Abn logo
Nov 4 2020 @ 01:00AM

అసమ్మతి తాకని అజేయుడు

రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు కేంద్రంలో మోదీ అస్తిత్వాన్ని దెబ్బతీయలేవు కాని భావి పరిణామాలకు సూచిక అవుతాయి. అసమ్మతిని తొక్కిపెడితే వ్యక్తులకు ప్రయోజనం చేకూరవచ్చు కాని అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతుంది. ఢిల్లీలో అధికారం కేంద్రీకృతం అయితే జరిగే నష్టం రాష్ట్రాలకేనని ఆ రాష్ట్రాల నేతలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలనేతలకు తెలియనిది కాదు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రం లో అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటినా ఆయనకు వ్యతి రేకంగా పార్టీలో రణగొణ ధ్వనులు ఎందుకు వినిపించడంలేదు? హేమాహేమీలు సైతం అసమ్మతిని ఎదుర్కొన్న చరిత్ర గల ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా చిన్న అసమ్మతి కూడా ఎందుకు వ్యక్తం కావడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా నరేంద్ర మోదీకే తెలుసు. ఎందుకంటే గుజరాత్‌లో అసమ్మతి శిబిరాలు నిర్వహించిన చరిత్ర ఆయనకున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసమ్మతిని అణచివేసిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. ఒకప్పుడు అసమ్మతిని కూడగట్టిన, అసమ్మతిని అణచివేసిన నరేంద్రమోదీకి జాతీయ స్థాయిలో ఏ రకంగా వ్యవహరిస్తే పార్టీ నేతల మనసుల్లోంచి అసమ్మతి పెదాలపైకి రాకుండా అరికట్టవచ్చో బాగా తెలుసు. 1987లో గుజరాత్‌లో సంఘ్ నుంచి బిజెపిలో ప్రవేశించిన నరేంద్రమోదీ క్రమక్రమంగా పార్టీపై పట్టు సంపాదించారు. ఏడాది లోపే గుజరాత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఆయనకు దక్కింది. అయినప్పటీ తానే పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించి వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. సంస్థాగత వ్యవహారాలపై పట్టు సంపాదించి మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి విజయం సాధించిపెట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌కు కుడిభుజంగా మారి పార్టీలో అయన ప్రత్యర్థి శంకర్ సింగ్ వఘేలాకు వ్యతిరేకంగా నూరిపోసేవారు. ఇద్దరి మధ్యా ఆజ్యం సృష్టించి తన ప్రాధాన్యతను నిరూపించుకున్న నరేంద్రమోదీ ధాటికి ఒక దశలో కేశూభాయి పటేల్ స్వయంగా తట్టుకోలేక వాజపేయికి చెప్పి ఢిల్లీకి పిలిపించారు. మోదీని రాష్ట్రానికి రానివ్వద్దు మహా ప్రభో.. అని ఢిల్లీ నేతలను ప్రాధేయపడ్డారు. కాని ఢిల్లీ నుంచి కూడా మోదీ చక్రం తిప్పారు. క్రమంగా రాష్ట్రంలో కేశుభాయి పటేల్ బలహీనపడ్డారు. ఢిల్లీలో మోదీకి గాడ్ ఫాదర్ అయిన లాల్ కృష్ణ ఆడ్వాణీ వాజపేయిని ఒప్పించి మరీ నరేంద్రమోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపించారు. ఆ తర్వాత మోదీ గుజరాత్‌లో పార్టీలో ప్రత్యర్థి వర్గాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. స్వయంగా కేశుభాయి పటేల్ మోదీకి వ్యతిరేకంగా అసమ్మతి శిబిరాన్ని నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేశుభాయి పటేల్, సురేశ్ మెహతా స్వయంగా ఢిల్లీ వచ్చినా ఎవరూ పట్టించుకోలేని స్థితి ఏర్పడింది. మోదీ ఎవరి పేరు చెబితే వారిని ఢిల్లీలో పార్టీ సస్పెండ్ చేసేది. ఎమ్మెల్యేలను కూడా పార్టీ క్షమించేది కాదు. ఒక దశలో సీనియర్ నేతలతో సహా 60 మంది ఎమ్మెల్యేలు మోదీ వ్యవహార శైలిని, నియంతృత్వ ధోరణులను విమర్శించారు. కాని ఢిల్లీలో వెంకయ్య, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, జవదేకర్ తదితర నేతలు మోదీకి అనుకూలంగా వ్యవహరించేవారు. తనను ఢిల్లీ పంపించడంలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన గుజరాత్ పార్టీ ప్రధానకార్యదర్శి సంజయ్ జోషీని కూడా సస్పెండ్ చేయించడంలో మోదీ కృతకృత్యులు కాగలిగారు.


గత వారం తన 92వ ఏట మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్ ఒక దశలో మోదీని ఓడించేందుకు కాంగ్రెస్‌ను ఆశీర్వదించారు. స్వంత పార్టీపెట్టారు. 1945లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా చేరి, 1950లలో జనసంఘ్ సంస్థాపక సభ్యుడుగా ఉన్న కేశుభాయికి గుజరాత్‌లో పార్టీని బలోపేతం చేసిన ఘనమైన చరిత్ర ఉన్నది. చివరకు ఆయన కూడా మోదీ ఎత్తులకు చిత్తయిపోయారు. విచిత్రమేమంటే కేశుభాయి తనను ఎంత విమర్శించినా మోదీ పల్లెత్తు మాట అనలేదు. ఎక్కడ కలిసినా పాదాలకు నమస్కరించేవారు. ఇటీవల కేశుభాయి పటేల్ మరణించినప్పుడు ఆయన తండ్రి లాంటి వాడని, తనకు రాజకీయ గురువు అని మోదీ చెప్పుకున్నారు. సరే, గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి రథయాత్ర ప్రారంభించినప్పుడు నరేంద్ర మోదీని చేరదీసి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించిన ఆడ్వాణీకి కూడా తాను శిష్యుడినని మోదీ పలు సార్లు చెప్పుకున్నారు. అది వేరే సంగతి.


