నేడు ‘ఇంటికే రేషన్‌’ వాహనాల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-21T06:26:57+05:30 IST

చిత్తూరులోని మెసానిక్‌ మైదానంలో 724 మినీ ట్రక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

నేడు ‘ఇంటికే రేషన్‌’ వాహనాల పంపిణీ
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ మార్కొండేయులు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 20: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు చిత్తూరులోని మెసానిక్‌ మైదానంలో 724 మినీ ట్రక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మెసానికల్‌ మైదానంలో సభ ఏర్పాట్లను జేసీ మార్కొండేయులు, సివిల్‌ సప్లయీస్‌ డీఎం సోమయాజులు, డీఎస్వో శివరామప్రసాద్‌, డీఆర్వో మురళి, ఆర్డీవో రేణుక, టీపీవో నాగేంద్రకుమార్‌, తదితరులు పర్యవేక్షించారు. కాగా.. ఉదయం ఏడు గంటలకు కణ్ణన్‌ జూనియర్‌ కళాశాల నుంచి 724 వాహనాలను ర్యాలీగా మెసానికల్‌ మైదానానికి తీసుకొస్తారు. 


పర్యవేక్షణ కమిటీ

మినీ ట్రక్కుల పంపిణీ పర్యవేక్షణ కోసం జేసీ మార్కొండేయులును చైర్మన్‌గా నియమిస్తూ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. సభ్యులుగా డీటీసీ బసిరెడ్డి, డీఎస్వో శివరామప్రసాద్‌, ఆర్డీవో రేణుక, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్‌, ఎల్డీఎం గణపతి ఉన్నారు. కన్వీనర్‌గా పౌరసరఫరాల సంస్థ డీఎం సోమయాజులు వ్యవహరిస్తారు.

Updated Date - 2021-01-21T06:26:57+05:30 IST