కార్మికుల నిరాయుధీకరణ

ABN , First Publish Date - 2021-08-04T06:08:25+05:30 IST

అత్యవసర రక్షణ సర్వీసుల బిల్లు–2021కు మంగళవారం నాడు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. దీనితో, వివిధ రక్షణ ఉత్పత్తి కర్మాగారాల పునర్వ్యవస్థీకరణకు కార్మికసంఘాల...

కార్మికుల నిరాయుధీకరణ

అత్యవసర రక్షణ సర్వీసుల బిల్లు–2021కు మంగళవారం నాడు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. దీనితో, వివిధ రక్షణ ఉత్పత్తి కర్మాగారాల పునర్వ్యవస్థీకరణకు కార్మికసంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వ నిశ్చయం ముందు వీగిపోయినట్టు అయింది. 


గత జూలై 26 నుంచి 41 రక్షణ ఉత్పత్తి కర్మాగారాలలోని 70 వేల మంది కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రారంభం కాకముందే నిలిచిపోయింది. కార్మికసంఘాల సమ్మె హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని జూన్‌లోనే ఈ బిల్లుకు పూర్వరూపమైన ఆర్డినెన్సును జారీచేశారు. ఒక వైపు పెగాసస్, సాగుచట్టాల వంటి కీలక, సమస్యాత్మక అంశాల మీద చట్టసభలలో వేడి వేడి వాదోపవాదాలు రగులుతుండగానే, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూలై 22 నాడు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అప్రజాస్వామికమైనదని, రక్షణరంగంలోని కీలక ఉత్పాదక సంస్థలను  ప్రైవేటీకరించడానికి అవరోధాలు లేకుండా చేస్తున్న ప్రయత్నమని ప్రతిపక్షాలు విమర్శించాయి. 


రక్షణ రంగ సామగ్రిని– ముఖ్యంగా ఆయుధాలను, మందుగుండును, వాహనాలను– ఉత్పత్తి చేసే కర్మాగారాలు ప్రభుత్వ నిర్వహణలో 41 ఉన్నాయి. ఇవన్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు (ఓఎఫ్‌‌బి) ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ బోర్డును కార్పొరేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగా 41 ఫ్యాక్టరీలను ఏడు ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేట్ సంస్థలుగా మారుస్తున్నారు. ఈ మార్పు కార్పొరేటీకరణే తప్ప, ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వం వాదిస్తున్నది. మహా అయితే, ఈ కార్పొరేషన్లలో పబ్లిక్ పెట్టుబడి (స్టాక్ మార్కెట్ ద్వారా సమకూరే మదుపు) ఉండవచ్చునని సూచిస్తున్నది. ఈ పరిణామం అక్కడితో ఆగదని, అంతిమంగా పూర్తి ప్రైవేటీకరణకు దారితీస్తుందని, ప్రస్తుత మార్పుల వల్ల కూడా తమకు ఎన్నో నష్టాలున్నాయని, ముఖ్యంగా 


త్వరలో రిటైరయ్యేవారు ఎన్నో సదుపాయాలు కోల్పోతారని ఉద్యోగుల, కార్మికుల సంఘాలు వాదిస్తున్నాయి. కార్పొరేటీకరణ ప్రయత్నాలను అడ్డగించడానికి యూనియన్లు జూలై 26 నుంచి సమ్మె హెచ్చరిక చేశాయి. సమ్మె ఆలోచన సూచన వినిపించగానే జూన్ మాసంలోనే బిల్లు ఆర్డినెన్స్ జారీచేశారు. సమ్మె తేదీ సమీపిస్తుండగా, జూలై 22 నాడు బిల్లు ప్రవేశపెట్టారు. తాను సంకల్పించినది నెరవేర్చుకోవడానికి, ప్రభుత్వం ఎంతటి కాఠిన్యాన్ని చూపగలదో, ఎంత వేగాన్ని ప్రదర్శించగలదో ఈ బిల్లు ప్రయాణం తెలుపుతుంది. లోక్‌సభలో తమకు ఉన్న అపారమైన మెజారిటీని ఉపయోగించుకోకుండా ఏ ప్రభుత్వం మాత్రం చర్చలు, సంప్రదింపులను ఆశ్రయిస్తుంది? 


