జొకో.. ది కింగ్‌

ABN , First Publish Date - 2021-06-15T09:36:57+05:30 IST

ఫెడరర్‌... నడాల్‌.. జొకోవిచ్‌. ప్రపంచ టెన్నిస్‌ను ఏలుతున్న స్టార్‌ ఆటగాళ్లు. మంచినీళ్లు తాగినంత సులువుగా గ్రాండ్‌స్లామ్స్‌ను కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో చరిత్రలో ఎవరికీ సాధ్యం కానంత వేగంగా ఈ త్రయం...

జొకో..  ది కింగ్‌

  • టెన్నిస్‌ త్రయంలో దూకుడు


ఫెడరర్‌... నడాల్‌.. జొకోవిచ్‌. ప్రపంచ టెన్నిస్‌ను ఏలుతున్న స్టార్‌ ఆటగాళ్లు. మంచినీళ్లు తాగినంత సులువుగా గ్రాండ్‌స్లామ్స్‌ను కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో చరిత్రలో ఎవరికీ సాధ్యం కానంత వేగంగా ఈ త్రయం దూసుకెళ్తోంది. ప్రస్తుతానికి ఫెడెక్స్‌, రఫా 20 స్లామ్స్‌తో టాప్‌లో ఉన్నా.. అసమాన ఆటతీరుతో జొకో కేవలం వారికి అడుగు దూరంలోనే ఉన్నాడు. అందుకే వీరిలో అసలు ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి వస్తోంది..


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

బిగ్‌ త్రీగా పిలుచుకునే ఫెడరర్‌, నడాల్‌, జొకోవిచ్‌ గత 20 ఏళ్లుగా టెన్నిస్‌ క్రీడారంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. 2003లో ఫెడరర్‌ తన తొలి టైటిల్‌ గెలిచిందిమొదలు..ఇప్పటివరకూ జరిగిన 71 గ్రాండ్‌స్లామ్స్‌లో ఈ ముగ్గురే 59 నెగ్గారంటే...ఇతర ఆటగాళ్లను వీరెంతగా బెదరగొడుతున్నారో అర్థమవుతుంది. ఈ మధ్యలో వీరికి బ్రేక్‌లు వేసింది ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే. కానీ వారిలో నిలకడ లేకపోయింది. ఇక నడాల్‌, జొకోవిచ్‌ మధ్య పోరు మరింత రసవత్తరంగా ఉంది. చివరి 12 గ్రాండ్‌స్లామ్స్‌ ట్రోఫీల్లో వీరిద్దరి దగ్గరే 11 (జొకో 7, నడాల్‌ 4) ఉండడం విశేషం. 2018లో ఫెడరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మాత్రమే గెలిచాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి వింబుల్డన్‌ సమరం సెర్బియా స్టార్‌కు మరింత కీలకం కాబోతోంది.


ఒకే ఒక్కడు...

ఆదివారం ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సిట్సిపాస్‌ పోరాటం చూస్తే కొత్త తరం వచ్చేసినట్టే అనిపించింది. కానీ రెండు సెట్లు ఓడినా జొకో పుంజుకున్న తీరును చూసిన వారు మాత్రం అమ్మో.. అనుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో నడాల్‌, సిట్సిపా్‌సలతో దాదాపు తొమ్మిది గంటలపాటు హోరాహోరీగా తలపడి గెలవడం చూస్తే నొవాక్‌ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. 2016 తర్వాత రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను అందుకున్న జోకర్‌ తన గ్రాండ్‌స్లామ్స్‌ సంఖ్యను 19కి పెంచుకోగా.. రెండేసి సార్లు నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ను సాధించిన ఆటగాడయ్యాడు. ఈ ఫీట్‌ తన చిరకాల ప్రత్యర్థులకు కూడా సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా ఈ విషయంలో తను దిగ్గజాలు రాడ్‌ లేవర్‌, రాయ్‌ ఎమర్సన్‌ సరసన నిలవడం మరో విశేషం. 




రాకెట్‌ వేగంతో..

34 ఏళ్ల జొకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్స్‌ వేట చిరుత వేగంతో సాగుతోంది. 2003లో ఫెడరర్‌.. 2004లో నడాల్‌ తమ తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించారు. కానీ జొకోవిచ్‌ మాత్రం చాలా ఆలస్యంగా 2008లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ద్వారా పోటీలోకొచ్చాడు. అయితే ఈ 13 ఏళ్లలోనే అతడు 19 గ్రాండ్‌స్లామ్స్‌ను ఖాతాలో వేసుకుని ప్రత్యర్థులిద్దరినీ దాదాపుగా అందుకోగలిగాడు. అందుకే ఈ విజయాలతో అతడు ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ ఎవరనే చర్చకు తెర లేపాడు. అంతేకాదు.. తను పోటీపడిన చివరి ఏడు స్లామ్స్‌లో ఆరింటిని గెలుచుకోవడం అతడి దూకుడును తెలుపుతోంది. ఇక 30వ పడిలోకి చేరాక  ఏడు గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకున్న మొదటి ఆటగాడయ్యాడు. అటు వరల్డ్‌ నెంబర్‌వన్‌ విషయంలోనూ 325 వారాలుగా కొనసాగుతూ ఈ విషయంలో ఫెడరర్‌, నడాల్‌ను ఎప్పుడో దాటేశాడు. మ్యాచ్‌ల విషయంలోనూ ఫెడెక్స్‌పై 27-23.. నడాల్‌పై 30-28 తేడాతో ముందంజలో ఉన్నాడు. కానీ ఓవరాల్‌ టైటిళ్ల విషయంలో మాత్రం ఫెడరర్‌ (108), నడాల్‌ (88)లకన్నా జొకో (84) వెనకబడ్డాడు. ఏదిఏమైనా ప్రస్తుత ఊపు చూస్తే రాబోయే వింబుల్డన్‌లోనూ జోకర్‌ జోరు ఆగేలా లేదు. విజేతగా నిలిస్తే మాత్రం అతడి ఖ్యాతి శిఖరాగ్రానికి చేరుకుంటుంది.






Updated Date - 2021-06-15T09:36:57+05:30 IST