15 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-04-10T12:22:25+05:30 IST

15 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ

15 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ

  •  ప్రతి డిపోకు అదనంగా మూడు కౌంటర్లు 
  • రేపటి నుంచి టోకెన్లు జారీ   
  • జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌   

విశాఖపట్నం: ఈ నెల 15 నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. రేషన్‌ తీసుకునేటప్పుడు కార్డుదారులు భౌతికదూరం పాటించేందుకు ప్రతి రేషన్‌ దుకాణానికి అదనంగా మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం వుడా చిల్డ్రన్‌ ఎరీనాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 1650, నగరంలో 487 దుకాణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉండే రేషన్‌ దుకాణానికి సమీపంలో కల్యాణ మండపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అదనపు  డిపోలు ఏర్పాటు చేస్తామన్నారు.    జిల్లాలో 12.45 లక్షల కార్డులు ఉన్నాయని, ఇతర ప్రాంతాల రేషన్‌ షాపులకు సంబంధించి 3.20 లక్షల మంది రేషన్‌ తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి వారంతా మలి విడతలో ఇబ్బందిపడకుండా తేదీల వారీగా కూపన్లకు రంగులు మారుస్తారన్నారు. రేషన్‌డిపోల వద్ద జనం బారులు తీరకుండా ముందు జాగ్రత్తగా ఈనెల 11 నుంచి టోకెన్లు జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.     జిల్లాలో ఏడు కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు ఉన్నాయని, వాటిలో నివసిస్తున్న కార్డుదారులకు ఇంటింటికీ  రేషన్‌ పంపిణీ చేయాలని ఆదేశించారు.  పాడేరు సబ్‌కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ తమీమ అన్సారియా, నర్సీపట్నం ఆర్డీవో కె.లక్ష్మి శివజ్యోతి, అదనపు ఎస్పీ అచ్యుతరావు, పౌరసరఫరాల అధికారులు శివప్రసాద్‌, నిర్మలాకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T12:22:25+05:30 IST