డిస్కమ్‌ల నష్టాలకు ప్రభుత్వమే కారణం

ABN , First Publish Date - 2022-02-26T08:13:24+05:30 IST

విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

డిస్కమ్‌ల నష్టాలకు ప్రభుత్వమే కారణం

ఏటా రూ.10 వేల కోట్ల బకాయి పడుతోంది.. రాబట్టుకోవడంలో అధికారులు విఫలం

చార్జీల పెంపుతో పేదల రక్తం పీల్చే యత్నం

పెంపును తిరస్కరించాలి: రేవంత్‌

కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్‌ఈఆర్‌సీ బహిరంగ విచారణ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద వినియోగదారు అని, విద్యుత్‌ వినియోగంలో ప్రభుత్వ వాటాయే 30 శాతం అని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏటా రూ.16 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. రూ.5652 కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు. తద్వారా ఏటా రూ.10 వేల కోట్ల బకాయి పడుతూ డిస్కమ్‌లు దివాలా తీసేందుకు కారణమవుతోందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అధికారులు క్రిమినల్‌ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2022-23 సంవత్సరానికిగాను రూ.6831 కోట్ల మేర విద్యుత్‌ చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత డిస్కమ్‌ల అప్పులు రూ.11 వేల కోట్లు ఉన్నాయని, అందులో ఉదయ్‌ ఒప్పందం కింద రూ.8934 కోట్లను ప్రభుత్వం బదలాయించుకుందని పేర్కొన్నారు. డిస్కమ్‌లకు అప్పులు/నష్టాలు రూ.2 వేల కోట్లు మాత్రమే మిగిలాయని, కానీ.. ఇప్పుడు రూ.60 వేల కోట్లకు చేరాయని అన్నారు. రాజకీయ పార్టీల హామీలను అమలు చేసే క్రమంలోనే డిస్కమ్‌లు కుప్పకూలాయన్నారు. డిస్కమ్‌ల ఆస్తులన్నీ అమ్మినా అప్పులు, నష్టాలు తీరవన్నారు. ప్రభుత్వం నుంచి రూ.60 వేల కోట్లను రాబట్టుకోలేక పేదల నుంచి రూ.10 వేల కోట్లు వసూలు చేసేందుకు చార్జీల పెంపును ప్రతిపాదించారని ఆక్షేపించారు. పేదల రక్తంపీల్చాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 


ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు..

ఏడేళ్లలో జెన్‌కో ప్రాజెక్టుల ఉత్పాదక సామర్థ్యం పెంచకుండా అధికారులు ప్రభుత్వరంగ సంస్థలకు ఉరేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రైవేట్‌ సంస్థలతో కుమ్మక్కై... జెన్‌కో కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసి, అధిక ధరకు కరెంట్‌ కొంటున్నారని ఆరోపించారు. టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ ప్రాతిపదికన ఒప్పందాలు జరిగాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల కరెంట్‌ కొనుగోలు చేసుకున్నారని, ఇదేకాక మరో 1000 మెగావాట్ల కరెంట్‌ తీసుకుంటామనిపవర్‌గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కరెంట్‌ తీసుకోకపోవడం వల్ల వీలింగ్‌ చార్జీల కింద సీఈఆర్‌సీ ఆదేశాలతో రూ.261 కోట్లను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రైవేట్‌ ప్లేయర్‌లతో కుమ్మక్కైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.


దేశవ్యాప్తంగా 41 డిస్కమ్‌లు ఉంటే.. ఎస్పీడీసీఎల్‌ బీ-గ్రేడ్‌తో 23వ స్థానంలో, ఎన్పీడీసీఎల్‌ సీ-గ్రేడ్‌తో 33వ స్థానంలో ఉన్నాయని తెలిపారు. ఇవి దేశానికి ఏ విధంగా ఆదర్శమని ప్రశ్నించారు. డిస్కమ్‌లను అధికారులే దివాలా తీయించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారుల ఆస్తులను అమ్మి ఆ నష్టాలను పూడ్చుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, శ్రీశైలం రిజర్వాయర్‌లో నిండుగా జలాలున్న సమయంలో నిర్వహణ పేరిట ప్లాంట్‌ను ఆపకుండా పనులు చేయడంతో ప్రమాదం జరిగిందని,నిర్వహణకు నిధులు ఇవ్వాలని చీఫ్‌ ఇంజనీర్‌ విజ్ఙప్తి చేసినా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. 900 మెగావాట్ల ప్లాంట్ల ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటనపై సీబీసీఐడీ, అధికారుల కమిటీతో విచారణ జరిపించారని, నివేదిక ఎక్కడికి పోయిందన్నారు. ప్లాంట్‌లో ప్రమాదం జరిగి... రూ.వేల కోట్ల నష్టం జరిగిందని, ఈఆర్‌సీ సుమోటో విచారణ జరిపి.. అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు. కరెంట్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచవద్దని సీఎల్పీ ఉపనేత డి.శ్రీధర్‌బాబు అన్నారు. 

