నిజాయితీ లేని నియామకాలు

ABN , First Publish Date - 2021-04-01T05:45:29+05:30 IST

ఎన్నికల సంఘాల ప్రవర్తనపై దేశవ్యాప్త చర్చజరుగుతుంది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘాలది...

నిజాయితీ లేని నియామకాలు

ఎన్నికల సంఘాల ప్రవర్తనపై దేశవ్యాప్త చర్చజరుగుతుంది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘాలది కీలక పాత్ర. కానీ ఎన్నికల కమిషనర్ల నియామకమే లోప భూయిష్టంగా తయారైంది. ఈసీల నియామకం వివాదం కాకుండా ప్రత్యేక యంత్రాంగం ఉండాలన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయం ఈనాటికీ నెరవేరలేదు. ఫలితంగా దొడ్డిదారి నియామకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికలను నిర్వహించే సమున్నత స్వతంత్ర వ్యవస్థ రాజీపడరాదన్న సుప్రీంకోర్టు స్ఫూర్తికి పట్టం కట్టాలి అంటే కేంద్రం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ల నియామకాన్ని సంస్కరించాలి. 


ఈసీల నియామక విధానాన్ని పక్షపాతరహితంగా మార్చాలని, ఈసీ పదవుల భర్తీలో విపక్షాలకు భాగ స్వామ్యం కల్పించాలని 2012లో బీజేపీ అగ్రనేత ఎల్.కె. ఆడ్వాణీ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‍గా 2006లో టాండన్, 2009లో గోపాల స్వామి కూడా ఇవే సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ల నియామకాల్లో అధికారపక్షం ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వెయ్యటం ఎంత అవసరమో ఆ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్న తీరే ధ్రువీకరిస్తోంది. ఎన్నికల నిర్వహణ పట్ల కొడిగట్టిపోతున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి అంటే ఆ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. ఈసీలో వ్యవస్థీకృత మార్పులు అనివార్యమని సామాజిక వేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి ఆధ్వర్యంలో కొలిజియంతో ఎన్నికల కమీషనర్ల ఎంపిక జరగాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో వుంది. ఇలాంటి మౌలిక విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల పోరులో తీరిక లేకుండా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం కోసం ఈసీలతోనూ, కోర్టుల్లోనూ న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. 


2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈసీ నైతిక విలువలను ప్రశ్నార్థకం చేశాయి. అన్ని పక్షాలను సమానంగా చూడాల్సిన ఈసీ అధికార పక్షాన్ని ఒక విధంగానూ, ప్రతిపక్షాలను మరోవిధంగానూ చూసింది. ఎన్నికల కమిషన్ నియామకాల్లో స్వార్థ రాజకీయాలు చొరబడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‍గా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని నియమిస్తామని గొప్పలు చెప్పింది. ఆ మధ్య రాష్ట్ర ఎన్నికల కమీషనర్‍గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‍ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించి ఆయన స్థానంలో జస్టిస్ కనకరాజును నియమించింది. తర్వాత హైకోర్టు నిమ్మగడ్డను పునరుద్ధరించడంతో కనకరాజును తొలగించారు. ఇప్పుడు మార్చి 30న నిమ్మగడ్డ రిటైర్ కావడంతో మొన్నటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న నీలం సాహ్నికి ఎన్నికల కమిషన్ పదవి కట్ట పెట్టారు. చెప్పడానికే నీతులు తప్ప ఆచరించడానికి కాదని ఈ చర్య ద్వారా మరోసారి ఋజువైంది. 


స్వాతంత్ర్యం అనంతరం ఈ దేశంలో 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పాత తప్పులే పునరావృతం అవుతున్నాయి. 1967 తరువాతి నుంచి పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు తేవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నా ఇంతవరకు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎన్నికల ప్రక్రియను సమూలంగా సంస్కరించేందుకు అప్పట్లో యునైటెడ్ ప్రభుత్వం హయాంలో సిపిఐ నేత, అప్పటి కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ నేరపూరిత రాజకీయాలను అంతమొందించకపోతే స్వేచ్ఛాయుత ఎన్నికలకు అర్థముండదని, ఎన్నికల వ్యవస్థకు పట్టిన జాడ్యాలను పారద్రోలాలి అంటే ఎన్నికల సంస్కరణలు ఒక్కటే మార్గమనీ తేల్చింది. 1999లో కూడా 15వ భారత్ న్యాయ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక సిఫార్సులను అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. ఆ తరువాత రాజ్యాంగ సమీక్షా సంఘం పేరిట జస్టిస్ ఎం.ఎస్ వెంకటాచలయ్య కమిటీని వేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ కమిషన్ 2002 మార్చి31న తన నివేదిక ఇచ్చింది. "ఎన్నికల ప్రక్రియ - రాజకీయ పార్టీలు" అనే శీర్షికన 38 సిఫార్సులు చేస్తే అవి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు. 2015 మార్చిలో కూడా న్యాయ కమిషన్ ఇచ్చిన 255వ నివేదికలోను డబ్బు, నేరగాళ్ల ప్రభావాన్ని అరికట్టే మార్గాలు చూపారు. కావున ఇప్పటివరకు ఎన్నో కమిటీలు ఎన్నో మార్గాలు చూపాయి. వాటిని అమలు చేయడానికి మాత్రం ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం అయినా సత్వర ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయ అవినీతి నిర్మూలనపై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.


దేశ ఎన్నికల వ్యవస్థను శాసిస్తున్న అంగ, అర్థ బలాలు ప్రజాస్వామ్యానికి పెను సవాలు విసురుతున్నాయి. అందుకే గతితప్పిన, నీతిమాలిన రాజకీయాలను ప్రక్షాళన చేయగల సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం విస్పష్ట కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం కదం తొక్కాల్సిన అవసరముంది. దేశాన్ని, సమాజాన్ని గుల్లబారుస్తున్న రాజకీయ అవినీతిని అంతమొందించకపోతే భావితరాలు క్షమించవు. అవినీతిరహిత భారతాన్ని ఆవిష్కరించటమే తమ ప్రభుత్వ లక్ష్యమనీ, అందుకు రాజీలేని పోరాటం చేస్తామనీ అంటారు ప్రధాని నరేంద్ర మోదీ. సంతోషమే! కానీ ఇది మాటల్లోనే మిగిలిపోకుండా చేతల దాకా తీసుకురావాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. ఎన్నికల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ఈ దుస్థితి మారదు. సమగ్ర ఎన్నికల సంస్కరణలే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఏకైక మార్గం. 

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2021-04-01T05:45:29+05:30 IST