ఎందుకు.. ఆలో‘శిస్తు’న్నారో?

ABN , First Publish Date - 2021-08-23T05:36:09+05:30 IST

ప్రభుత్వం గత మూడేళ్లుగా పసలీ 30, 31కు సంబంధించి రైతుల నుంచి శిస్తు వసూలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వాలు రశీదు ద్వారానే రైతుల నుంచి ఆక్వా పరంగా ఎకరానికి రూ.500, వ్యవసాయం పరంగా ఎకరాకు రూ.350 వసూలు చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో మాత్రమే నామమాత్రంగా శిస్తు వసూలు చేస్తోంది. రశీదు పుస్తకాల్లో కాకుండా ఆన్‌లైన్‌లో శిస్తు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వీఆర్‌వోలకు రశీదు పుస్తకాలు ఇవ్వకుండా నిలిపివేసింది. కానీ ఆన్‌లైన్‌ విధానం ఇంకా ప్రారంభించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో కొంతమంది వీఆర్‌వోలు శిస్తు పుస్తకాలు ఉన్నచోట వసూళ్లు చేస్తున్నారు. మిగతా చోట్ల శిస్తును వసూలు చేయడం లేదు.

ఎందుకు.. ఆలో‘శిస్తు’న్నారో?

మూడేళ్లుగా నిలిచిన శిస్తు వసూళ్లు

 ఆన్‌లైన్‌ విధానం అమలుపై జాప్యం

 ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం

 ఒకేసారి చెల్లించాలంటే రైతులకు ఇబ్బందే

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రభుత్వం గత మూడేళ్లుగా పసలీ 30, 31కు సంబంధించి రైతుల నుంచి శిస్తు వసూలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం  వాటిల్లుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వాలు రశీదు ద్వారానే రైతుల నుంచి ఆక్వా పరంగా ఎకరానికి రూ.500, వ్యవసాయం పరంగా ఎకరాకు రూ.350 వసూలు చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో  మాత్రమే నామమాత్రంగా శిస్తు వసూలు చేస్తోంది. రశీదు పుస్తకాల్లో కాకుండా ఆన్‌లైన్‌లో శిస్తు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వీఆర్‌వోలకు రశీదు పుస్తకాలు ఇవ్వకుండా నిలిపివేసింది. కానీ ఆన్‌లైన్‌ విధానం ఇంకా ప్రారంభించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో కొంతమంది వీఆర్‌వోలు శిస్తు పుస్తకాలు ఉన్నచోట వసూళ్లు చేస్తున్నారు. మిగతా చోట్ల శిస్తును వసూలు చేయడం లేదు.  ఆన్‌లైన్‌లో ప్రక్రియ ప్రారంభించిన తర్వాత 30, 31 పసలీ శిస్తును ఒకేసారి చెల్లించాలంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా 30, ఆ తర్వాత 31 పసలీ ప్రకారం దశలవారీ శిస్తు వసూలు చేస్తే కాస్త ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


గతంలో తప్పులు చేస్తే కేసులు :

గత ప్రభుత్వాలు రశీదు రూపంలో శిస్తులను చెల్లించుకునే సమయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏమైనా అవకతవకలకు పాల్పడితే వారి నుంచి రివకరీ చేసేవి. అక్రమాలకు పాల్పడిన వారిపై  పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేవారు. ఆన్‌లైన్‌ వ్యవస్థలో కూడా ఇటువంటి అక్రమాలు చోటుచేసుకోవని ఎవరూ భరోసా ఇవ్వలేరు. రైతుల్లో ఎక్కువ శాతం చదువురాని వారు ఉన్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో శిస్తు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్‌ ప్రారంభించే వరకు రశీదు పుస్తకాల ద్వారా శిస్తు వసూళ్లకు ప్రభుత్వం అనుమతిస్తే ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు రైతులకు కూడా భారంగా ఉండదని పేర్కొంటున్నారు. 


జిల్లాలో వసూళ్ల పరిస్థితి ఇదీ : 

సంవత్సరం               లక్ష్యం                    వసూళ్లు

2019- 20        రూ. 30 కోట్లు    రూ. 3.22 కోట్లు

2020- 21        రూ. 30 కోట్లు    రూ. 2.05 కోట్లు

2021- 22        రూ. 35 కోట్లు    రూ. 88 లక్షలు   


ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే : 

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే శిస్తు వసూలు చేస్తాం. ఆన్‌లైన్‌ విధానంలో వసూలు చేయాలని నిర్ణయించినా.. ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో జాప్యమవుతోంది. ఆన్‌లైన్‌ విధానం ప్రారంభమైన తరువాత పూర్తిస్థాయిలో శిస్తు వసూలు చేస్తాం.  

- బి.దయానిధి, జిల్లా రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం 

Updated Date - 2021-08-23T05:36:09+05:30 IST