టీకా కేటాయింపులో మహారాష్ట్రపై వివక్ష

ABN , First Publish Date - 2021-04-09T06:32:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య కరోనా టీకాల కేటాయింపు వివాదం ముదురుతోంది. జాతీయ స్ఫూర్తి కొరవడిన మహారాష్ట్ర ప్రభుత్వం వైర్‌సపై దేశం సాగిస్తున్న పోరాటాన్ని నీరుగారుస్తోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలకు

టీకా కేటాయింపులో మహారాష్ట్రపై వివక్ష

మా జనాభాలో సగం లేని గుజరాత్‌కు కోటి డోసులు

మాకు ఇచ్చింది 1.04 కోట్ల టీకాలే

కేంద్రంపై ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే ధ్వజం


ముంబై, ఏప్రిల్‌ 8: కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య కరోనా టీకాల కేటాయింపు వివాదం ముదురుతోంది. జాతీయ స్ఫూర్తి కొరవడిన మహారాష్ట్ర ప్రభుత్వం వైర్‌సపై దేశం సాగిస్తున్న పోరాటాన్ని నీరుగారుస్తోందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే తీవ్రంగా స్పందించారు. గురువారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష  చూపుతోందంటూ మండిపడ్డారు. ‘‘తాజాగా మహారాష్ట్రకు 7.5 లక్షల టీకాలిచ్చారు. యూపీకి 48 లక్షలు, మధ్యప్రదేశ్‌కు 40 లక్షలు, గుజరాత్‌కు 30 లక్షలు, హరియాణకు 24 లక్షల టీకాలు కేటాయించారు. ఈ వివక్ష ఏమిటని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడటంతో ఈ నెల 15 అనంతరం 17.5 లక్షల టీకాలిస్తామన్నారు. దేశంలోని యాక్టివ్‌ కేసుల్లో 55ు ఉన్న మహారాష్ట్రకు 7.5 లక్షల టీకాలేనా?’’ అని నిలదీశారు. 12 కోట్ల జనాభా ఉన్న తమ రాష్ట్రానికి ఇప్పటివరకు 1.04 కోట్ల టీకాలే ఇచ్చారని, 6 కోట్ల జనాభా, 17 వేల యాక్టివ్‌ కేసులు న్న గుజరాత్‌కు కోటి డోసులు కేటాయించారని తోపే తెలిపారు. రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నామని, వారానికి కనీసం 40 లక్షల టీకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 9 లక్షల టీకాలే ఉన్నాయని.. ఇవి ఒకటిన్నర రోజుకు మించిరావని తోపే చెప్పారు. దేశంలో టీకా కొరత లేదని.. 2.4 కోట్ల నిల్వ డోసులున్నాయని, 1.9 కోట్ల టీకాలు పంపిణీ దశలో ఉన్నాయని హర్షవర్ధన్‌ వివరించారు.


ముంబైలో నేటి నుంచి పంపిణీ బంద్‌

నిల్వలు నిండుకోవడంతో శుక్రవారం నుంచి ముంబై నగరంలో పంపిణీ నిలిపివేయనున్నట్లు మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ తెలిపారు. సతారా, పన్వేల్‌, సాంగ్లి జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్‌ నిలిచిపోనుంది. మరోవైపు మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రతను అందరూ అర్ధం చేసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే కొన్ని కఠిన చర్యలు అవసరమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ కోరారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో తాను మాట్లాడానని, సహకరిస్తామని చెప్పారని పవార్‌ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించి 5 లక్షల టీకాలను వృథా చేసిందని కేంద్ర మంత్రి జావడేకర్‌ ఆరోపించారు. ప్రస్తుతం వారి వద్ద 23 లక్షల టీకాలున్నాయని.. అవి నాలుగు రోజులు వస్తాయని పేర్కొన్నారు.


తక్షణమే కోటి డోసులివ్వండి: ఏపీ 

నిల్వలు రెండ్రోజులకు మించి రావని.. కనీసం కోటి డోసులు తక్షణమే పంపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఏపీలో ప్రస్తుతం 3 లక్షల డోసులున్నాయి. రోజుకు 1.4 లక్షల మందికి టీకా వేస్తున్నారు. జార్ఖండ్‌, ఒడిసా కూడా ఇదే విధంగా కేంద్రానికి నివేదించాయి.

Updated Date - 2021-04-09T06:32:32+05:30 IST