వ్యాధులు ముసిరే!

ABN , First Publish Date - 2021-09-07T06:15:53+05:30 IST

జిల్లాను సీజన్‌ వ్యాధులు ముసురుకుంటున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ఏప్రాంతంలో చూసినా జలుబు, జ్వరపీడితులు భారీగా కనిపిస్తున్నారు.

వ్యాధులు ముసిరే!
ఒంగోలు రిమ్స్‌లోని ఓపీ విభాగం వద్ద క్యూలైన్‌లో నిల్చొని ఉన్న జ్వరపీడితులు

విజృంభిస్తున్న విషజ్వరాలు 

దడపుట్టిస్తున్న డెంగ్యూ 

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో 

పెరుగుతున్న బాధితులు

ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద అధికంగా చికిత్సలు 

ముసురు వానలతో అధ్వానంగా పారిశుధ్యం 

అప్రమత్తంకాకపోతే మరింత ప్రబలే అవకాశం 

ఇప్పటికే కరోనాతో తల్లడిల్లుతున్న జనం 

ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా పరీక్షల కోసం పరుగులు

కొండపి, దర్శి మండలాల్లో మంచం పట్టిన గ్రామాలు

గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 250 ఓపీలు వస్తుండగా, అందులో 30 నుంచి 40మంది జ్వరాలతో బాధపడుతున్నారు. మామూలు జ్వరాలకు, మలేరియా, టైఫాయిడ్‌కు స్థానికంగానే రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉంటే మాత్రం నమూనాలను మార్కాపురం పంపి ఫలితాలు రాగానే మందులు ఇస్తున్నారు.

కొండపి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు డెంగ్యూ, వైరల్‌ ఫీవర్లతో మంచం పట్టారు. 15రోజుల కిందట చోడవరం ఎస్సీకాలనీలో 40మంది విష జ్వరాలు బారినపడటంతో వైద్య శిబిరం ఏర్పాటుచేసి నివారణ చర్యలు తీసుకున్నారు. పక్కనే ఉన్న వెన్నూరు ఎస్సీ కాలనీలో పది రోజుల నుంచి 15మందికి పైగా జ్వరంతో మంచం పట్టారు. 

ఎర్రగొండపాలెం  సీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల నుంచి జలుబు, జ్వరంతో రోజూ 50మందికిపైగా వైద్యశాలకు వస్తున్నారు. అక్కడ గతనెల  29న ఓపీ 58  ఉండగా ఈనెల మొదటి వారానికి ఆ సంఖ్య 200 దాటింది. చేరింది.  వైద్యశాలకు వచ్చే వారిలో రోజుకు 50మందికిపైగా దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారే ఉంటున్నారు.

ఇదీ జిల్లాలో పరిస్థితి. సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగ్యూ ప్రబలుతోంది. వీటికితోడు మలేరియా కూడా వణికిస్తోంది. తాజా వాతావరణ పరిస్థితి, విడవకుండా కురుస్తున్న వర్షాలు ఇందుకు కారణమవుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఆఖరికి ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు కూడా ప్రజలు      క్యూ కడుతున్నారు. జ్వరంతోపాటు జలుబు ఉంటుండటంతో కరోనా భయం వెంటాడుతోంది. దీంతో అనేక మంది పరీక్షలకు పరుగులు పెడుతున్నారు. 

ఒంగోలు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాను సీజన్‌ వ్యాధులు ముసురుకుంటున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ఏప్రాంతంలో చూసినా జలుబు, జ్వరపీడితులు భారీగా కనిపిస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో రోజురోజుకూ సీజనల్‌ వ్యాధులతో చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక క్షేత్రస్థాయిలో ప్రాథమిక వైద్యం అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలు, ఇతర ప్రైవేటు వైద్యశాల వద్ద ఈ తరహా వ్యాధులు చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఇలా సీజనల్‌ వ్యాధులు సోకుతున్న వారిలో అనేకమంది డెంగ్యూ, మలేరియాతోపాటు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే కరోనా తీవ్రతతో ఏడాదిన్నరకుపైగా తల్లడిల్లిపోతున్న జిల్లా ప్రజలను ప్రస్తుతం విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు కలవరపెడుతున్నాయి. జలుబు, జ్వరం వచ్చిందంటే ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనా అన్నది తెలియక వైద్య పరీక్షలు, చికిత్సల కోసం ఆస్పత్రులు, ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. అందుకోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చి అల్లాడిపోతున్నారు.


