కలవరం

ABN , First Publish Date - 2021-12-01T04:44:44+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల 3 నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవర పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా కొన్ని మండలాల్లో నష్టాన్ని ఎదుర్కొన్నారు. ధాన్యం మొలకలు వచ్చేయడంతో కలత చెందారు.

కలవరం
కోతకు వచ్చిన వరి చేలు

మరో అల్పపీడనంతో గుబులు

కోతకు వచ్చిన వరి చేలు

ఇంటికి చేరడం కష్టమేనా?

అన్నదాతల్లో దిగులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల 3 నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవర పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా కొన్ని మండలాల్లో నష్టాన్ని ఎదుర్కొన్నారు. ధాన్యం మొలకలు వచ్చేయడంతో కలత చెందారు. ఈ విధంగా పెట్టుబడులు పెట్టి.. రేయింబవళ్లూ కష్టపడి.. చేతికందే స్థాయిలో పంటలు కోల్పోయే పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది  పంట ఆశాజనకంగా ఉండడంతో ఆనందంతో గడిపారు. మొన్న వర్షాలకు కొంత నష్టాన్ని ఎదుర్కొన్నారు. దాని నుంచి కాస్త బయట పడుతుండగానే... మళ్లీ తుఫాన హెచ్చరికలు వచ్చాయి. వరి చేలు చాలా వరకు కోత దశలో ఉన్నాయి. తుపాను హెచ్చరికలతో రైతులు వరి చేలు కోయకుండా వేచి చూడాలని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈనెల 3, 4 తేదీల వరకు రైతులు ఆచితూచి కోతలు చేపట్టాలంటోంది. పంట కోసినట్లయితే భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే పరిస్థితి రావచ్చు. మరో వైపు నీటిలో లేదా బురదలో పడిన  వెన్నులు నాణ్యతను కోల్పోయే ప్రమాదమూ ఉంది. రంగు మారిన ధాన్యాన్ని రైతులు విక్రయించలేని పరిస్థితి వస్తుంది. ఇలా రైతులు నష్టానికి గురయ్యేకంటే కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కోతలకు తొందర పడవద్దని చెబుతున్నారు. కొన్ని మండలాల్లో చాలా మంది రైతులు వరి కోతలు పూర్తి చేశారు. వాటిని కుప్పలుగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వాన పడితే కష్టమే. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 3.12 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇప్పటి వరకు 15 శాతం చేలల్లో కోతలు పూర్తిచేశారు. 

మత్స్యకారులు ఇళ్లకు చేరుకోవాలి

తుఫాన కారణంగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఇళ్లకు చేరుకోవాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి థాయిలాండ్‌కు సమీపంలో అల్పపీడనంగా మారిందని, ఇది ఈనెల 3నాటికి తుఫానగా రూపాంతరం చెందనుందని వాతారణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఆ ప్రభావంతో ఈనెల 3వ తేదీ సాయంత్రం నుంచి తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు. కొన్ని ఓట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వరి చేలను కోయకుండా వేచి చూడాలని కోరారు. ఇప్పటికే కోతలు పూర్తయితే జాగ్రత్త పర్చాలని సూచించారు. విజయనగరం కలెక్టరేట్‌, పార్వతీపురంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెళ్లడించారు. 



Updated Date - 2021-12-01T04:44:44+05:30 IST