దళాల ఉపసంహరణతో భారత్, చైనాలకు సమాన లబ్ధి : ఆర్మీ చీఫ్

ABN , First Publish Date - 2021-02-25T01:38:52+05:30 IST

తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల

దళాల ఉపసంహరణతో భారత్, చైనాలకు సమాన లబ్ధి : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత్, చైనా దళాల ఉపసంహరణ తుది ఫలితం అత్యుత్తమమని భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. ఇది ఇరు దేశాలకు సమాన ప్రయోజనాలను కల్పిస్తుందని తెలిపారు. తూర్పు లడఖ్‌లో తిష్ఠ వేసిన ఇతర సమస్యలను పరిష్కరించేందుకు తగిన వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బుధవారం నిర్వహించిన వెబినార్‌లో జనరల్ నరవనే మాట్లాడారు. 


లడఖ్‌లో ప్రతిష్టంభన కొనసాగిన సమయంలో చైనా, పాకిస్థాన్‌ బాహాటంగా కుమ్మక్కయినట్లు వెల్లడించే సంకేతాలేవీ లేవని తెలిపారు. అయితే భారత దేశానికి కూడా దీర్ఘకాలిక వ్యూహం ఉందన్నారు. రెండు వైపుల నుంచి మాత్రమే కాకుండా రెండున్నర వైపుల నుంచి ఎదురయ్యే యుద్ధాన్ని తిప్పికొట్టడానికి తగిన దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నట్లు తెలిపారు. దేశంలో అంతర్గత భద్రతను సగం యుద్ధం (హాఫ్ ఫ్రంట్ వార్)గా నరవనే అభివర్ణించారు. 


తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి చైనా రక్షణ మంత్రితోనూ, విదేశాంగ మంత్రితోనూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతున్నారని జనరల్ నరవనే తెలిపారు. ఈ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు మన దేశంలోని అన్ని రంగాలు కలిసికట్టుగా కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సాధించినది చాలా మంచి ఫలితమని చెప్పారు. 


పాంగాంగ్ సో ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత్, చైనా దళాలు, ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు గత వారం వెనుకకు వెళ్లిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-02-25T01:38:52+05:30 IST