మెడికల్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఎంఈ

ABN , First Publish Date - 2021-11-28T06:18:02+05:30 IST

నల్లగొండ మెడికల్‌ కళాశాలను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమే్‌షరెడ్డి శనివారం తనిఖీ చేశారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వారం రోజుల్లో రెండుసార్లు తరగతులు బహిష్కరించి ధర్నా చేశారు.

మెడికల్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఎంఈ
మెడికల్‌ కళాశాలను పరిశీలిస్తున్న డీఎంఈ రమేష్‌రెడ్డి

సమస్యలు వివరించిన విద్యార్థులు

అధికారులతో సమీక్ష, ఆస్పత్రిలో సౌకర్యాల పరిశీలన


నల్లగొండ అర్బన్‌, నవంబరు 27: నల్లగొండ మెడికల్‌ కళాశాలను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమే్‌షరెడ్డి శనివారం తనిఖీ చేశారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వారం రోజుల్లో రెండుసార్లు తరగతులు బహిష్కరించి ధర్నా చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇక్కట్లపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో డీఎంఈ స్పందించి కళాశాలను సందర్శించారు. కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. లెక్చరర్‌ గ్యాలరీలు లేకపోవడంతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేకపోతున్నామని కళాశాల అధికారులు డీఎంఈకి వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థినులు, విద్యార్థులకు ఒకేచోట హాస్టల్‌ సౌకర్యం కల్పించాలన్నారు. త్వరలో రానున్న కొత్త విద్యార్థులకు సైతం అనువైన హాస్టల్‌ భవనాన్ని ఏర్పాటు చేయాలని, లెక్చరర్‌ గ్యాలరీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్‌, కళాశాలలో ల్యాబ్‌ల పరిస్థితి, లెక్చరర్‌ గ్యాలరీలు, ఆపరేషన్‌ థియేటర్‌ సమస్యలను విద్యార్థులు డీఎంఈకి వివరించారు. ఎన్‌ఎంసీ నిబంధనలను కళాశాల్లో ఏఒక్కటీ పాటించడంలేదని విద్యార్థులు వాపోయారు. సమస్యలను విన్న డీఎంఈ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను డీఎంఈ రమే్‌షరెడ్డి స్వయంగా పరిశీలించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం వైద్యులతో చర్చించి వివరాలు అడిగితెలుసుకున్నారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణుల తాకిడి అధికంగా ఉందని, ఇక్కడి వసతులు సరిపోవడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జయ్‌సింగ్‌ రాథోడ్‌ డీఎంఈ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు పడకలు మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని డీఎంఈ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ మాతృనాయక్‌, పలువురు వైద్యులు ఉన్నారు.


ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మాట్లాడలేను : రమే్‌షరెడ్డి, డీఎంఈ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా మీడియాతో తాను ఏమీ మాట్లాడలేనని డీఎంఈ రమే్‌షరెడ్డి తెలిపారు. కళాశాల సమస్యలు, నూతన భవన నిర్మాణం. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించగా, ఎన్నికల దృష్ట్యా ఏమీ మాట్లాడనని స్పష్టం చేశారు.


Updated Date - 2021-11-28T06:18:02+05:30 IST