ఈ నేపథ్యంలో మోదీపై పార్టీలో అసమ్మతి వస్తుందని ఎవరైనా ఊహిస్తే అది భ్రమే అవుతుంది. గుజరాత్‌లో ఆయన ఆశీస్సులతో ఏర్పడ్డ విజయ్ రూపానీ ప్రభుత్వానికి కూడా ఆయన అసమ్మతి తలెత్తకుండా చూసుకోగలిగినప్పుడు ఢిల్లీలో అసమ్మతి ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి గుజరాత్‌లో చాలా మంది అధికారులకు, పార్టీ నేతలకు ఇప్పటికీ నరేంద్రమోదీయే ముఖ్యమంత్రి. లోక్‌ సభలో బిజెపి ఎంపీల్లో 131 మంది మొదటి సారి ఎన్నికైన వారు. మోదీ, అమిత్ షాలు టికెట్ ఇవ్వకపోతే, మోదీ హవా వీయకపోతే బిజెపి ఎంపీల్లో అత్యధిక శాతం గెలిచేవారు కాదు. అనేకమంది క్రింది స్థాయి పార్టీ కార్యకర్తలను మోదీ, అమిత్ షాలు అభ్యర్థులుగా ఎంచుకున్నారు. వారు రాజకీయ ప్రకటనలు చేయడం కానీ, సెంట్రల్ హాలులో చర్చలు జరపడం కానీ చేసిన సందర్బాలు తక్కువ. చిన్న సంకేతం ఇస్తే చాలు పూర్తి మెజారిటీతో ఉభయసభలకు హాజరై పార్టీ నేతలు ఏది చెబితే అది చేస్తారు.


నిజానికి రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే బాధ్యత నరేంద్రమోదీ, అమిత్ షా తీసుకున్నప్పటికీ ఒక వేళ పార్టీ ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించకపోయినా వారిని పల్లెత్తు మాట అనే బిజెపి నేతలు ఢిల్లీలో కనపడరు. మోదీ, అమిత్ షాలు పగ్గాలు చేపట్టిన తర్వాత బిజెపికి అంతటా సానుకూల పవనాలు వీయలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రెండు సార్లు ఓడిపోయింది. గత రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో బిజెపి పరాజయం పాలైంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. అయినప్పటికీ దేశ రాజధానిలో మోదీ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.


ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో పది రాష్ట్రాల్లో 56 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు మోదీ నాయకత్వానికి రెఫరెండంగా పార్టీ నేతలు భావించే అవకాశాలు లేవు. అత్యంత కీలకమైన పరిస్థితుల్లో ఈ ఎన్నికల జరుగుతున్నాయి. నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయని చెప్పుకుంటున్న బిజెపి నేతలు తాము మాత్రం అత్యధిక స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. మరి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నప్పుడు ఆ ప్రభుత్వంలో భాగమైన బిజెపి అభ్యర్థులను మాత్రం ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? నితీశ్ కుమార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత కూడా ఎంతోకొంత ఈ ఎన్నికల్లో ప్రతిఫలించదా? వలస కార్మికులు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటివి బీహార్ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోరా? ఎన్నికల ప్రచారంలో మోదీ మాటిమాటికీ ఆర్టికల్ 370, అయోధ్య, కశ్మీర్, పుల్వామా వంటి భావోద్వేగ అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు? బీహార్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎదురైతే అందుకు నితీష్ కుమార్‌నే కారణంగా చూపేందుకు బిజెపి ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న 28 స్థానాల్లో 22 స్థానాలు బిజెపిలో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అనుయాయులు పోటీ చేస్తున్నవే. 28 స్థానాల్లో 10 సీట్లు గెలిచినా శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌కు ఢోకా ఉండదు కాని తన అనుయాయులు అందర్నీ గెలిపించుకోకపోతే జ్యోతిరాదిత్య సింధియా భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. గుజరాత్‌లో బిజెపి రాజ్యసభ సభ్యులను గెలిపించేందుకు వీలుగా రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోవడం ఆ పార్టీకి తప్పనిసరైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల స్వయంగా గుజరాత్ లో రెండు రోజులు మకాం వేసి అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం, హోంమంత్రి అమిత్ షా కూడా అంతకు ముందు పర్యటించడంతో ఈ ఉప ఎన్నికలను వారు తేలికగా తీసుకులేదన్న విషయం స్పష్టమవుతోంది. అయినా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు కేంద్రంలో మోదీ అస్తిత్వాన్ని దెబ్బతీయలేవు, కాని భావి పరిణామాలకు సూచిక అవుతాయి. అసమ్మతిని తొక్కిపెడితే వ్యక్తులకు ప్రయోజనం చేకూరవచ్చు కాని అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతుంది. అదే ఢిల్లీలో అధికారం కేంద్రీకృతం అయితే జరిగే నష్టం రాష్ట్రాలకేనని ఆ రాష్ట్రాల నేతలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలనేతలకు తెలియనిది కాదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)