మూగ రోదన !

ABN , First Publish Date - 2020-05-27T10:08:34+05:30 IST

భద్రిద్రి కొత్తగూడెం జిల్లాలో పశువైద్యశాలలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి

మూగ రోదన !

భద్రాద్రి జిల్లాలో అస్తవస్తంగా పశువైద్యం  

మూడేళ్లుగా భర్తీకాని వైద్యులు, సిబ్బంది పోస్టులు

సమస్యల నిలయాలుగా అనేక ఆసుపత్రులు

ఒకటి నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌


భద్రాచలం, మే 26: భద్రిద్రి కొత్తగూడెం జిల్లాలో పశువైద్యశాలలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అందుబాటులో లేని మందులు, శిథిలావస్థలో ఆసుపత్రుల భవనాలు ఇలా అనేక సమస్యలు పశువులకు వైద్యాన్ని దూరం చేస్తున్నాయి.  జిల్లాలో 2,83,630 పశువులు, 1,72,284 గేదెలు, 2,67,256 గొర్రెలు, 2,55,909 మేకలు ఉండగా ఆరు ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు, 30 ప్రైమరీ క్లినిక్‌లు, 44 సబ్‌ సెంటర్లు, ఐదు మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌లు  ఉన్నాయి. ఈ జిల్లాకు పశువైద్యశాఖలో 219 పోస్టులు మంజూరు అందులో 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకున్న వారే లేకపోవడం గమనార్హం. జూన్‌ ఒకటి నుంచి పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉండగా వైద్యులు, సిబ్బంది కొరతతో ఆ కార్యక్రమం ఎంతవరకు విజయవంతమవుతుందనేని ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లాకు నాలుగు విడతలుగా మందులు రావాల్సి ఉండగా పూర్తిస్థాయిలో మందులు రావడం లేదని తెలుస్తోంది. 


మూడేళ్లుగా భర్తీకానీ వైద్యులు, సిబ్బంది పోస్టులు

జిల్లాలోని పశువైద్యశాఖలో వైద్యులు, సిబ్బంది పోస్టులు మూడేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. అసిస్టెంటు డైరెక్టరు పోస్టులు రెండు, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు 11, లైవ్‌స్టాక్‌ ఆఫీసర్లు రెండు, జూనియర్‌ వెటర్నరీ అధికారులు నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ పోస్టులు పది, వెటర్నరీ అసిస్టెంట్‌లు ఆరు, వెటర్నరీ వ్యాక్సినేటర్లు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 వైద్యశాలల్లో 13 ఇన్‌చార్జ్‌ల పాలనలోనే నడుస్తున్నాయి. త్వరలో వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో పశువులు, గొర్రెలకు జబ్బులు రాకుండా వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వెటర్నరీ వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.


సమస్యల నిలయాలుగా పశువైద్యశాలలు

జిల్లాలో ఆరు ఏరియా వెటర్నరీ వైద్యశాలలు, 30 ప్రైమరీ క్లినిక్‌లు, 44 సబ్‌సెంటర్లు ఉండగా చాలా చోట్ల ఆయా కేంద్రాల్లో సమస్యలు పేరుకుపోయినట్లు సమాచారం. పాల్వంచ ఏరియా వెటర్నరీ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. నూతన భవనానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అన్నారం, పాతపాల్వంచ, సంగెం సబ్‌సెంటర్లకు మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉంది.  


ప్రభుత్వానికి నివేదించాం..డా. వేణుగోపాలరావు, పశు సంవర్ధక శాఖ జేడీ

భద్రాద్రి జిల్లాలో పశు వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. పలు వైద్యశాలలు, సబ్‌ సెంటర్లలో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా నివేదించాం. కొన్నింటికి పనులు చేపట్టాం.

Updated Date - 2020-05-27T10:08:34+05:30 IST