10 రోజులకే..కరోనా రోగుల డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-05-23T08:34:53+05:30 IST

కరోనా రోగుల డిశ్చార్జ్‌ నిబంధనలు మారాయి. ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారికి 14 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అందించి

10 రోజులకే..కరోనా రోగుల డిశ్చార్జి

గతంలో 14 రోజుల చికిత్స అనంతరం నిర్ణయం

రెండుసార్లు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జి

ఐసీఎంఆర్‌ తాజా గైడ్‌లైన్స్‌తో తగ్గిన గడువు

పది రోజుల చికిత్స అనంతరం నెగెటివ్‌ వస్తే ఇంటికే

20 రోజుల హోమ్‌ క్వారంటైన్‌ తప్పనిసరి 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

కరోనా రోగుల డిశ్చార్జ్‌ నిబంధనలు మారాయి. ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారికి 14 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అందించి కోలుకున్న తరువాతే డిశ్చార్జ్‌ చేసేవారు. వైరస్‌ లక్షణాలు లేకుంటే...14, 15 రోజుల్లో రెండుసార్లు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఐసీఎంఆర్‌ రోగుల డిశ్చార్జ్‌ నిబంధనలను మార్చింది. దేశవ్యాప్తంగా వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువమంది పది రోజుల్లోనే కోలుకుంటుండడం, ఆ తరువాత వైరస్‌ లక్షణాలేవీ కనిపించకపోవడాన్ని గుర్తించింది. దీంతో వైరస్‌ బారినపడిన పది రోజుల్లో రోగులను డిశ్చార్జ్‌ చేయాలని సూచించింది. అందుకు అనుగుణంగానే జిల్లాలో వైరస్‌ బారినపడిన వారిని ఇళ్లకు పంపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


గతంలో ఇలా.. 

కొద్దిరోజుల ముందు వరకు వైరస్‌ బారినపడిన వ్యక్తిని తప్పనిసరిగా 14 రోజులపాటు ఆస్పత్రిలో వుంచి చికిత్స అందించేవారు. వైరస్‌ లక్షణాలు లేకపోతే 14, 15 రోజుల్లో రెండుసార్లు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేసేవారు. ఒక్కసారి పాజిటివ్‌ వచ్చినా మరో 14 రోజులపాటు చికిత్స కొనసాగించేవారు.  


తాజా నిబంధనలు ఇలా.. 

ఐసీఎంఆర్‌ సూచించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం..ప్రస్తుతం కోవిడ్‌ బారినపడిన వ్యక్తులకు పది రోజులపాటు చికిత్స అందించి, ఒకసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపిస్తున్నారు. అయితే అతడు/ఆమె ఇంటికి చేరిన తరువాత కనీసం 20 రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలి. 


ఆస్పత్రుల్లో 23 మందికి చికిత్స  

ప్రస్తుతం నగరంలోని మూడు ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 వైరస్‌తో బాధపడుతూ 23 మంది చికిత్స పొందుతున్నారు. కేర్‌లో ఒకరు, గీతంలో 15 మంది, విమ్స్‌లో ఏడుగురు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందగా, 61 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. 


ఐసోలేషన్‌ వార్డులో 40 మంది

జిల్లాలోని రెండు ఐసోలేషన్‌ ఆస్పత్రుల్లో 40 మంది ఉన్నారు. ఇప్పటివరకు 27,266 మందికి పరీక్షలు నిర్వహించగా, 26,991 మందికి నెగెటివ్‌ వచ్చింది. 85 మంది వైరస్‌ బారినపడగా, 190 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలోని పలు క్వారంటైన్‌ కేంద్రాల్లో 596 మంది ఉన్నారు. వైరస్‌ బారినపడిన ఒకరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో డిశ్చార్జ్‌ చేశారు. 


ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ మేరకే

దేశంలో వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువ మంది పది రోజుల్లోనే కోలుకుంటున్నారు. దీంతో ఐసీఎంఆర్‌ డిశ్చార్జ్‌ నిబంధనలను మార్చింది. అందుకు అనుగుణంగానే వైరస్‌ బారిన పడిన పది రోజుల తరువాత లక్షణాలు లేకపోతే పరీక్ష నిర్వహించి నెగెటివ్‌ వస్తే డిశ్చార్జ్‌ చేస్తున్నాం. లక్షణాలుంటే  మరికొద్ది రోజులపాటు ఆస్పత్రిలో వుంచి చికిత్స అందిస్తున్నాం. డిశ్చార్జ్‌ చేసే ముందు ఒకసారే పరీక్ష నిర్వహిస్తున్నాం. ఇందులో నెగెటివ్‌ వస్తే చాలు. ఇంటికి వెళ్లిన తరువాత తప్పనిసరిగా 20 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలి.

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, డిశ్చార్జ్‌ కమిటీ చైర్మన్‌ 

Updated Date - 2020-05-23T08:34:53+05:30 IST