Abn logo
Oct 23 2021 @ 17:09PM

దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా డీజే మోత.. అదే దారిలో వచ్చిన అమర వీరుడి అంతిమ యాత్ర.. డీజే ఆపరేటర్ చేసిన పనికి..

‘‘జనగనమన అధినాయక జయహే..భారత భాగ్య విధాతా’’.. అని వినపడితే చాలు ఒక్కసారిగా ఒంట్లోకి దేశభక్తి పొంగుకొస్తుంది. వెంటనే లేచి నిలబడి దేశభక్తిని చాటుకుంటాం. దేశంపై మనకున్న ప్రేమను ఆ విధంగా చూపిస్తాం. అయితే దేశాన్ని కాపడటం కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ.. నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. సొంతూరును వదిలి, భార్యపిల్లలకు దూరంగా.. దేశ సేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేసే.. సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే వారిని చూస్తే చాలు.. మనకు గౌరవ భావం కలుగుతుంది. ఇక విషయానికొస్తే.. బీహార్‌లో జరిగిన ఓ సంఘటన... దేశ భక్తికి, సైనికుల మీద ప్రజలకు ఉన్న గౌరవానికి సూచికగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

బీహార్ సరన్ జిల్లాలోని రివిల్‌గంజ్‌లో శుక్రవారం దుర్గా విగ్రహం నిమజ్జనం జరుగుతోంది. అంతా సంబరాల్లో ఉన్నారు. ఓ వైపు డీజే సాంగ్స్, మరోవైపు తీన్‌మార్ స్టెప్పులతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా ఉంది. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ భక్తిపారవశ్యంలో మునిగిపోయాయి. యువత మొత్తం ఆర్కెస్ట్రాకు అంకితమైపోయారు. ఇంతలో సమీపంలోని రైల్వే గేటు వేశారు. దీంతో ఊరేగింపు అక్కడే ఆగిపోయింది. కానీ భక్తుల సందడి మాత్రం కొనసాగుతోంది.


అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన.. బీఎస్‌ఎఫ్ జవాన్ రామ్‌జీ యాదవ్ (52) అంతిమ యాత్ర అటువైపుగా వచ్చింది. అంతే.. అప్పటివరకు మోత మోగిన స్పీకర్లు.. ఒక్కసారిగా మూగబోయాయి. ఆ ప్రాంతమంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయింది. అంతవరకూ చిందులేసిన యువతకు పరిస్థితి అర్థమైంది. తమ చిందులు పక్కన పెట్టి గౌరవప్రదంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు.

అంతా కొద్ది సేపు మౌనం పాటించగానే.. సౌండ్ ఆపరేటర్ వెంటనే దేశభక్తి పాటను ప్లే చేశాడు. ‘‘ ఏ మేరే వతన్ కే లోగోన్, జరా ఆంఖ్ మే భర్ లో పానీ’’.. అంటూ ఆ పాట సాగుతుంది. ఈ పాట వినగానే అందరిలో దేశభక్తి పొంగుకొచ్చింది. రామ్‌జీ యాదవ్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ.. నివాళులర్పించారు. అప్పటి వరకూ అమ్మవారి భక్తి పారవశ్యంలో ఉన్న వారిలో.. ఒక్కసారిగా దేశభక్తి భావం నిండిపోయింది. అంతిమయాత్ర వాహనం అక్కడి నుంచి వెళ్లే వరకు అంతా వెంటే ఉన్నారు. తర్వాత గౌవరప్రదంగా వీడ్కోలు పలికారు.

అస్సాం బల్లియా జిల్లాలోని నాగ్రా గ్రామానికి చెందిన రామ్‌జీ యాదవ్ (52).. త్రిపురలో బీఎస్‌ఎఫ్‌ 39 బెటాలియన్‌లో ఏఎస్‌ఐ జీడీగా పని చేసేవారు. ఈ నెల 20న తన సహచరులతో కలిసి సైనిక వాహనంలో గోవింద్‌పూర్ సైనిక స్థావరం వద్ద ఉండగా.. భారీ వర్షం కురిసింది. మార్గమధ్యంలో బురదమయంగా ఉండడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రామ్‌జీ యాదవ్, వాహన డ్రైవర్ అక్కడికక్కడే వీరమరణం పొందారు.


ఐదుగురు సహచరులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరులకు ప్రజలు ఇచ్చిన గౌరవం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో నెట్టింట కూడా దేశభక్తి వెల్లువిరుస్తోంది.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...