పుస్తకాలు..సిద్ధం

ABN , First Publish Date - 2020-05-23T09:06:50+05:30 IST

ఈ విద్యా సంవత్సరం పుస్తకాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యాశాఖ ప్రణాళికలు

పుస్తకాలు..సిద్ధం

ఆర్టీసీ కార్గో ద్వారా రవాణా

జిల్లాకు రూ.14.73 లక్షల కేటాయింపు

చార్జీల కింద ఎంఈవోలకు రూ.41వేలు విడుదల

ఈ ఏడాది పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌ పంపిణీ 


గుంటూరు(విద్య), మే 22: ఈ విద్యా సంవత్సరం పుస్తకాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ కార్గో ద్వారా పుస్తకాలు రవాణాకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాకు రూ.14.73 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండల స్థాయిలో రవాణా కోసం ఎంఈవోలకు రూ.41 వేలు అందజేయనున్నారు. ఈ నిధుల ద్వారా పాఠశాల స్థాయికి పుస్తకాలను సరఫరా చేయించుకుని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 57 మండలాల్లోని ప్రభుత్వ, జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, రెసిడెన్సియల్‌, మోడల్‌ స్కూల్స్‌లో విద్యార్థులకు ఏటా ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుంది.


ఈ ఏడాది పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌ కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 34, ఎంపీపీ, జడ్పీ పాఠశాలలు 2,843, రెసిడెన్సీయల్‌ స్కూల్స్‌ 3, మోడల్‌ స్కూల్స్‌ 14, కేజీబీవీలు 24, మున్సిపల్‌ స్కూల్స్‌ 296, ఎయిడెడ్‌ స్కూల్స్‌ మరో 200 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 6.20 లక్షల మందిపైగా విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. విద్యార్థులకు ఏటా 16 లక్షల పుస్తకాలు అవసరం అవుతాయి.

 

ప్రత్యేక కోడ్లతో సరఫరా

ప్రభుత్వం అందజేసే పుస్తకాలు దుర్వినియోగం కాకుండా ఈ ఏడాది నుంచి ప్రత్యేక కోడ్‌ను ప్రవేశ పెట్టారు. ఈ కోడ్‌ ద్వారా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పుస్తకాలు అందజేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కొన్ని పాఠశాలల్లో బుక్‌ బ్యాంక్‌ అమలు చేస్తున్నారు. కింది తరగతుల విద్యార్థుల నుంచి సేకరించిన పుస్తకాలను భద్రపరిచి తాత్కలికంగా విద్యార్థులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2020-05-23T09:06:50+05:30 IST