విపత్తు

ABN , First Publish Date - 2021-06-19T05:44:54+05:30 IST

వ్యవసాయ సీజన్‌ మొదలైందంటే చాలు నకిలీ విత్తనాలు ఉమ్మడి జిల్లాలను ముంచెత్తుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ నిఘా పెరగడంతో నకిలీ రాయుళ్లు మరింతగా జాగ్రత్తగా దందాను కొనసాగిస్తున్నారు. తక్కువ పెట్టుబడి అనే రైతు బలహీనతను ఆసరా చేసుకొని తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలన్న అత్యాశతో అక్రమార్కులు కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదలచేస్తున్నారు.

విపత్తు
నల్లగొండ జిల్లాలో పట్టుబడిన నకిలీ విత్తనాలను పరిశీలిస్తున్న ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, శివశంకర్‌రెడ్డి, ఎస్పీ రంగనాథ్‌

ఉమ్మడి జిల్లాను ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు

15రోజుల్లో రూ.20కోట్లపైగా విత్తనాలు సీజ్‌


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): వ్యవసాయ సీజన్‌ మొదలైందంటే చాలు నకిలీ విత్తనాలు ఉమ్మడి జిల్లాలను ముంచెత్తుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ నిఘా పెరగడంతో నకిలీ రాయుళ్లు మరింతగా జాగ్రత్తగా దందాను కొనసాగిస్తున్నారు. తక్కువ పెట్టుబడి అనే రైతు బలహీనతను ఆసరా చేసుకొని తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలన్న అత్యాశతో అక్రమార్కులు కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి విడుదలచేస్తున్నారు. కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశాలతో పోలీసులు, వ్యవసాయశాఖ సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసినా అక్రమార్కులు వెరవడం లేదు. పీడీ వంటి బలమైన కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడుతున్నా భయపడటంలేదు. ప్రధానంగా మెట్ట రైతులనే కేంద్రంగా చేసుకొని నకిలీ విత్తనాలు విక్రయిస్తుండగా, వ్యవసాయశాఖ అధికారులు దుకాణాలపై దాడులు చేసినా గుర్తించలేని రీతిలో ప్యాకింగ్‌ చేస్తున్నారు. అంతేగాక అధికారుల నిఘా పెరగడంతో పల్లెల్లోని రైతులనే ఏజెంట్లుగా మార్చుకొని దందా కొనసాగిస్తున్నారు.



ఉమ్మడి జిల్లాలో 15 రోజుల్లో టాస్క్‌పోర్స్‌ బృందాలు నిర్వహించిన దాడుల్లో రూ.20కోట్లకు పైగా విలువైన నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. 23మందిని అరె్‌స్టచేసి జైలుకు తరలించారు. సూర్యాపేట పట్టణం,చింతలపాలెం, అర్వపల్లి, తిరుమలగిరి, తుంగతుర్తి మొ త్తం ఐదు కేంద్రాల్లో 15 రోజుల వ్యవధిలో రూ.14.45లక్షల విలువై న నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.20 టన్నుల విత్తనాలు సీజ్‌ చేశారు. వీటిలో పత్తి, మిర్చి, కూరగాయల విత్తనాలు ఉన్నాయి. ఈ నెల 3న యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ దుకాణం నుంచి గడువు తీరిన విత్తనాలు, పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అయిదున్నర కేజీల పాలకూర విత్తనాలు 46 పురుగు మందుల పాకెట్లు ఉన్నాయి. తాజాగా, నల్లగొండ జిల్లాలో రూ.6కోట్ల విలువైన 200 టన్నుల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. వీటిలో పత్తి, మొక్కజొన్న, వరి రకాలు ఉన్నాయి. 13 మంది సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఎనిమిది కేసులు నమోదు కాగా, ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదుచేశారు. ఈ కేసుల్లో మొత్తం 91 మందిని అరెస్టు చేసి 5776.98క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్‌ చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. 


