ఢిల్లీకి జిల్లాల పంచాయితీ

ABN , First Publish Date - 2022-02-04T08:34:21+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు ఢిల్లీకి చేరాయి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ రాజంపేట, రైల్వేకోడూరు వాసులు గురువారం ఢిల్లీలోని..

ఢిల్లీకి జిల్లాల పంచాయితీ

  • వైసీపీకి సెలవు అంటూ జంతర్‌మంతర్‌ వద్ద ఫ్లెక్సీ ..
  • ఢిల్లీ పెద్దల జోక్యానికి రాజంపేట వాసుల వినతి
  •  రాజంపేట, కోడూరుల్లోనూ కొనసాగిన ఆందోళనలు
  • నరసాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన
  • మదనపల్లెలోనూ కొనసాగిన ఉద్యమం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

 రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు ఢిల్లీకి చేరాయి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ రాజంపేట, రైల్వేకోడూరు వాసులు గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలిపారు. ‘జిల్లాల విభజన వంచనకు నిరసనగా వైఎ్‌సఆర్‌సీపీకి సెలవు - ఇట్లు రాజంపేట, కోడూరు ప్రజలు’ అంటూ జంతర్‌మంతర్‌ వద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజంపేటవాసి ముమ్మడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చారిత్రక ప్రదేశంగా, పార్లమెంట్‌, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా, అన్ని వనరులున్న రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పెద్దలైనా స్పందించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఒప్పించాలని కోరారు. ఇకరాజంపేట, రైల్వేకోడూరుల్లో దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. రాజంపేట పట్టణంలో బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సాధన సమితి నాయకులు కాకర్ల రాముడు, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఎద్దల విజయసాగర్‌, మాజీ కౌన్సిలర్‌ గుగ్గిళ్ల చంద్రమౌళి, మహిళా నేత మిరియాల సురేఖ, న్యాయవాది పసుపులేటి శంకర్‌ తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి ఉద్యమం నుంచి దూరం కావడం దారుణమన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు, రాజంపేట ఇన్‌చార్జి పోతుగుంట రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.


చిట్వేలిలో జేఏసీ నేతలు   రిలే దీక్షలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైల్వేకోడూరులో రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మదనపల్లెలోని సీటీ ఎం రోడ్డు అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద మదనపల్లె జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆటో డ్రైవర్లు పాల్గొని మద్ద తు తెలిపారు. మదనపల్లె జిల్లా ఉద్యమానికి వైసీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని జేఏసీ నాయకులు చెప్పారు.  


నరసాపురంలోటీడీపీ నిరసన ఉద్రిక్తం

నరసాపురంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. మొగల్తూరు రోడ్డులో పోలీసులు దిష్టిబొమ్మను లాక్కున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.  టీడీపీ నేతలు ప్రదర్శనగా ఎమ్మెల్యే ముదునూరి నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే లేరని తెలుసుకుని తిరిగి మాధవాయిపాలెం రేవు మీదుగా అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని, అక్కడ రిలే దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులకు మద్దతు ప్రకటించారు.  అక్కడ  మరో దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా,  పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. దిష్టిబొమ్మకు  బండారు నిప్పు అంటించి, పెనుగులాట నుంచి బయటకు రావడంతో టీడీపీ నాయకులు కేరింతలు కొట్టారు.  

Updated Date - 2022-02-04T08:34:21+05:30 IST