నియమపాలన

ABN , First Publish Date - 2021-07-16T05:30:00+05:30 IST

ఏ మనిషైనా నియమాలు పాటించాలి.. పాటిస్తున్నట్టు నటించకూడదు. ఇది ఒక్క నియమాల విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. శ్రద్ధగా చదివితేనే జ్ఞానం లభిస్తుంది. మనం ఏ పని చేసినా దానిలో చిత్తశుద్ధి ఉండాలి...

నియమపాలన

ఏ మనిషైనా నియమాలు పాటించాలి.. పాటిస్తున్నట్టు నటించకూడదు. ఇది ఒక్క నియమాల విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. శ్రద్ధగా చదివితేనే జ్ఞానం లభిస్తుంది. మనం ఏ పని చేసినా దానిలో చిత్తశుద్ధి ఉండాలి. అలా చిత్తశుద్ధితో చేసే పని సహజంగా కనిపిస్తుంది. లేదంటే కృతకంగా అనిపిస్తుంది.


ఆ రోజుల్లో కొందరు భిక్షువులు బుద్ధుణ్ణి దర్శించుకొనేటప్పుడు నలిగిపోయిన, చినిగిపోయిన వస్త్రాలు ధరించి వచ్చేవారు. ఎందుకంటే, బుద్ధుడు నిండా చిరుగులు కుట్టిన వస్త్రాన్నే ధరించేవాడు. పూర్తిగా జీర్ణం అయ్యేవరకూ అలా వస్త్రాలను ధరించడం బౌద్ధ భిక్షంవులు పాటించాల్సిన నియమం. ‘స్వయంగా బుద్ధుడే చిరుగుల చీవర ధారిగా ఉంటే... తాము మంచి చీవరాలు ధరించి వెళ్ళడం బాగుండదు కదా!’ అని భావించిన భిక్షువులు ఆయనను దర్శించేటప్పుడు చిరుగుల చీవరాలే ధరించేవారు. బుద్ధుడు ధర్మోపదేశం చేసి తన గదిలోకి వెళ్ళగానే... వారిలో కొందరు వెంటనే ఆ చీవరాలను మార్చేసి, మంచి చీవరాలు ధరించి బయటకు నడిచేవారు. అలాంటి భిక్షువుల గురించి తెలిసి... వారికి బుద్ధుడు చెప్పిన సందేశాత్మకమైన కథ ఇది.

గంగానదీ తీరంలో ఒక తోడేలు ఉండేది. అది ఆ తీరంలో ఉన్న రాతి బండల మీద నివసించేది. ఒకసారి నదికి వరద వచ్చింది. రాతి బండల చుట్టూ నీరు చేరింది. ఆ ప్రదేశాన్ని దాటి అడవిలోకి పోవడానికి దారి లేకుండా పోయింది. నీరు క్రమక్రమంగా పెరిగింది. 

రెండు రోజులు గడిచాయి. అప్పుడు ఆ తోడేలు ‘‘నాకు ఎటూ పోయే దారి లేదు. ఈ ఆకలి తప్పదు. ఏ ఆహారం దొరకదు. కాబట్టి ఈ నాలుగు రోజుల్నీ వృథాగా ఎందుకు పోనివ్వాలి? ఉపవాస వ్రతాన్ని పాటిస్తే పుణ్యమైనా దక్కుతుంది’’ అనుకుంది. కళ్ళు మూసుకొని ‘ఇక జీవహింస చేయకూడదు’ అనుకుంది. కొంత సమయం గడిచింది. దాని చెవులకు దూరం నుంచి మేక అరుపు వినిపించింది. ‘అది మేక అరుపు అవునో, కాదో? అలా భ్రమపడ్డానేమో?’ అనుకొని కళ్ళు తెరవకుండా అలాగే ఉంది.

మళ్ళీ మేక అరుపు... మరింత దగ్గరగా వినిపించింది. తోడేలు మెల్లగా కళ్ళు తెరిచింది. తల పైకెత్తి అటూ ఇటూ చూసింది. దానికి దగ్గరలోని ఒక రాతి బండ మీద బాగా బలిసిన మేక పోతు కనిపించింది. 

‘‘ఆహా... నా వ్రత ఫలితం ఇది. ఈ వ్రతం ఇంతటితో చాలు’’ అని లేచింది. ఎగిరి ఆ మేక పోతు వైపు దూకింది. నీటి శబ్దం వినిపించడంతో మేక పోతు తలెత్తి చూసి, బండల మీద నుంచి దూకుతూ పారిపోయింది. తోడేలు ఆ మేకపోతు వెంట పడింది. అది కనిపించకపోవడంతో తిరిగి వెనక్కు వచ్చింది. ‘‘అది చిక్కలేదు... కాబట్టి నా వ్రత భంగం కాలేదు. ఇక నా ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తాను’’ అనుకొని, మళ్ళీ పడుకొని, కళ్ళు మూసుకొని, ‘‘జీవహింస చేయరాదు’’ అని అనుకోసాగింది. 

బుద్ధుడు ఈ కథ చెప్పి ‘‘మనం నియమాలు తప్పే అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నా... వాటిని తప్పకపోవడమే నిజమైన శీల అనుపాలన. అవకాశాలు లేనప్పటికన్నా ఉన్నప్పుడు వాటి నుంచి తనను తాను కాపాడుకోగలగాలి. వాడే నిజమైన శీలవంతుడు. చిత్తబలం లేనివారు నిర్ణయానికి కట్టుబడరు. తాడులా తేలిపోతారు’’ అని చెప్పాడు. 

- బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST