ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-08-13T09:35:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఈమేరకు రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

విజయనగరం-ఆంధ్రజ్యోతి


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఈమేరకు రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమం వాయిదా పడడం ఇది నాలుగోసారి. ఆగస్టు 15న పట్టాల పంపిణీ ఉంటుందని అంతా భావించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఇది వాయిదా పడింది. తొలుత ఈ ఏడాది ఉగాది రోజున పట్టాలు పంపిణీ చేస్తామని మొదట ప్రకటించారు. తరువాత జూలై 8కి వాయిదా వేశారు. ఇది కూడా వాయిదా పడింది. దీంతో ఆగస్టు 15న పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


ఈ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా పంపిణీ కుదరదని గుర్తించిన ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. అక్టోబరు-2న పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందిస్తుందని చెప్పడంతో ఎంతోమంది పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఒకేసారి 68వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దీని కోసం రెవెన్యూ అధికారులు 1,100 లే అవుట్లను సిద్ధం చేశారు. తాజాగా మరోసారి వాయిదా పడడంతో పేదలంతా నిరాశకు గురవుతున్నారు.

Updated Date - 2020-08-13T09:35:34+05:30 IST