వరదతో మరమ్మతులకు ఆటంకం

ABN , First Publish Date - 2021-11-30T05:06:17+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలు, వరద ప్రవాహం కొనసాగుతున్నందున మరమ్మతులకు ఆటంకం కలుగుతోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ముఖ్యమంత్రి జగన్‌మోహ్మన్‌రెడ్డికి తెలిపారు.

వరదతో మరమ్మతులకు ఆటంకం
వరద సహాయక చర్యల గురించి సీఎంకు వివరిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎంతో కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 29 : జిల్లాలో భారీ వర్షాలు, వరద ప్రవాహం కొనసాగుతున్నందున మరమ్మతులకు ఆటంకం కలుగుతోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ముఖ్యమంత్రి జగన్‌మోహ్మన్‌రెడ్డికి తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో తిక్కన భవన్‌ నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లన గురించి వివరించారు. జిల్లాలో  27 పంచాయతీ రాజ్‌ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిలో 15రోడ్లను పునరుద్ధరించామని చెప్పారు. మిగతా రోడ్ల పనులను వచ్చే వారంలో చేపడతామని చెప్పారు. 24 ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిలో 22 రోడ్లను పునరుద్ధరించామని చెప్పారు.  వరద ప్రవాహం కొనసాగుతున్నందున మరమ్మతులకు ఆటంకం కలుగుతోందన్నారు. వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 48,960 కుటుంబాలకు రూ. 2వేల చొప్పున  పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారని, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున పరిహారం అందజేశామని తెలిపారు. 

సహాయ పునరావస చర్యలు వేగవంతం చేయాలి

 వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌హాల్లో  అధికారులతో సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలపై నివేదికలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రమాణాలకు అనుగుణంగా మండలాల వారీగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. .  నష్టపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వ పరిహారం కచ్చితంగా అందేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో అందిస్తున్న విత్తనాల పంపిణీపై రోజువారీ నివేదిక అందజేయాలని వ్యవసాయశాఖ జేడీని ఆదేశించారు. 

Updated Date - 2021-11-30T05:06:17+05:30 IST