క్యారీబ్యాగ్‌కు డబ్బు వసూలు చేసిన దుకాణానికి భారీ జరిమానా

ABN , First Publish Date - 2020-08-02T18:06:22+05:30 IST

దుకాణాలు తమ దగ్గర వస్తువులను కొనేవారి నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బు

క్యారీబ్యాగ్‌కు డబ్బు వసూలు చేసిన దుకాణానికి భారీ జరిమానా

చండీగఢ్ : దుకాణాలు తమ దగ్గర వస్తువులను కొనేవారి నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బు వసూలు చేయరాదని చండీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. క్యారీ బ్యాగులు వంటివాటికి డబ్బు వసూలు చేయడం అనుచిత వ్యాపార పద్ధతుల క్రిందకు వస్తుందని తెలిపింది. బిగ్ బజార్ దుకాణంపై ఇద్దరు వినియోగదారులు వేర్వేరుగా చేసిన 3 ఫిర్యాదులను విచారించి, ఆ దుకాణానికి జరిమానా విధించింది. 


నేహా శర్మ  చండీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2019 ఆగస్టు 3న తాను ఎలంటే మాల్‌లో ఉన్న బిగ్ బజార్‌లో రూ.9,881 విలువైన వస్తువులను కొన్నట్లు తెలిపారు. రెండు కాగితపు సంచులకు రూ.48 వసూలు చేసినట్లు బిల్లులో చూసి అవాక్కయ్యానన్నారు. వెంటనే అక్కడి క్యాషియర్‌ను ప్రశ్నించానని, ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని అడిగానని చెప్పారు. కానీ ఆ క్యాషియర్ అందుకు తిరస్కరించినట్లు తెలిపారు. 


ప్రీతి కాలియా చేసిన ఫిర్యాదులో తన వద్ద రెండు క్యారీ బ్యాగుల కోసం రూ.12 చొప్పున బిగ్ బజార్ వసూలు చేసిందని తెలిపారు. 


వీరిద్దరూ వేర్వేరుగా మూడు ఫిర్యాదులు చేశారు. వీటిపై కమిషన్ విచారణ జరిపింది. 


బిగ్ బజార్ రాతపూర్వకంగా తెలిపిన వాదనలో, క్యారీ బ్యాగులకు ఛార్జ్ చేస్తామని తాము స్పష్టంగా ప్రచారం చేశామని తెలిపింది. 


వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్తూ, బిగ్ బజార్ నమ్మకమైన, ఆధారపడదగిన, తర్కబద్ధమైన వాదనను వినిపించలేకపోయిందని తెలిపింది. వినియోగదారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బులు వసూలు చేయడానికి అధికారం కల్పించే నిబంధనలను కానీ, ఆదేశాలను కానీ చూపించలేకపోయిందని పేర్కొంది. క్యారీ బ్యాగుల వంటివాటికి ఛార్జీలను వినియోగదారులపై ప్రత్యేకంగా రుద్దకూడదని, అలా చేయడం అనుచిత వ్యాపార పద్ధతి అవుతుందని పేర్కొంది. 


ఈ మూడు ఫిర్యాదులకు రూ.5,000 చొప్పున వినియోగదారుల న్యాయ సహాయం ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుదారులకు ఒక్కొక్క ఫిర్యాదుకు రూ.1,100 చొప్పున వ్యాజ్య ఖర్చులు చెల్లించాలని, మానసిక వ్యథకు నష్టపరిహారంగా రూ.100 చొప్పున చెల్లించాలని తీర్పు చెప్పింది.


Updated Date - 2020-08-02T18:06:22+05:30 IST