శ్రీనివాసుడి చిరునామా ఏమి..?

ABN , First Publish Date - 2022-01-28T06:23:35+05:30 IST

జిల్లాల పునర్విభజన ప్రకటనతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

శ్రీనివాసుడి చిరునామా ఏమి..?

ద్వారకాతిరుమల రాజమహేంద్రవరంలో విలీనంపై స్థానికుల నిరసన

 దూరాభారంపై ఆందోళన


ద్వారకాతిరుమల, జనవరి 27: జిల్లాల పునర్విభజన ప్రకటనతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చిన వెంకన్న భక్తులు స్వామి వారి చిరునామా మారుతుందని చర్చించుకంటున్నారు. పాలనా సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా అంటూ ప్రభుత్వం చెబుతున్నా స్థానికుల మనోభి ప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్ద తిరు పతిని శ్రీ బాలాజీ జిల్లాగా ప్రకటించినప్పడు చిన్న తిరుపతిని శ్రీ వేంకటే శ్వర జిల్లాగా ఎందుకు ప్రకటించరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ద్వారకా తిరుమల రాజమహేంద్రవరం జిల్లాలో విలీనమైతే స్థానికులకు దూరాభా రమని, సమీపంలోని ఏలూరులో జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నారు.  

మెట్టప్రాంతమైన ద్వారకా తిరుమల మండలం 2011 జనాభా లెక్కల ప్రకారం 68,989 మంది  జనాభా, 250 కి.మీ మేర విస్తరించి ఉంది. 2009  వరకు ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాన్ని నియోజక వర్గాల పునర్విభజనలో గోపాలపురం నియోజకవర్గంలో చేర్చారు. దీనితో అది రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లింది. లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా ప్రాతిపదికన పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడంతో ద్వారకాతిరుమల రాజమహేంద్రవరం పరిధిలోకి వెళుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాలు ఏలూరుకు సమీపంలోనే ఉన్నాయి. ప్రస్తుత మార్పులతో కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌, రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోకి మారనుండడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం మారితే మండలవాసులకు ప్రభుత్వ ఆసుపత్రులు, రెవెన్యూ సేవలు, చదువులు, కోర్టులు దూరాభారమే. ఏలూరుకు కేవలం 39 కి.మీ దూరం ఉన్న మండల కేంద్రం ద్వారకాతిరుమలకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం ఎలా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో ఏలూరుకు గంటలోపే ప్రయాణం రాజమహేంద్రవరం దాదాపు 3 గంటల సమయం పడుతుంది.  ఏలూరు రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాలను  ఏలూరు జిల్లాలోనే ఉంచుతారని గతంలో ప్రచారం సాగింది. ప్రస్తుతం  రాజమహేంద్రవరం జిల్లాలోనే ప్రకటించడంతో శ్రీనివాసుడి చిరునామా ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా మార్పుపై స్థానికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. భౌగోళిక, సామాజిక, విద్య, వ్యాపార, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ద్వారకాతిరుమల మండలాన్ని ఏలూరు జిల్లాలో కొనసాగించాలని కోరుతున్నారు.


జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని కుక్కునూరు


జంగారెడ్డిగూడెం/కుక్కునూరు: రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అనువుగా తెలంగాణ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రలో విలీనమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని పోల వరం నిర్వాసితుల కోసం భూసేకరణ, పునరావాస ప్రక్రియ కోసం కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలతో కుక్కునూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైం ది. ప్రస్తుత జిల్లాల విభజనలో కుక్కునూరు డివిజన్‌ మాయం కానుంది. ఈ రెండు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో విలీనమవుతాయి.  జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలు ఉండేవి. తాజా ప్రకటనతో కుక్కునూరు వేలేరుపాడు మండలాలు కూడా చేరనున్నా యి. ఆ రెండు మండలాలు ఎప్పటికీ విలీన మండలాలేనా అని స్థానికలుఉ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న కామవరపుకోట, టి.నరసాపురం మండలాలు కూడా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లో కలిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఉన్న గోపాలపురం మండలం కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వెళ్లనుంది.


చింతలపూడిని రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలి


చింతలపూడి: చింతలపూడిని రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని స్థానికు లు కోరుతున్నారు. చింతలపూడి నియోజకవర్గం వైశాల్యం, జనాభాలో పెద్దది. ఇక్కడ ఎక్కువగా భూసంబంధిత కేసులు నమోదవుతుంటాయి. విద్య, వైద్యం, కోర్టులకు దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు మారుస్తున్నందున చింతలపూడిని రెవెన్యూ డివిజన్‌గా చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు పలువురు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌కు విజ్ఞాపనలు పంపడానికి సంతకాలు సేకరిస్తున్నారు.

Updated Date - 2022-01-28T06:23:35+05:30 IST