మళ్లీ పాతశాఖకే బదిలీలు

ABN , First Publish Date - 2021-07-23T08:29:22+05:30 IST

మళ్లీ పాతశాఖకే బదిలీలు

మళ్లీ పాతశాఖకే బదిలీలు

జిల్లా ఇసుక అధికారులకు రిపాట్రియేషన్‌

ఇసుక ప్రైవేటుకు ఇవ్వడంతో సర్కారు నిర్ణయం


అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇసుక అధికారి (డీఎ్‌సఓ) రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ)లో చాలా కీలకమైన స్థానం. ఇసుక అమ్మకాలు, తరలింపు వంటి వ్యవహారాల్లో పర్యవేక్షణ ఉండటంతో ఆ పోస్టుకు అంతటి ప్రాధాన్యం వచ్చింది. ఇప్పుడు ఆ పోస్టు జీరో అయింది. ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటుకు ఇవ్వడంతో ఎండీసీకి, అందులో పనిచేస్తున్న అధికారులకు పనిలేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం జిల్లా ఇసుక అధికారులను వారి సొంత విభాగాలకు రిపాట్రియేట్‌ (తిరిగి వెనక్కు పంపడం) చేస్తూ గురువారం ఉత్తర్వులు (జీఓ 106) జారీ చేసింది. వారిలో గనుల శాఖ జియాలజిస్టులు, ఇతర అధికారులున్నారు. ఇసుక అమ్మకాలు ప్రభుత్వ పరిధిలో కొనసాగినప్పుడు నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏపీఎండీసీ పరిధిలో జిల్లాకో ఇసుక అధికారిని నియమించారు. ఇందుకు గనుల శాఖతో పాటు ఆయా శాఖల నుంచి అధికారుల సేవలను వినియోగించుకున్నారు. ఇసుక అమ్మకాలను ప్రైవే టు సంస్థకు అప్పగించడంతో అధికారులను సొంత శాఖలకు పంపాలని ఎండీసీ ఎండీ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. గనుల శాఖకు వెనక్కి వచ్చినవారికి ఆ శాఖ పరిధిలో పోస్టింగ్‌ ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్‌ జి.పాపారావును పశ్చిమగోదావరి డీడీగా, పి.వెంకటేశ్వరరెడ్డిని అనంతపురం డీడీగా, బి.రవికుమార్‌ను విశాఖపట్టణం డీడీగా నియమించారు. ఎండీసీలో శాండ్‌ విభాగం ఓఎ్‌సడీగా ఉన్న ఎన్‌.చంద్రశేఖర్‌ను ఎండీసీలో డీడీగా నియమించారు. 


నలుగురు ఏడీలకు పదోన్నతి

గనుల శాఖలో నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)లకు డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ)లుగా పదోన్నతి కల్పిస్తూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. బి.జగన్నాథరావును నెల్లూరుకు, ఎన్‌.వెంకటకృష్ణను విజయనగరానికి, కె.వి.సత్యనారాయణను చిత్తూరు జిల్లాకు డీడీలుగా బదిలీచేశారు. డి.శ్రీవెంకటసాయిని ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఓఎ్‌సడీగా నియమించారు. పదోన్నతులతో పాటు బదిలీ అయినవారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సర్కారు ఆదేశించింది. కోర్టు కేసుల్లో వెలువడే తీర్పులను బట్టి పదోన్నతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

Updated Date - 2021-07-23T08:29:22+05:30 IST