కాంగ్రెస్‌లో కలవరం.. జోరుగా గ్రూపు రాజకీయం

ABN , First Publish Date - 2021-10-19T07:03:38+05:30 IST

ఏడేళ్లుగా అధికారానికి దూరమై ఆపదలో పడిన హస్తం పార్టీని వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు రావడంతో పరిస్థితి చక్కబడుతుందని అందరు భావించినా జిల్లాలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో కలవరం.. జోరుగా గ్రూపు రాజకీయం

మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు వర్గాలుగా విడిపోతున్న నేతలు

ఇంద్రవెల్లి సభతో మరింత ముదిరిన విభేదాలు

డైలామాలో పడుతున్న జిల్లాలోని పార్టీ కార్యకర్తలు


ఆదిలాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్లుగా అధికారానికి దూరమై ఆపదలో పడిన హస్తం పార్టీని వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు రావడంతో పరిస్థితి చక్కబడుతుందని అందరు భావించినా జిల్లాలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోని కాంగ్రెస్‌ పార్టీ అక్కడక్కడ సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్‌ స్థానాలను దక్కించుకుంది. అయినా నేతల తీరులో మార్పు కనిపించడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కొందరు నేతలు దారులు వెతుక్కునే పనిలో పడ్డారు. అగ్రనేతల అండదండలు మెప్పు పొందేందుకు వారి జన్మదినాలు, పర్యటనలో చురుగ్గా పాల్గొంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాల్లో రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్న నేతల తీరుతో సామాన్య కార్యకర్తలు విసిగిపోయి డైలామాలో పడుతున్నారు. ఎవరికి జై.. అంటే ఏం జరుగుతుందోనన్న అభద్రత భావం వెంటాడడంతో సైలెంటైపోతున్నారు.


అంతటా అదే పరిస్థితి..

జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాల్లో అంతటా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ తనదైన శైలిలో ముందుకు సాగుతుండగా గండ్రత్‌ సుజాత కొంత సైలెంట్‌గానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే అవకాశం వస్తే వదిలి పెట్టేది లేదన్న తీరుతో తలమడుగు జడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్‌రెడ్డి కనిపిస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో ఇటీవల పార్టీలో చేరిన డా.వన్నెల అశోక్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండగా ఆడె గజెందర్‌ మాత్రం అగ్రనేతలనే నమ్ముకుని పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఖానాపూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ పార్టీని వీడడంతో ఉట్నూర్‌ జడ్పీటీసీ సభ్యురాలు చారులత, భరత్‌చౌహాన్‌లు ఎవరికి వారే పార్టీలో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కొరవడినట్లే కనిపిస్తోంది.


నేతల మధ్య ఆధిపత్యపోరు..

గతంలో ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి జిల్లాపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగానే మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు దూకుడు పెంచడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంద్రవెల్లి సభ సక్సెస్‌ కావడంతో ప్రేంసాగర్‌రావుకు మరింత కలిసి వచ్చింది. ప్రస్తుతం జిల్లాకు చెందిన ద్వితీయ స్థాయి నేతలంతా మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అధిష్ఠానం వద్ద ఎవరి పలుకుబడి ఎక్కువగా ఉంటే వారు చెప్పిన వారికే టికెట్లు వస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఇటీవల జిల్లాలో ప్రేంసాగర్‌రావు ఫ్లెక్సీలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే జిల్లా అంతటా పర్యటించేందుకు ఆయన వర్గం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరం కావడంతో  ప్రధానంగా ఈ రెండు వర్గాల మధ్యనే ఆధిపత్య పోరు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. 


ఇన్‌చార్చి చిచ్చు!

ఇంద్రవెల్లి సభ వరకు సైలెంట్‌గానే కనిపించినా కాంగ్రెస్‌ రాజకీయం ఆ తర్వాతనే పార్టీలో చిచ్చు రేపుతోంది. మహేశ్వర్‌రెడ్డిని కాదని ఇంద్రవెల్లి సభా నిర్వాహణ బాధ్యతలను ప్రేంసాగర్‌రావుకు ఇవ్వడంపై కొందరు నేతలు తప్పుబట్టడం కనిపించింది. సభ సక్సెస్‌ కావడంతో పెద్దగా విమర్శలు చేయలేక పోయినా లోలోన మాత్రం రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సభా వేదిక పైనే జిల్లా నేతలు తమ తమ అగ్రనేతలను పొగడ్తలతో ముంచెత్తడం కనిపించింది. ఇంద్రవెల్లి సభతో కాంగ్రెస్‌ పార్టీకి కొంత ఊపునిచ్చిన అదే స్థాయిలో విభేదాలు ముదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుపెన్నడూలేని విధంగా ఈ సారి ప్రేంసాగర్‌రావు జన్మదిన వేడుకలను జిల్లాలో ఆయన వర్గీయులు ఘనంగా జరుపుకోవడం గమనార్హం. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాలలో టికెట్‌ను ఆశిస్తున్న నేతలంతా చెరో వర్గంలో చేరిపోయి తమ అగ్రనేతలకు అండగా నిలుస్తున్నారు.

Updated Date - 2021-10-19T07:03:38+05:30 IST