డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ముమ్మరం

ABN , First Publish Date - 2021-02-25T05:21:03+05:30 IST

డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ముమ్మరం

డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ముమ్మరం

 రంగంలోకి అధికారులు

 జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు 

 రిజర్వేషన్లపై కార్పొరేటర్లలో ఆందోళన


వరంగల్‌ సిటీ, ఫిబ్రవరి 24: డివిజన్‌ల పునర్విభజన కసరత్తును జీడబ్ల్యూఎంసీ అధికారులు ముమ్మరం చేశారు. డీ లిమిటేషన్‌ షెడ్యూల్‌ మంగళవారం విడుదల కావడంతో ఈ మేరకు అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పునర్విభజన ప్రక్రియ నిర్వహణకు డివిజన్‌ బాటపడుతున్నారు. టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగం సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. 2016లో జరిగిన డివిజన్‌ల పునర్విభజన ద్వారా 53గా ఉన్న డివిజన్‌ల సంఖ్య 58కి పెరిగింది. ఇందులో 42 గ్రామాలు విలీనమయ్యాయి. 11 లక్షల జనాభాతో 58 డివిజన్‌లు ఏర్పడ్డాయి. ఒక్కో డివిజన్‌కు 12వేల నుంచి 14వేల జనాభాతో డివిజన్‌లు నెలకొన్నాయి. మళ్లీ ఇప్పుడు జరిగే పునర్విభజన ద్వారా 58గా ఉన్న డివిజన్‌లు 66కు పెరగనున్నాయి. డివిజన్‌ల సంఖ్య పెరగనుండడంతో ఒక్కో డివిజన్‌లో జనాభా సంఖ్య 12వేల వరకే పరిమితం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.


డివిజన్‌లోని జనాభా, ఓటర్లు, రోడ్డు కనెక్టివిటి, ప్రధాన హద్దులు, ఇత రత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని డివిజన్ల స్వరూపాన్ని నిర్ణయిస్తారు. డివిజన్ల విభజనతో రిజర్వేషన్‌లు కూడా మారనున్నాయి. ఈక్రమంలో సిట్టింగ్‌ కార్పొరేటర్లలో ఆందోళన నెలకొంది. రిజర్వేషన్‌లు మారితే ప్రస్తుత తమ డివిజన్‌ ఏ సామాజిక వర్గానికి వస్తుందోనని ఆందోళనతో ఉన్నారు. డివిజన్‌ సంఖ్య పెరగడంతో కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం దక్కనుందనే ఆశలతో మరికొందరున్నారు.


మొత్తంగా డీ లిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి తర్వాత రిజర్వేషన్‌ల అంశం తేలనుంది. అప్పటి వరకు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు ఉత్కంఠ తప్పదు. డీ లిమిటేషన్‌ నిర్వహణ కోసం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు కానుంది. ఆదే విధంగా టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటుకానున్నాయి. జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి సెలవుపై వెళ్లారు. షెడ్యూలు విడుదల కావడంతో అఽధికారులతో ఆమె బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. డీ లిమిటేషన్‌ నిర్వహణకు సంబంధించి దిశానిర్ధేశం చేశారు. నేడో, రేపో కమిషనర్‌ వరంగల్‌కు రానున్నారు. వచ్చిన వెంటనే అధికారులతో సమావేశమై పనులను వేగిరం చేయనున్నారు.  



Updated Date - 2021-02-25T05:21:03+05:30 IST