అనర్థాలే అధికం

ABN , First Publish Date - 2021-11-09T06:13:42+05:30 IST

ఐదేళ్ళక్రితం, నవంబరు 8వతేదీ రాత్రి 8గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ టెలివిజన్ చానెళ్ళలో ప్రత్యక్షమై, అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి వెయ్యి, ఐదువందల రూపాయలనోట్లు చెల్లబోవన్న ప్రకటన ద్వారా ప్రజల నెత్తిన ఓ బాంబు పడేశారు...

అనర్థాలే అధికం

ఐదేళ్ళక్రితం, నవంబరు 8వతేదీ రాత్రి 8గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ టెలివిజన్ చానెళ్ళలో ప్రత్యక్షమై, అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి వెయ్యి, ఐదువందల రూపాయలనోట్లు చెల్లబోవన్న ప్రకటన ద్వారా ప్రజల నెత్తిన ఓ బాంబు పడేశారు. నల్లధనాన్నీ, ఉగ్రవాదాన్నీ సర్వనాశనం చేయగలిగే బ్రహ్మాస్త్రంగా మోదీ దీనిని అభివర్ణించారు. ఆ నిర్ణయంతో 86శాతం కరెన్సీ సర్క్యులేషన్ నుంచి హఠాత్తుగా మాయమై జనం నానా బాధలూ పడ్డారు. గడువులోగా పాత నోట్లను తమ ఖాతాల్లో వేసుకోవడానికీ, మార్చుకోవడానికి బ్యాంకుల ముందు రోజుల తరబడి బారులు తీరారు. ఈ పెద్దనోట్ల రద్దు నిర్ణయం నగదుమీద నేరుగా ఆధారపడి బతికే చిన్నాచితకా వ్యాపారులను ప్రత్యక్షంగా చావుదెబ్బకొట్టింది. వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. చిల్లరవర్తకం చితికిపోయింది. అసంఘటిత రంగంలో ఉన్నవారు ప్రత్యక్షనరకాన్ని చూశారు. 


హఠాత్తుగా పెద్దనోట్లను ఇలా చెల్లకుండా చేయడం ద్వారా నల్లధనాన్ని తవ్వితీయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఏమాత్రం నెరవేరలేదు. రద్దయిన నగదులో 99శాతం పైగానే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరుకుంది. ప్రభుత్వమే పార్లమెంటులో ఆ తరువాత చేసిన ఓ ప్రకటనలో, డిమానిటైజేషన్ సహా నల్లధనం ఏరివేతకు ప్రభుత్వం అనుసరించిన అన్ని మార్గాల ద్వారా లక్షకోట్లు కూడా నిగ్గుతేలలేదని పేర్కొంది. ఇక, డిమానిటైజేషన్ ప్రకటించిన 2016లో  ఓ ఆరులక్షల నకిలీనోట్లు వెలుగులోకి వస్తే, ఆ తరువాతి నాలుగేళ్ళలో 18లక్షల నకిలీ నోట్లు దేశవ్యాప్త దాడుల్లో బయటకు వచ్చాయని రిజర్వుబ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.  నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమనే లక్ష్యం కూడా ఈ పెద్దనోట్ల రద్దునిర్ణయం వెనుక ఉన్నదని ప్రభుత్వం చెప్పుకున్నది. డిమానిటైజేషన్ తరువాత కూడా జనం నగదుకు పెద్దగా దూరం కాలేదని డేటా చెబుతోంది. 2016లో, ఈ నిర్ణయానికి కాస్త ముందు రమారమి 17లక్షల కోట్ల నగదు చెలామణీలో ఉంటే, మొన్న అక్టోబరు నాటికి అది దాదాపు 28లక్షలకోట్లుగా ఉంది. నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడానికి రిజర్వుబ్యాంకు కొత్త నియమాలు, ఆంక్షలతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లో నగదు వాడకం పెరుగుతూనే వచ్చింది. ఇలా, అప్పటికంటే ఇప్పుడు మరో పదిలక్షలకోట్లతో, యాభై ఏడుశాతానికి పైగా నగదు సరఫరా వ్యవస్థలో అధికంగా ఉన్నంతమాత్రాన డిజిటల్ చెల్లింపులు పెరగలేదని అనలేం. వాటి విస్తృతీ బాగానే ఉంది. అప్పట్లో వేలల్లో ఉన్న లావాదేవీలు ఇప్పుడు లక్షల్లో సాగుతూ లక్షలకోట్లు ఆన్‌లైన్లో చేతులు మారుతున్నాయి. డిమానిటైజేషన్ నిర్ణయం ప్రభావం కంటే కరోనా కారణంగా దేశంలో ఇప్పుడు చిన్న చిన్న లావాదేవీలు కూడా డిజిటల్ రూపంలో సాగుతున్న మాట నిజం. 


పెద్దనోట్ల రద్దు నిర్ణయం అద్భుతమనీ, అది దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో పెట్టిందని పాలకులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ, ఆర్థికవ్యవస్థపై దాని దుష్ప్రభావాలు అత్యధికమని అంతర్జాతీయ పరిశోధకుల అధ్యయనాలు తేల్చాయి. మరీ ముఖ్యంగా నగదు ఆధారిత గ్రామీణ ఆర్థికవ్యవస్థను ఈ నిర్ణయం ఎన్నటికీ తేరుకోలేని రీతిలో చావుదెబ్బతీసింది. ఆర్థికాభివృద్ధి వేగాన్ని శాశ్వతంగా ఈ నిర్ణయం కుంటుపరచింది. నరేంద్రమోదీ ఈ నిర్ణయం తీసుకొనేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించలేదనీ, రిజర్వుబ్యాంకు పాత్ర ఇందులో ఏమాత్రం లేకపోయిందని రఘురామ్ రాజన్ సహా అప్పట్లో ఆర్బీఐలో కీలకభూమికలు నిర్వహించిన కొందరు అనంతరకాలంలో చేసిన వ్యాఖ్యలను బట్టి రుజువైంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఓ పదిహేనుమంది బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేసే లక్ష్యంతో మోదీ తీసుకున్నారనీ, అలాగే చిల్లరవర్తకుల కడుపుకొట్టి అమెజాన్‌ను పెంచిపోషించడం దీని లక్ష్యమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వంటివారు అప్పట్లో విమర్శించారు. డిజిటల్ చెల్లింపులు పెరగడం, ఆర్థికరంగాన్ని మరింత వ్యవస్థీకృతం చేయడం వంటివి సాధ్యపడినప్పటికీ, డిమానిటైజేషన్ మంచికంటే చెడే ఎక్కువ చేసిందన్నది వాస్తవం. ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేముందు సంప్రదింపులు జరపడం,  కష్టనష్టాలను కొంతమేరకైనా అంచనా కట్టడం ముఖ్యం.

Updated Date - 2021-11-09T06:13:42+05:30 IST