అమ్మవారి గుడి స్థలంపై వివాదం

ABN , First Publish Date - 2020-08-14T11:38:39+05:30 IST

అమ్మవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలమని చెబుతున్న దాంట్లో జీవీఎంసీ మరుగుదొడ్లు నిర్మించాలని చేస్తున్న యత్నాన్ని

అమ్మవారి గుడి స్థలంపై వివాదం

భగత్‌సింగ్‌నగర్‌ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణ యత్నాన్ని అడ్డుకున్న స్థానికులు


దొండపర్తి, ఆగస్టు 13: అమ్మవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలమని చెబుతున్న దాంట్లో జీవీఎంసీ మరుగుదొడ్లు నిర్మించాలని చేస్తున్న యత్నాన్ని గురువారం స్థానికులు ప్రతిఘటించారు. వివరాల్లోకి వెళితే...జీవీఎంసీ 27వ వార్డు భగత్‌సింగ్‌నగర్‌ కాలనీలో 1990లో సామాజిక భవనం నిర్మించారు. సచివాలయాలు ఏర్పాటయ్యాక సామాజిక భవనాన్ని సచివాలయంగా మార్చారు. ఈ సచివాలయం పక్కన ఇరవై గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో అమ్మవారి గుడి నిర్మాణానికి ఏడాది క్రితం కాలనీవాసులు శంకుస్థాపన చేశారు. తాత్కాలికంగా ఓ చిన్న మందిరాన్ని నిలబెట్టారు. కరోనా నేపథ్యంలో గుడి నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని ఆనుకుని ఈ స్థలం ఉండడంతో ఆ స్థలంలో మరుగుదొడ్లు నిర్మించాలని జీవీఎంసీ నిర్ణయించింది. గురువారం పనులు చేపట్టేందుకు కొందరు సిబ్బంది పలుగు, పారలతో అక్కడికి వచ్చారు.


దీంతో స్థానికులు అమ్మవారి మందిరాన్ని తొలగిస్తారేమోనన్న భయంతో వారిని అడ్డుకున్నారు. సచివాలయం ఎదురుగానే సులాభ్‌ కాంప్లెక్స్‌ ఉందని, కావాలంటే అందులో ఓ రెండు గదులు సిబ్బందికి కేటాయించాలి తప్ప అమ్మవారి మందిరాన్ని ఆనుకుని మరుగుదొడ్లు నిర్మిస్తే అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని జోన్‌-2 కమిషనర్‌ దృష్టికి కాలనీవాసులు తీసుకువెళ్లారు. అది కమిషనర్‌ పరిధిలోని అంశమని, తానేమీ చెప్పలేనని ఆయన అనడంతో కాలనీవాసులు నిరాశ వ్యక్తం చేశారు. అమ్మవారి మందిరాన్ని తొలిగిస్తారేమోనన్నది తమ అనుమానమని, అలా చేస్తే ప్రతిఘటిస్తామని కాలనీ ప్రతినిధులు జి.సూరమ్మ, కోరాడ సూరిబాబు, మూగి సాంబమూర్తి, కోరాడ అప్పారావు, లక్ష్మణరావు, భవానీశంకర్‌లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-08-14T11:38:39+05:30 IST