజలను నిరాశపరిచింది. రాష్ర్టానికి ఆశించిన నిధులు కేటాయించక చిన్నచూపు చూడడం బాధాకరం. సామాన్యుడి స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వ్యవసాయరంగానికి నిధులు తగ్గించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టలేదు. మౌళిక వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌తో సామాన్యుడికి ఒరిగిందేమి లేదు. 

ఫ విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయిస్తే బాగుండేది.

- డాక్టర్‌ శ్రీవాణి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అర్థశాస్త్ర విభాగం, ఎస్‌యూ

కేంద్ర బడ్జెట్‌లో వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తే బాగుండేది. ఆదాయ పన్ను చెల్లింపులను వివరించకపోవడం వేతన జీవులకు నిరాశ కలిగించింది. ఐదు సంవత్సరాలలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడం, డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, పీఎం ఆవాస్‌ యోజన కింద 48 వేల కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండు లక్షల కోట్లు కేటాయించడం మంచి పరిణామం.

ఫ రైతులపై ఆర్థికభారం పెరుగుతుంది....

-  గౌరిశెట్టి మునీందర్‌, ఆల్‌ ఇండియా అగ్రో ఇన్‌ఫుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు 

కేంద్ర బడ్జెట్‌లో ఎరువులపై లక్షా 40వేల కోట్ల రూపాయల సబ్సిడీని లక్షా 5వేల కోట్లకు తగ్గించి, 35వేల కోట్ల రూపాయల కోత విధించారు. దీంతో ఎరువుల ధరలు పెరిగి రైతులపై ఆర్థికభారం మరింత పెరిగే అవకాశముంటుంది. వ్యవసాయ రంగాలకు ఎలాంటి సహాయ పథకాలను ప్రకటించలేదు.  చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, మూతపడిన పరిశ్రమల పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రోత్సహాలు ఇవ్వలేదు. బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీని కూడా రద్దుచేయక పోవడంతో పారిశ్రామిక, వ్యాపారవర్గాలు తీవ్ర నిరుత్సాహానికి గురి అయ్యాయి. 

ఫ వేతన జీవులను నిరాశకు గురిచేసింది 

-  రావికంటి కృష్ణకిశోర్‌, రాష్ట్ర చిన్నమొతాల పొదుపు ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు

వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పు చేయకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. రైతులకు ఆర్థిక సాయం పెంచడం, విద్యార్థులకు డిజిటల్‌ యూనివర్సిటీ ప్రారంభించడం, డిజిటల్‌ బ్యాంకులు, డిజిటల్‌ పేమెంట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు సామాన్యులకు సులభతరం చేయడం కొంత ఊరట కలిగించేలా ఉంది. 

ఫ దూరదృష్టితో కూడిన బడ్జెట్‌ 

- ఉప్పల రామేశం, పోస్టల్‌, ఆర్‌ఎంఎస్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  

కేంద్ర బడ్జెట్‌ దూరదృష్టితో కూడినది. ఈ బడ్జెట్‌ దేశాభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తుంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ శాఖలకు 1,05,406 కోట్లు కేటాయించడం హర్షణీయం. పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు, డిజిటల్‌ పేమెంట్‌, నెట్‌బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలను అందించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కరోనా సమయంలో కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు నిలిపివేసిన 36 నెలల డీఏపై ప్రకటన చేయక పోవడం శోచనీయం. 

ఫ వ్యాపారులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు...

- చిట్టుమల్ల శ్రీనివాస్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సరళీకృతం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌ పెంచుతారని భావిస్తే అలాంటిది లేదు. స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహకాలు పర్వాలేదు. డిజిటల్‌ విద్య, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి మంచిదే. 

ఫ పెన్షనర్లకు నిరాశ

- జి అశోక్‌, తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌

వరుసగా నాలుగుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్‌ పెన్షనర్ల ఆదాయ పన్ను స్లాబ్‌ల చెల్లింపుల్లో ఎలాంటి మార్పు చేయకుండా నిరాశ పరిచారు. పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ నుంచి ఆదాయ పన్నును రాబట్టుకోవడం.. దానిలో కనీస మార్పులు కూడా చేయకపోవడం విచారకరం. 

ఫ మరోసారి నిరాశే...

- మీసాల మల్లిక్‌, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు 

ఆదాయ పన్నులు రాయితీలు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. ఆదాయ పన్ను స్లాబులుగాని, స్టాండర్డ్‌ డిడక్షన్స్‌కాని, 80సీ పరిమితిగాని మార్చకపోవడం అన్యాయం. ఏడేళ్లుగా ఎదురుచూపే మిగులుతోంది. 

ఫ 6.9 శాతం ద్రవ్యలోటు ఆందోళనకరం 

- వాసాల శ్రీనివాస్‌, టాక్స్‌ కన్సల్టెంట్‌

39 లక్షల 45 వేల కోట్ల భారీ బడ్జెట్‌లో 22 లక్షల 84 వేల కోట్ల వనరుల సమీకరణ అనేది కేంద్రానికి భారమే కాదు.. పన్నుల రూపేణా ప్రజలకు భారమే. ద్రవ్యలోటు 6.9 శాతంగా ఉండడం ఆందోళనకరం. వ్యక్తిగత ఆదాయ పన్ను అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఆశలపై చన్నీళ్లు చల్లినట్లయింది. ప్రభుత్వ ఆస్తుల ఉపసంహరణ ద్వారా 65 వేల కోట్లు సేకరించడమనేది ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడమే. ఎలక్ర్టిక్‌ వాహన రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం ముదావహం.

ఫ అన్నిరంగాలకు ప్రాధాన్యం లభించింది..

- గొరిట్యాల వెంకట కిషన్‌, మున్సిపల్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ 

అందరి ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా రూపకల్పన చేయడంతో రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది రాయిగా నిలుస్తుంది. రాష్ర్టాలకు ఆర్థిక సహాయంగా లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేసి, వడ్డీలేని రుణాలను అందించడం గొప్ప విషయం. విద్య, వైద్యం, వ్యవసాయరంగం, మహిళలు, చిన్నారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి, వివిధ రంగాల బలోపేతానికి స్వయం సమృద్ధి చెందేలా బడ్జెట్‌లో ఆయా రంగాలన్నింటికీ అత్యధిక ప్రాధాన్యం లభించడం శుభపరిణామం. 

Updated Date - 2022-02-02T05:29:33+05:30 IST