ఇటు ముసురు.. అటు పారిశుధ్యం కరువు

మరోవైపు ప్రజల్లో వ్యాధులు పట్ల ఉన్న భయాన్ని కొన్ని వైద్యశాలలు అలాగే క్షేత్రస్థాయిలో ప్రైవేటు వైద్యులు సొమ్ము చేసుకుంటూ పరీక్షలు, చికిత్సల పేరుతో దోచేస్తున్నారు. ఇక మెడికల్‌ షాపులలో మందులు కొని వేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. కాగా ప్రస్తుత పరిస్థితికి వారం నుంచి ముసురుగా పడుతున్న జల్లులు కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పంచాయతీలు, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఆయా స్థానిక సంస్థల్లో కొత్త పాలకవర్గాలు వచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. వచ్చిన అరకొర ఆర్థికసంఘం నిధులను కూడా విద్యుత్‌, వాటర్‌ బకాయిల పేరుతో వెనక్కి తీసుకోవడంతో ఏపని చెయ్యాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఏకమై కాలు కింద పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధ్వాన పారిశుధ్య పరిస్థితులతో దోమలు పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయి. తక్షణం యంత్రాంగం అప్రమత్తమై తగు చర్యలు తీసుకోకపోతే సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ జ్వరాలతోపాటు మళ్లీ కరోనా కూడా విజృంభించడం ఖాయంగా కనిపిస్తోంది.  


ఒంగోలులో పరిస్థితి తీవ్రం 

 ఒంగోలు నగరంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కరోనా చికిత్సల నేపథ్యంలో రిమ్స్‌లో ఓపీల సంఖ్య 200కు పడిపోగా వారం నుంచి ఆ సంఖ్య రెట్టింపైంది. జ్వరాలతో బాదపడే వారే అధికంగా వస్తున్నారు. వారికి కరోనా పరీక్షలు కూడా చేస్తుండగా నిత్యం 25 నుంచి 30 పాజిటివ్‌లు వెలుగు చూస్తున్నాయి. ఇక నగరంలోని అనేక ప్రైవేటు వైద్యశాలల్లో డెంగ్యూ, ఇతర వైరల్‌ జ్వరాల బారిన పడి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఆయా కాలనీల్లో ప్రాథమిక వైద్యం చేసే ఆర్‌ఎంపీల వద్ద కూడా పెద్దసంఖ్యలోనే జ్వర పీడితులు చికిత్సలు చేయించుకుంటున్నారు. 


జిల్లాలోని వ్యాధుల  పరిస్థితి ఇదీ.. 

కందుకూరులో వారం నుంచి జ్వరాలు ఇతర సీజనల్‌ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో సాధారణంగా రోజువారీ 100 వరకూ ఓపీలు ఉంటాయి. ప్రస్తుతం 150 నుంచి 170వరకు పెరగ్గా అధికులు జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రైవేటు వైద్యశాలలో 60శాతం ఓపీలు పెరిగాయి. గత రెండురోజుల్లో ఆయా వైద్యశాలలో నాలుగు డెంగ్యూ కేసులను గుర్తించినట్లు సమాచారం.

ఉలవపాడు సీహెచ్‌సీలో కూడా సీజనల్‌ జ్వరాలతో వచ్చేవారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. వారంక్రితం వరకు రోజూ 100 లోపే ఓపీలు ఉండగా, ప్రస్తుతం రోజూ 160 నుంచి170కు పెరిగాయని వైద్యులు అంటున్నారు. వారిలో జ్వర పీడితులే అధికంగా ఉంటున్నారని వారు చెప్తున్నారు. 

చీరాల ఏరియా వైద్యశాలలో ప్రస్తుతం రోజుకు 200వరకు ఓపీలు వస్తుండగా, అందులో జ్వరాలతో బాధపడుతున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే అధికశాతం మంది సీజనల్‌ వ్యాధులతో వస్తున్నారు. పర్చూరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో రోజు 50 నుంచి 60 ఓపీలు వస్తుండగా సగంమంది జ్వరపీడితులే ఉంటున్నారు. అద్దంకి ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా జ్వరాలు పెరుగుతున్నాయి. వైద్యశాలకు వచ్చే వారిలో ఎక్కువ మంది సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్న వారే. 

మార్కాపురం ప్రాంతంలోనూ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న వారిలో సగం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద అయితే పెద్దసంఖ్యలో కనిపిస్తున్నారు. గిద్దలూరులో వారంరోజులుగా డెంగ్యూ, మలేరియా, వైరల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. 

దర్శి నియోజకవర్గంలో చూస్తే దర్శి పట్టణంతో పాటు ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే జ్వరపీడితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దర్శి ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం 25 నుంచి 30మంది వరకూ  వస్తున్నారు. ఇక  పామూరులో వ్యాధుల భయం ఎక్కువగా ఉంది. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు వెళ్లి  పరీక్షలు చేయించుకుంటున్నారు. 




Updated Date - 2021-09-07T06:15:53+05:30 IST