అయితే, ఈ కార్పొరేటీకరణ అన్నది అకస్మాత్తుగా ఊడిపడిన ఆలోచన కాదు. మొత్తంగా సరళీకరణ, ప్రైవేటీకరణ చట్రంలోనే ఈ సంస్కరణను కూడా సంకల్పించారు. మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాం నుంచి రెండో ప్రభుత్వ హయాం దాకా మూడు కమిటీలు ఈ కార్పొరేటీకరణను సిఫారసు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ సంస్కరణలకు అనుకూలంగానే ఉన్నాయి. నరేంద్ర మోదీ 2014 విజయం తరువాత మొదటి 100 రోజులలో చేయ తలపెట్టిన పనులలో ఈ రక్షణ ఉత్పత్తి సంస్థల కార్పొరేటీకరణ కూడా ఉన్నది. నరేంద్ర మోదీ హయాంలో రక్షణ రంగంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు చురుకుగా ప్రవేశించిన సంగతి తెలిసిందే. దేశరక్షణావసరాలను తీర్చే కర్మాగారాలు కేంద్రప్రభుత్వ యాజమాన్యంలోనే ఏర్పడి కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో అతి కీలకమయినవి మినహా, తక్కిన వాటిని ప్రైవేటు రంగానికి బదలాయించడమో, ప్రైవేటు ఉత్పాదక సంస్థలకు సానుకూల వాతావరణం కలిగేటట్టుగా తప్పించడమో చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. లాభసాటి ప్రభుత్వరంగ సంస్థలను కూడా కారుచవకగా విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న సమయంలో, రక్షణరంగ సంస్కరణలు కూడా వేగం పుంజుకున్నాయని భావించవచ్చు. కాకపోతే, రక్షణరంగంలోని ప్రభుత్వ పరిశ్రమలను లాభనష్టాల దృష్టిలో చూడవచ్చునా అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. 


ఈ బిల్లు ప్రకారం రక్షణ ఉత్పత్తుల సంస్థలో సమ్మెలో పాల్గొనేవారు మాత్రమే కాదు, సమ్మెను రెచ్చగొట్టేవారు కూడా శిక్షార్హులే. నేరుగా రక్షణసామగ్రి ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలే కాదు, అనుబంధ పరిశ్రమల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. అనవసరంగా లేఆఫ్‌లు విధిస్తే, యాజమాన్యాలను కూడా శిక్షిస్తాం అని బిల్లు చెబుతోంది కానీ, దాని గురి ప్రధానంగా కార్మికుల మీద, కార్మిక నాయకులమీదనే ఉన్నది. దేశభద్రత, సమగ్రత అవసరాల రీత్యా, ఏ రాష్ట్రంలో అయినా భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు, ప్రజాభద్రతకు భంగం వాటిల్లినప్పుడు, గౌరవమర్యాదలకు, నైతికతకు విరుద్ధంగా జరిగినప్పుడు కూడా ఈ బిల్లు కింద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. బిల్లు వినియోగంలో అతివ్యాప్తికి అధిక ఆస్కారం ఉండేట్టుగా రూపకర్తలు జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తున్నది. 


సంస్కరణల అమలులో అతికచ్చితంగా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వం దాని అమలు కోసం తరచు జాతీయతా భావాన్ని, దేశభద్రతను ఉపయోగించుకుంటున్నది. ప్రజల హక్కుల విషయంలో కానీ, కార్మికులు, రైతాంగం ఆకాంక్షల విషయంలో కానీ ప్రభుత్వం అనేక కఠిన చట్టాల సాయంతో వ్యవహరించడం కూడా, ఆర్థిక సంస్కరణల అమలులో భాగమేనని స్పష్టంగా తెలుస్తున్నది. ఇదంతా ఏకపక్షంగా కొనసాగడానికి, ప్రతిపక్షాలు, పౌరసమాజం బలహీనంగా ఉండడమే కారణం.

Updated Date - 2021-08-04T06:08:25+05:30 IST