సాగునీటి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ వివక్ష

ABN , First Publish Date - 2022-01-28T05:13:25+05:30 IST

సాగునీటి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ వివక్ష

సాగునీటి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ వివక్ష
విలేకరులతో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి

  • జల వివాదంతో కృష్ణా నీరొచ్చే పరిస్థితి లేదు
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీరే శరణ్యం
  • ప్రభుత్వంపై జిల్లా నేతలు ఒత్తిడి తేవాలి 
  • డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి 

పరిగి, జనవరి 27: సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వివక్ష చూపుతున్నారని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం పరిగిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌లు పాలమూరు ప్రాజెక్టుపై హామీ ఇచ్చారని, మూడేళ్లు గడిచినా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపకాలపై ఏపీ, తెంగాణ, కేంద్ర జోక్యంతో వివాదంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం డీపీఆర్‌ అయినా సమర్పించడం లేదన్నారు. డీపీఆర్లలో కుంభకోణం ఉందని, అందుకే ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జలాల్లో మన వాటా దాటిపోయిందని, దీంతో ప్రాజెక్టు వచ్చే పరిస్థితి లేదన్నారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీరే ఆధారం అన్నారు. నాటి సీఎం వైఎస్సార్‌ చేవెళ్ల-ప్రాణహితను జిల్లాకు తెచ్చారని, కేసీఆ ర్‌ సీఎం అయ్యాక ప్రాజెక్టు డిజైన్‌ మార్చారన్నారు. పాలమూరు నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచంపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటి తెచ్చేలా జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎంపై వొత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. వచ్చే నెలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పరిగిలో జలసాధను సభ ను పెట్టబోతున్నామని తెలిపారు. పూడూరులో నేవీరాడార్‌ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ క్లియరెన్స్‌ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మహేశ్‌రెడ్డిని గెలిపిస్తే ఒక రోజంతా పరిగిలోనే ఉండి హమీలను నేరవేరుస్తానని చెప్పిన కేసీఆర్‌ ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. వికారాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణంలోనూ కేసీఆర్‌కు శ్రద్ధ లేదన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధానకార్యదర్శులు కె.హన్మంత్‌, ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, బి.పరుశరాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, ఇ.కృష్ణ, జి.వెంకట్‌రాంలు, ఆంజనేయులు, రియాజ్‌, మాణిక్యం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:13:25+05:30 IST