ఊరికి దూరంగా, లబ్ధిదారులకు భారంగా...

ABN , First Publish Date - 2020-07-01T09:33:43+05:30 IST

జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. ఇందుకోసం చాలాచోట్ల ఊరికి దూరంగా...అదీ నివాసయోగ్యం

ఊరికి దూరంగా, లబ్ధిదారులకు భారంగా...

ప్రహసనంగా పేదలకు ఇళ్ల  స్థలాల పంపిణీ వ్యవహారం

చెరువు గర్భాలు, కొండవాలు ప్రాంతాల్లో లేఅవుట్లు 

కొన్నింటికీ దారీతెన్నూ లేదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం ఓ ప్రహసనంగా   మారింది. ఇందుకోసం చాలాచోట్ల ఊరికి దూరంగా...అదీ నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.


నర్సీపట్నం మునిసిపాలిటీలో పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన స్థలాలు ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొత్తం 2,336 మంది లబ్ధిదారుల కోసం కల్లెంపూడి, కృష్ణాపురం, బలిఘట్టం, ఏపీ టిడ్కో జీ ప్లస్‌ త్రీ అపార్ట్‌మెంట్ల సమీపంలో 49.31 ఎకరాలు (డి.పట్టా భూమి 19.6 ఎకరాలు, జిరాయితీ 9.7 ఎకరాలు, ప్రభుత్వ భూమి 6.3 ఎకరాలు) గుర్తించారు. అందులో 5.32 ఎకరాలు కోర్టు వివాదంలో వుండడంతో వాటిని విడిచిపెట్టి మిగిలిన 43.99 ఎకరాల్లో లేఅవుట్లు వేశారు. కాగా తాజాగా దీనిలో 8.38 ఎకరాలపై హైకోర్టు స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చింది. బ్రహ్మానంద ఆశ్రమానికి చెందిన భూములను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందంటూ సాగిన వెంకటరమణ అనే వ్యక్తి ఆశ్రమ చైర్మన్‌ పేరుతో పిటిషన్‌ వేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్న స్థలాలు ఊరికి దూరంగా వుండడంతో ఎంత వరకు ఉపయోగపడతాయన్నది చూడాలి. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో టీడీపీ హయాంలో లబ్ధిదారులకు ఇచ్చిన అయ్యన్నకాలనీలోని గృహాలే ఇప్పటికీ చాలావరకు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఊరికి దూరంగా కొండ గుట్టపై..

నాతవరం మండలం జిల్లేడిపూడిలో 70 పేదలకు ఇళ్ల స్థలాల కోసం కిలోమీటన్నర దూరంలో వున్న పూరిడి కొండవాలు భూమిని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం నివాస యోగ్యం కాదని, చుట్టూ కోళ్లఫారాలు వున్నాయని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు.


3 కి.మీ. దూరంలో... శ్మశానం పక్కన 

బుచ్చెయ్యపేట మండలం ఐతం పూడి గ్రామానికి చెందిన లబ్ధిదారు లకు ఇళ్ల స్థలాల కోసం ఊరుకు మూడు కిలోమీటర్ల దూరంలో శ్మశా నానికి సమీపంలో లేఅవుట్‌ వేశారు. దీనిపై లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. ఇదే మండలం దిబ్బిడిలో సేకరిం చిన బంజరు భూమి కిలోమీటరు దూరంలో పొలాల మధ్య ఉంది.


సబ్బవరం లబ్ధిదారులకు ఐదు కిలోమీటర్ల దూరంలో...

సబ్బవరం, జూన్‌ 30: సబ్బవరం మేజరు పంచాయతీలో గల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గల పైడివాడ అగ్రహారంలో ఇచ్చేందుకు భూమి సేకరించారు. అదేవిధంగా గుల్లేపల్లి, తవ్వవానిపాలెం లబ్ధిదారులకు పెదగొల్లలపాలెం రెవెన్యూ పరిధిలో గల జగన్నాథపురం వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇవి వారి వారి గ్రామాల నుంచి 10, 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. టెక్కలిపాలెం లబ్ధిదారులకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆరిపాకలో ఇస్తున్నారు. అమృతపురం గ్రామ లబ్ధిదారులకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల పెదగొల్లలపాలెం రెవెన్యూ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.  


పరవాడ పరిధిలో..

పరవాడ మండలం గొర్లివానిపాలెం లబ్ధిదారులకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న పి.బోనంగి వద్ద లేఅవుట్‌ వేశారు. అలాగే తానాం పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో గల పరవాడ రెవెన్యూ పరిధిలో వున్న ప్రభుత్వ స్థలంలో లేఅవుట్‌ వేశారు.


దూరం.. బహుదూరం

పెందుర్తి: మండల రెవెన్యూ పరిధిలోని 14 పంచాయతీల్లో పేదల ఇళ్ల స్థలాల కోసం 16 లేఅవుట్‌లు వేశారు. గొరపల్లి గ్రామానికి చెందిన పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్రమ్మపాలెంలో లేఅవుట్‌ వేశారు. ఇక్కడ 18 ఎకరాలలో రెండు లేఅవుట్‌లు వేసి గుర్రమ్మపాలెం, అక్కిరెడ్డిపాలెం, రాజయ్యపేట, గొరపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు రెవెన్యూ సిబ్బంది తెలిపారు.


దూరంగా... కొండవాలులో స్థలాలు

పాయకరావుపేట పంచాయతీలో ఇళ్ల స్థలాల కోసం 1,502 మందిని అర్హులుగా గుర్తించారు. స్థానికంగా ప్రభుత్వ భూములు లేకపోవడంతో సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో వున్న పీఎల్‌ పురం పంచాయతీలో కొండవాలున వున్న 40 ఎకరాల ప్రభుత్వ, డి.పట్టా భూములను ఎంపిక చేశారు. అక్కడి నుంచి పాయకరావుపేటకు రాకపోకలు సాగించాలంటే మధ్యలో జాతీయ రహదారి, రైల్వే లైన్‌, పోలవరం ఎడమ కాలువను దాటాల్సి ఉంటుంది. కొండ ప్రాంతం కావడంతో వర్షాకాలంలో ఎగువ నుంచి కాలనీపైకి నీరు వచ్చే అవకాశం వుందని లబ్ధిదారులు అంటున్నారు.


Updated Date - 2020-07-01T09:33:43+05:30 IST