అరుంధతి సినిమా చూశా.. నా అసలు పేరు అరుంధతే...

ABN , First Publish Date - 2020-06-10T21:58:46+05:30 IST

చిన్నప్పటి నుంచి నీట్‌గా ఉండడం అలవాటు. స్కూల్‌ రోజుల్లో కూడా అంతే. సమయం దొరికినప్పుడు చీరల షాపింగ్‌కు వెళ్తా.

అరుంధతి సినిమా చూశా.. నా అసలు పేరు అరుంధతే...

చిన్నప్పటి నుంచి నీట్‌గా ఉండటం అలవాటు

పక్కా తెలంగాణ వాదినే.. రాజకీయాలతో రాష్ట్రం రాదు

రాజకీయాల వల్లే బావతో విభేదాలు

24-01-2011న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో డీకే అరుణ


ఆర్కే: రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న మీరు గ్లామర్‌ ఎలా మెయింటెన్‌ చేయగలగుతున్నారు?

డీకే అరుణ: చిన్నప్పటి నుంచి నీట్‌గా ఉండడం అలవాటు. స్కూల్‌ రోజుల్లో కూడా అంతే. సమయం దొరికినప్పుడు చీరల షాపింగ్‌కు వెళ్తా.


ఆర్కే: మీ బావ సమరసింహారెడ్డితో వైరం ఎందుకు వచ్చింది?

డీకే అరుణ: పోట్లాడుకున్నదేమీ లేదు. రాజకీయాల్లో తేడాలొచ్చాయంతే. ఇప్పటికీ మేం మాట్లాడుకోవడం లేదు. నా భర్త భరతసింహారెడ్డికి రాజకీయం కంటే వ్యాపారం మీదే ఆసక్తి. దీంతో 1999లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ రావడంతో పోటీ చేశాను. అప్పుడు సమరసింహారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్పటి నుంచే దూరం పెరిగింది.


ఆర్కే: మీరు సమైక్యవాదా? తెలంగాణవాదా?

డీకే అరుణ: తెలంగాణ కోరుకుంటున్న వాళ్లమే. కూతురిని ఆంధ్రా పెళ్లి సంబంధం చేశామని నేను సమైక్యవాదిని కాను. తెలంగాణవాదినే.


ఆర్కే: తెలంగాణ ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ పార్టీ చెబితే మీ వైఖరి ఏంటి?

డీకే అరుణ: పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎందుకంటే ప్రజలందరి మనసుల్లో ఆ సెంటిమెంట్‌ బాగా నాటుకుపోయింది. ఉద్యోగాలు, నీరు ఇలాంటి కారణాల కంటే తమ మీద వేరే వాళ్ల పెత్తనం వద్దనేది ప్రజల్లో బలంగా ఉంది.


ఆర్కే: జగన్‌, తెలంగాణ సమస్యల నుంచి ఎలా బయటపడతారు?

డీకే అరుణ: అధికారంలో లేని పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి వైఎస్‌ కృషి చేసిన మాట వాస్తవం. పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిదీ. వైఎస్‌ ఆకాంక్ష కూడా అదే. జగన్‌ మరి ఎందుకు తొందరపడ్డారో అర్థం కావడం లేదు. సహనం పాటించి ఉంటే బాగుండేది. వైఎస్‌ ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదనే అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది.


ఆర్కే: తెలంగాణ కోసం అందరూ రాజీనామా చేయాలంటున్నారు?

డీకే అరుణ: రాజీనామాల వల్ల తెలంగాణ రాదు. రాజకీయంగా ఒత్తిడి తీసుకురావాలి. సమస్య పరిష్కారానికి మార్గాలు చూడాలి. రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ప్రజల భవిష్యత్తు దృష్ట్యా నాన్చకుండా నిర్ణయం తీసుకోవాలి.


ఆర్కే: న్యూస్‌ చానల్‌ పెట్టాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. నిజమేనా?

డీకే అరుణ: లేదు. ఒకప్పుడు భరతసింహారెడ్డి అనుకున్నారు గానీ, ఇప్పటి పరిస్థితుల్లో ఈ చానళ్లు వద్దు.. గొడవలొద్దు అనుకుంటున్నారు.


ఆర్కే: మీ మనసును బాగా కష్టపెట్టిన సంఘటన ఏంటి?

డీకే అరుణ: నాన్న, సోదరుడు ఒకే సమయంలో చనిపోవడం. చాలా పెద్ద షాక్‌... ఆ సంఘటనకు కారకుడైన సాంబశివుడిని క్షమించకూడదు. నాన్న, తమ్ముడే కాదు... ఎందరో అమాయకులను బలిగొన్నారు. నిజంగా సిద్ధాంతం కోసం పోరాడితే గౌరవిస్తాం. ఇవాళ రాజకీయాల్లో చేరారు. ఆయన ఎలా ప్రజా సేవ చేస్తాడో అర్థం కావడం లేదు.


ఆర్కే: 1500 కోట్ల ఆస్తులున్నాయని మాజీ నక్సల్‌ సాంబశివుడు ఓ బహిరంగ లేఖ రాశారు?

డీకే అరుణ: అది చూసి, మా తండ్రి చాలా బాధపడ్డారు. తనను టార్గెట్‌ చేస్తారని ఎప్పుడూ ఆయన ఊహించలేదు. ఎవరైనా 1500 కోట్లు ఇచ్చేస్తే... మా కుటుంబానికి సంబంధించిన ఆస్తంతా రాసిచ్చేస్తా. బినామీలున్నాయంటే అవి కూడా ఇచ్చేయడానికి సిద్ధం.


ఆర్కే: సినిమాలు చూస్తారా?

డీకే అరుణ: ఒకప్పుడు బాగా చూశాను. ఈ మధ్య రాజ్‌నీతి, రావణ్‌, అరుంధతి చూశాను.


ఆర్కే: అరుంధతి అంటే గద్వాల సంస్థానం అని చూశారా?

డీకే అరుణ: గద్వాల సంస్థానం.. అరుంధతి అంటే సినిమా ఎలా ఉంటుందో అని చూశాను. నా అసలు పేరు అరుంధతి. అందరూ అరుణ అని పిలవడంతో అలా మారిపోయింది. సర్టిఫికెట్లలో అరుంధతి అనే ఉంటుంది.


ఆర్కే: కారు డ్రైవింగ్‌ బాగా ఇష్టం కదా?

డీకే అరుణ: చాలా బాగా.. లాంగ్‌ డ్రైవ్‌ చేయడం ఇష్టం... ఎమ్మెల్యే అయ్యాక ఏకాగ్రత కష్టమని డ్రైవర్‌ను పెట్టుకున్నాను.

Updated Date - 2020-06-10T21:58:46+05:30 IST