రేపటి నుంచి దైవ దర్శనం

ABN , First Publish Date - 2020-06-07T06:46:00+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత సుమారు 78 రోజుల అనంతరం సోమవారం నుంచి

రేపటి నుంచి దైవ దర్శనం

తెరుచుకోనున్న ఆలయాలు

తొలి రెండు రోజులు ట్రయల్‌రన్‌


సాలూరు రూరల్‌/ విజయనగరం రూరల్‌, జూన్‌ 6: లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత సుమారు 78 రోజుల అనంతరం సోమవారం నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఆరాధ్య దేవతలు, అమ్మవార్ల దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తులు ఇక   గుడులలో అడుగు పెట్టవచ్చు. తొలుత రెండు రోజులు అర్చకులు, అధికారులు, సిబ్బంది, కొద్దిమంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నెల 10 నుంచి పూర్తిస్థాయిలో దేవుళ్లను దర్శనం చేసుకోవచ్చు. ఆలయాలతో పాటు చర్చిలు, మసీదులు తెరుచుకుంటాయి. జిల్లాలో శంబర పోలమాంబ, విజయనగరం పైడితల్లి, తోటపల్లి వేంకటేశ్వరస్వామి, రామతీర్థం, రామనారాయణం తదితర  క్షేత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న దేవాలయాలు, రామమందిరాలు, చర్చిలు, మసీదులు వేల సంఖ్యలో ఉన్నాయి. దేవాలయాల్లో ఇప్పటివరకు పూజారులు మాత్రమే ధూపదీప నైవేద్యాలు సమర్పించి వచ్చేవారు. భక్తులను అనుమతించలేదు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి ఆలయాలను తెరవనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్‌ రన్‌గా దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తోటపల్లి, శంబర ఆలయాల ఈవో బి.లక్ష్మీనగేష్‌ శనివారం చెప్పారు. ఈ నెల 10 నుంచి భకక్తులందరినీ అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు.  కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులు నిబంధనలను పాటించాల్సి ఉంటుందని చెప్పారు.  


పైడితల్లి ఆలయంలో...

పైడితల్లి ఆలయానికి సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకసారి ఎంతమంది భక్తులను అనుమతించాలి.. భౌతిక దూరం పాటించేలా ఏఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై ఈ నెల 8, 9 తదీల్లో  ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం దేవస్థానం అధికారులు, అర్చకులతో చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. 10వ తేదీ నుంచి భక్తులకు పైడిమాంబ దర్శనం కల్పిస్తారు. మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడి, రైల్వే స్టేషన్‌ వద్దనున్న వనంగుడితో పాటు అమ్మవారి దత్తత ఆలయమైన శివాలయం వీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఈ నెల 10నే తెరుచుకోనుంది. 


ఇవీ నిబంధనలు

  • భౌతిక దూరం పాటిస్తూ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన వృత్తాకారంలో వేచి ఉండాలి.
  • ఆలయ ప్రాంగణంలో శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • భక్తులను ముఖమండపాల వరకు అనుమతిస్తారు. కొబ్బరికాయలు, పండ్లు అనుమతించరు.
  • తీర్థ ప్రసాదాలను తాత్కాలికంగా నిలుపుతారు.
  • జ్వరం, దగ్గు, జలుబు తదితర అనారోగ్య లక్షణాలున్న వారిని దర్శనానికి అనుమతించరు. 
  • దర్శనం అనంతరం భక్తులు గుంపులుగా చేరి కూర్చోరాదు.
  • విరాళాలు, కానుకలు హుండీలో మాత్రమే వేయాలి.
  • విగ్రహాలు, ధ్వజస్తంభం తాకరాదు.
  • ఆలయ పరిసరాల్లో దగ్గు, తుమ్ము వస్తే తప్పనిసరిగా ముఖానికి టిష్యూ పేపరు, రుమాలు అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఈ నిబంధనాలతో భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. 

Updated Date - 2020-06-07T06:46:00+05:30 IST