డిస్కమ్‌లను అడ్డుకుంటున్న ప్రభుత్వం..

డిస్కమ్‌లు సకాలంలో ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విద్యుత్‌రంగ విశ్లేషకుడు వేణుగోపాలరావు ఆరోపించారు. ఏపీలో అమ్మకానికి పెట్టిన కృష్ణపట్నం, దామోదరం సంజీవయ్య థర్మల్‌ ప్లాంట్‌లను తెలంగాణ కొనుగోలు చేయాలన్నారు. ఇక ఈఆర్‌సీలు ఏఆర్‌ఆర్‌లకు ఆమోదం తెలపనప్పుడు ట్రూఅప్‌ క్లెయిమ్‌లో అర్థమే లేదన్నారు. ఎత్తిపోతల పథకాలను నిలిపివేసినా, వర్క్‌ ఫ్రం హోం ముగిసినా.. వాటికి భారీగా విద్యుత్‌ వినియోగాన్ని చూపించారని మరో విశ్లేషకుడు తిమ్మారెడ్డి తప్పుబట్టారు. తక్కువ ధరకు విద్యుత్‌ లభించే ప్లాంట్‌ల నుంచి అధికంగా కొనుగోలు చేయాలన్నారు. రైల్వేలు తక్కువ ధరతో ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థ. దీన్ని ఆర్థిక కోణంలో, వ్యాపార కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని దక్షిణ మధ్య రైల్వే అధికారి మల్లికార్జునరావు అన్నారు. 24 శాతం మేర చార్జీల పెంపు ప్రతిపాదనల్ని ఆమోదిస్తే తమపై అదనంగా రూ.100 కోట్ల భారం పడుతుందని తెలిపారు. కాగా, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ను తాము ఎప్పుడో డిస్‌ కనెక్ట్‌ చేయించుకున్నా.. తమకు రూ.4 లక్షల బిల్లు వేశారని భువనగిరికి చెందిన సామ సత్తిరెడ్డి తెలిపారు.


20 ఏళ్లుగా చార్జీలు పెంచలేదు

20 ఏళ్లుగా 50 యూనిట్లలోపు కరెంట్‌ వాడే వారికి చార్జీలే పెంచలేదు. ఐదేళ్లుగా ఏ వర్గాలకూ పెంచలేదు. డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ అందించడానికి, నాణ్యమైన కరెంట్‌, నిరాఘాటంగా విద్యుత్‌ సరఫరా కోసం నెట్‌వర్క్‌ను రూ.35 వేల కోట్లతో బలోపేతం చేశారు. ఏపీ కన్నా తెలంగాణలోనే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కువ. విద్యుత్‌ కొనుగోలు వ్యయం రూ.4.75లు అవుతుంది. ఎత్తిపోతల పథకాల డిమాండ్‌ 146 శాతంగా పెరిగింది. క్లీన్‌ ఎనర్జీ సెస్‌ టన్నుకు రూ.50 నుంచి రూ.400కు పెరిగింది. బొగ్గు ధర టన్నుకు రూ.800 నుంచి రూ.1200కు చేరింది. అందువల్లే విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరిగింది. చార్జీలు పెంచుతున్నాం.

 - జి.రఘుమారెడ్డి, సీఎండీ ఎస్పీడీసీఎల్‌

సహాయం చేస్తాం

డిస్కమ్‌లకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అవసరమైన సహాయం చేస్తాం. 2016-17 నుంచి 2020-21 దాకా సబ్సిడీ కాకుండా రూ.9161 కోట్ల మేర అదనపు సహాయం చేశాం. 2014-15 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల దాకా రూ.254 67 కోట్ల మేర సబ్సిడీని డిస్కమ్‌లకు ఇచ్చాం. వ్యవసాయ రంగానికి 24 గంటల మేర, 200 యూనిట్ల దాకా గృహ వినియోగదారులకు, ఎస్సీ, ఎస్టీలకు 100యూనిట్ల దాకా, దోభిఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. 

- నీలకుమారి, ఇంధన శాఖ

Updated Date - 2022-02-26T08:13:24+05:30 IST