కొవిడ్‌ బాధితుల కోసం

ABN , First Publish Date - 2021-05-17T06:15:26+05:30 IST

శ్రీకాళహస్తి, ఏర్పేడుల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు చిత్తూరు అధికారులు చర్యలు చేపట్టారు.

కొవిడ్‌ బాధితుల కోసం
స్కిట్‌ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య

శ్రీకాళహస్తి/ఏర్పేడు, మే 16: శ్రీకాళహస్తి, ఏర్పేడుల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి స్కిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చేపట్టిన చర్యలను డీఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య పరిశీలించారు. సోమవారం ఈ కేంద్రం ప్రారంభించాల్సినా, విద్యుత్తు, పడకల ఏర్పాటు పనులు పూర్తి కాకపోవడంతో ప్రారంభం వాయిదా పడింది. మరో మూడురోజుల్లో పనులు పూర్తి చేసేందుకు అఽఽధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంఅండ్‌హెచ్‌వో సూచించారు. పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న ఫీవర్‌ సర్వేపైనా ఆరా తీశారు. పాజిటివ్‌ బాధితులు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పనులపై మాత్రమే బయటికి రావాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం ఇన్‌చార్జి కమిషనరు వెంకట్రమణ, డాక్టర్లు చంద్రమోహన్‌, సాగరిక, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో..

ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ హరినారాయణన్‌ నిర్ణయించారు. దీంతో ఆదివారం ఆర్డీవో కనకనరసారెడ్డి ఐఐటీ తరగతి గదులు, హాస్టల్‌, పరిపాలన భవనాలు తదితర వాటిని పరిశీలించారు. గదుల్లో ఏర్పాటు చేసే పడకల సంఖ్య ఇతర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు సంతోష్‌, భాస్కర్‌, సర్వేయర్లు శేషంరాజు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T06:15:26+05:30 IST