నంద్యాల మీదుగా జిల్లాకు

సాధారణంగా కంపెనీలు రైతులతో విత్తనాలు సాగు చేయిస్తాయి.ఆతరువాత వాటిని ప్రాసెస్‌ చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. రైతులు సాగు చేసిన విత్తనాలు తామే కొనుగోలు చేసేలా ఒప్పదంతో కంపెనీలు రంగంలోకి దిగుతాయి. ఇక్కడే నకిలీలకు బీజం పడుతోంది. కంపెనీల సిబ్బంది రైతులతో అనుకున్న దానికిమించి అధిక మొత్తంలో సాగు చేయించి అందుకు అనధికారికంగా డబ్బు ముట్టజెబుతారు. అక్కడి నుంచి తెచ్చిన విత్తనాలను నేరుగా మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కర్నూలు జిల్లా నంద్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ నుంచి ఈ నకిలీ విత్తనాలు ఉమ్మడి జిల్లాకు చేరుతున్నాయి. తక్కువ ధరకు విత్తనాలు వస్తుండటంతో జిల్లా రైతులు అక్కడికే వెళ్లి కొనుగోలుచేసి తీసుకువస్తున్నారు. తాజాగా నిఘా పెరగడంతో నకిలీ వ్యాపారులు రూట్‌ మర్చారు. మెట్ట ప్రాంతాల్లోని, తెలిసిన రైతులతో ఫోన్‌లో సంప్రదించి గ్రామానికి ఒక నమ్మకస్థుడిని ఎంపిక చేసుకొని సరుకు సరఫరాచేసి డబ్బు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా వసూలు చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌ కంపెనీలను పోలిన రీతిలో, ఎక్కడా అనుమానం రాకుండా పాకెట్లపై సమాచారం, క్యూఆర్‌ కోడ్‌ కూడా ముద్రి స్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయంటే రైతులు అనుమానించి అధికారులకు ఫిర్యా దు చేస్తేనే నకిలీల వ్యవహారం వెలుగులోకి వస్తోంది.


రంగురంగుల ప్యాకెట్లు

నాణ్యతా ప్రమాణాలు లేక తిరస్కరణకు గురైన, గడువు ముగిసిన విత్తనాలను పత్తి మిల్లుల నుంచి సేకరించి బ్రాండెడ్‌గా ఉండేలా రంగుల్లో ముంచి రైతులను ఏమారుస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తన కంపెనీల ఎండీలే ఈ అక్రమాలకు తెరలేపడంతో పెద్ద సంఖ్యలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, నైరుతీ సీడ్స్‌ ఎండీ, ఎంజీ ఆగ్రోటెక్‌ కంపెనీ కీలక ఉద్యోగులు నకిలీ విత్తనాల్లో సూత్రధారులుగా ఉన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రముఖ కంపెనీల విత్తన ప్యాకెట్‌ ధర అరకేజీ రూ.767వరకు ఉంటుంది. నాణ్యతలేని విత్తనాలకు రంగులు వేసి, ఆకర్షణీయ ప్యాకెట్‌లో సిద్ధం చేస్తే ప్యాకెట్‌కు రూ.200 వరకు ఖర్చు వస్తుంది. దీన్ని మార్కెట్‌లో డీలరుకు రూ.450కు విక్రయిస్తున్నారు. వారు రైతుకు రూ.570కి అంటగడుతున్నారు. ఫలితంగా ఉత్పత్తిదారులకు రూ.350, డీలర్‌కు రూ.100వరకు లాభం ఉంటుంది. నకిలీవని తెలిసినా వ్యాపారులు లాభం చూసుకొని రైతులను మోసగిస్తారు. సమాచారం ఇవ్వకుండా వ్యవసాయ, పోలీసు అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్కో రైతుకు నాలుగు రకాల పాకెట్లు విక్రయిస్తుండగా, అందులో రెండు నకిలీ కంపెనీలవి ఉంటున్నాయి. ఆకర్షించే ప్యాకింగ్‌, డీలర్‌ మాటలతో ఒప్పించడంతో రైతులు మోసపోతున్నారు.


మెట్టప్రాంతాల రైతులే టార్గెట్‌

మోసం బయటపడకుండా ఉండేందుకు నకిలీ బాబులు మెట్ట ప్రాంతాలు, ప్రధానంగా పత్తి రైతులనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షపాతం సరిగా ఉండదు. అంతేగాక నేల స్వభావం భారీ దిగుబడులకు అనుకూలంగా ఉండదు. ఇక్కడ నకిలీ పత్తి విత్తనాలు అంటగడితే రైతులకు అనుమానం రాదు. ఉత్పత్తి తగ్గితే వర్షపాతం, నేలల తీరే అని సర్దుకునేవారు 90శాతం మంది వరకు ఉంటారు. అందుకే దశాబ్దాలుగా నకిలీల ఆటలు మెట్టప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వరి వంటి వత్తనాలు గ్రామాల్లోనే దొరుకుతాయి. వాటి ధర, మిగులుబాటు తక్కువ. అధిక మిగులుఉండే పత్తి విత్తనాలపైనే ఎక్కువగా నకిలీ బాబులు దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, నకిరేకల్‌, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఈ విత్తనాల విక్రయం అధికంగా కొనసాగుతోంది. దేవరకొండ రైతులు తాజాగా నకిలీలపై అప్రమత్తమై సమాచారం ఇవ్వకపోతే 40వేల ఎకరాల పంట, లక్ష మంది రైతుల జీవితాలు నష్టాల ఊబిలో కూరుకుపోయేవి.

Updated Date - 2021-06-19T05:44:54+05:30 IST