రూ.72,000 కోట్లు

ABN , First Publish Date - 2020-11-17T07:28:20+05:30 IST

ఈ ఏడాది దీపావళి సీజన్‌లో విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 10.8 శాతం వృద్ధి చెంది రూ.72,000 కోట్ల స్థాయికి చేరుకున్నాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తెలిపింది...

రూ.72,000 కోట్లు

  • ఈ దీపావళికి వినియోగదారుల కొనుగోళ్లు   
  • గతేడాదితో పోలిస్తే 10.8శాతం వృద్ధి: సీఏఐటీ 

ఈ ఏడాది దీపావళి సీజన్‌లో విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 10.8 శాతం వృద్ధి చెంది రూ.72,000 కోట్ల స్థాయికి చేరుకున్నాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తెలిపింది. గడిచిన 8 నెలల్లో వినియోగదారులు అత్యవసరాల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. తద్వారా పొదుపు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని ఈ దీపావళికి ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. మన వినియోగదారులు ఈసారి చైనా ఉత్పత్తులకు దూరంగా ఉన్నారని, దాంతో డ్రాగన్‌ కంపెనీల ఆదాయానికి రూ.40,000 కోట్ల మేర గండిపడి ఉంటుందని సీఏఐటీ అంచనా. 2021 డిసెంబరు నాటికి చైనా నుంచి దిగుమతులు రూ.లక్ష కోట్ల మేర తగ్గవచ్చని అంచనా వేసింది. దేశంలోని 20 ప్రధాన నగరాల నుంచి వివరాలు సేకరించినట్లు అసోసియేషన్‌ పేర్కొంది. మొత్తంగా విక్రయాలు భారీ గా పుంజుకున్నప్పటికీ చిన్న వ్యాపారులు, పటాసుల విక్రయదారులు మాత్రం రూ.10,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందని సీఏఐటీ అంటోంది. పలు రాష్ట్రాల్లో పటాసులపై నిషేధం విధించడం ఇందుకు కారణమని తెలిపింది. దేశంలోని 7 కోట్లకు పైగా వర్తకులు, 40,000 వర్తక అసోసియేషన్లకు సీఏఐటీ ప్రాతినిథ్యం వహిస్తోంది. 


పండగ చేసుకున్న కంపెనీలు 

ఈ దసరా, దీపావళి సీజన్‌లో ఆటోమొబైల్స్‌తో పాటు ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాలు, కిచెన్‌ అప్లయెన్సెస్‌ కంపెనీల విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. కరోనా కాలంలో రవాణా కోసం వ్యక్తిగత వాహనాల అవసరం పెరిగింది. ఇందుకు తోడు వాహన తయారీదారులు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండటం.. ఆటో రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లతో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు టాప్‌ గేర్‌లో దూసుకెళ్లాయి. మొబైల్‌, టీవీ వంటి ఎలకా్ట్రనిక్స్‌, వంటింటి ఉపకరణాల విక్రయాలు రెండంకెల్లో వృద్ధి చెందాయని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ 15 శాతం పైగా పెరగగా, ఉపకరణాల అమ్మకాలు 25-30 శాతం మేర వృద్ధిని నమోదు చేసుకున్నాయని వారన్నారు. 





మేడిన్‌ చైనాపై తగ్గిన ఆసక్తి 


  • చైనా ఉత్పత్తులు కొన్న వారి వివరణ 
  • 71శాతం - చైనా ఉత్పత్తులని తెలియదు
  • 66శాతం - ఖరీదుకు తగ్గ విలువైన సరుకు 



భారత వినియోగదారుల్లో మేడిన్‌ చైనా ఉత్పత్తులపై ఆసక్తి బాగా తగ్గిందని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఈ పండగ సీజన్‌లో తాము జరిపిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులు కొనుగోలు చేశారని తెలిపింది. గత ఏడాది పండగ సీజన్‌లో 48 శాతం మంది డ్రాగన్‌ ఉత్పత్తులు కొన్నట్లు లోకల్‌ సర్కిల్‌ పేర్కొం ది. ఈసారి 14,000కు పైగా వినియోగదారులను సర్వే చేసినట్లు తెలిపింది. ఈనెల 10-15 తేదీల్లో దేశంలోని 204 జిల్లాలో ఈ సర్వే నిర్వహించింది. 


దేశీ సరుకు ఖరీదెక్కువ

చైనా ఉత్పత్తులతో పోలిస్తే భారత్‌లో తయారైనవి నాణ్యమైనవైనప్పటికీ ఖరీదు చాలా ఎక్కువ. లోకల్‌ సర్కిల్‌ సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో చాలా మంది వ్యక్తపర్చిన అభిప్రాయమిది. ముఖ్యంగా పండ గ సీజన్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులు ఒకసారి వాడి పక్కన పడేసేవి. అందుకే వినియోగదారులు ఈ వస్తువుల కొనుగోలులో నాణ్యతకు పెద్దగా ప్రాధాన్యమివ్వరని లోక ల్‌ సర్కిల్‌ నివేదిక పేర్కొంది. కాబట్టి, భారత కంపెనీలు చైనా వస్తువులకు పోటీగా తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు విక్రయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకోసం మన ఎంఎ్‌సఎంఈలు ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాల్సి ఉంటుందని, ఇందుకు ప్రభుత్వం మద్దతూ అవసరమని రిపోర్టు పేర్కొంది. 

Updated Date - 2020-11-17T07:28:20+05:30 IST