జొకోవిచ్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-24T06:46:05+05:30 IST

కరోనా ‘ఆటా’డుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు టెన్నిస్‌ ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌తో పాటు మరో ఆటగాడు ట్రివోకి పాజిటివ్‌గా...

జొకోవిచ్‌కు పాజిటివ్‌

భార్య జెలెనాకు కూడా...

సెర్బియా ఆటగాడు ట్రివోకి జంటకూ  వైరస్‌


కరోనా ‘ఆటా’డుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు టెన్నిస్‌ ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా వరల్డ్‌ నెంబర్‌వన్‌ జొకోవిచ్‌తో పాటు మరో ఆటగాడు ట్రివోకి పాజిటివ్‌గా తేలడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక.. పాక్‌ క్రికెటర్లలో మొత్తంగా పదిమందికి కరోనా సోకడం క్రీడారంగాన్ని మరింత కలవరపెడుతోంది. 


బెల్‌గ్రేడ్‌: టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పాజిటివ్‌గా తేలాడు. తనతో పాటు భార్య జెలెనాకు ఈ వైరస్‌ సోకినట్టు నొవాక్‌ మంగళవారం ప్రకటించాడు. సెర్బియా ఆటగాడు విక్టర్‌ ట్రివోకి, గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా కరోనా బారిన పడ్డా రు. దీంతో ఇప్పటిదాకా మొత్తం నలుగురు టాప్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలారు. అంతకుముందు ప్రపంచ 19వ ర్యాంకర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), 32వ ర్యాంకర్‌ బోర్నా కోరిచ్‌ (క్రొయేషియా)కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరంతా గతవారం జొకోవిచ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడ్రియా ఎగ్జిబిషన్‌లో టెన్నిస్‌ టోర్నీలో పాల్గొన్నవారే కావడం గమనార్హం.


‘నేను బెల్‌గ్రేడ్‌ చేరుకున్న వెంటనే భార్యా పిల్లలతో కలిసి కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నా. నాతో పాటు భార్య జెలెనాకు పాజిటివ్‌ అని వచ్చింది. అయితే నా పిల్లలకు మాత్రం రిపోర్టులో నెగటివ్‌ అని తేలింది. మేం 14 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండబోతున్నాం. ఐదురోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకుంటాం. నా టోర్నీలో పాల్గొనడం ద్వారా కరోనా సోకిన వారికి క్షమాపణలు చెబుతున్నా. అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని 33 ఏళ్ల జొకోవిచ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ‘పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా బయటపడింది. గర్భవతిగా ఉన్న నా భార్య అలెగ్జాండ్రా కు కూడా వైరస్‌ సోకింది’ అని మాజీ టాప్‌-20 ప్లేయరైన ట్రివోకి తెలిపాడు. ఆడ్రియా టూర్‌లో భాగంగా రెండువారాల క్రితం బల్గేరియాలో జరిగిన తొలి అంచె పోటీల్లో జొకోవిచ్‌తో ట్రివోకి సింగిల్స్‌ మ్యాచ్‌ ఆడాడు. జాదర్‌ (క్రొయేషియా)లో జరగాల్సిన రెండో అంచె పోటీల ఫైనల్‌ మ్యాచ్‌ ఇప్పటికే రద్దయింది. 


జొకో.. నీకిది తగునా..?

ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లలో ఒక్కొక్కరికి కరోనా బయటపడుతుండడంతో ఆ టోర్నీ నిర్వాహకుడైన జొకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా యూఎస్‌ ఓపెన్‌లో ఆడేందుకు సుముఖంగా లేనన్న జొకో.. ఇప్పుడు తన ఆధ్వర్యంలోనే నిర్వహించిన టోర్నీలో ఎలాంటి జాగ్రత్తలూ పాటించకుండా ఆటగాళ్లకు వైరస్‌ సోకేందుకు కారకుడయ్యాడని టెన్నిస్‌ విశ్లేషకులు మండిపడుతున్నారు. 



Updated Date - 2020-06-24T06:46:05+05:30 IST