Apr 18 2021 @ 15:46PM

మాస్ మహారాజ మీద మజిలీ హీరోయిన్ నమ్మకాలు..!

మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా తర్వాత ఫుల్ జోష్‌లో వరసగా సినిమాలు కమిటవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అర్జున్, అనసూయ భరద్వాజ కీలక పాత్రల్లో నటిస్తుండగా మే 28న రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రవితేజ రీసెంట్‌గా కొత్త సినిమాని మొదలు పెట్టాడు. 

శరత్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్‌ రవితేజకి జంటగా నటించబోతోంది. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. రవితేజ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుందట. మజిలీ సినిమా సూపర్ హిట్‌గా నిలిచినప్పటికి ఈ బ్యూటీకి మళ్ళీ వెంటనే అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఠక్కున ప్రేక్షకులకి ఈమె పేరు వింటే గుర్తురాని పరిస్థితి. ఇలాంటి సమయంలో రవితేజ సినిమాలో అవకాశం అంటే గొప్పే. చూడాలి మరి సినిమా తర్వాతైనా దివ్యాంశ కౌశిక్ టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందా లేదా.